రైవాడ దగ్గర ప్రతిపాదించిన 900 మెగావాట్ల ఓపెన్ లూప్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ (PSP) కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని అనుమతులను తక్షణమే రద్దు చేయాలని మానవ హక్కుల వేదిక (HRF) డిమాండ్ చేస్తోంది. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం, విజయనగరం జిల్లా వేపాడ మండలంలో ఈ ప్రాజెక్టును అదానీ ఎనర్జీ హైడ్రో వన్ లిమిటెడ్ (AEHOL) చేపట్టనుంది. అది అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL)కు చెందిన సంస్థ. 2025 జూన్ 30న వెలువడిన జి.ఓ. 51 ద్వారా ప్రాజెక్టు సామర్థ్యాన్ని 600 మెగావాట్ల నుండి 900 మెగావాట్లకు పెంచుతూ ఇచ్చిన అనుమతిని కుడా తక్షణమే వెనక్కి తీసుకోవాలి.
నలుగురు సభ్యుల హెచ్. ఆర్. ఎఫ్ బృందం 26-7-2025న, మళ్ళీ 6-8- 2025 నాడు దేవరాపల్లి, వేపాడ మండలాల్లోని పలు గ్రామాలను సందర్శించింది. ఈ ప్రాజెక్ట్ వస్తే తమ భూములకు, అడవికి, నీటి వనరులకు ముప్పు కలుగుతుందని భావిస్తున్న స్థానిక ప్రజలతో మేము మాట్లాడాము. వీరిలో అత్యధికులు ఆదివాసులే. AEHOL సంస్థ చింతలపూడి పంచాయతీలో సమ్మెద గ్రామం సమీపంలో దిగువ ఆనకట్టను, వేపాడ మండలంలో కరకవలస పంచాయతీలో కొండపై ఉన్న మారిక గ్రామం వద్ద ఎగువ ఆనకట్టను నిర్మించాలనుకుంటోంది. ఇందుకోసం ప్రభుత్వం చింతలపూడి పంచాయతీలో సుమారు 549 ఎకరాలు, మారిక గ్రామంలో 213.8 ఎకరాలను సేకరించి AEHOL ఇవ్వాలని చూస్తోంది. ఈ చర్య, ఆదివాసులను వారి భూముల నుండి దూరం చేసి, పర్యావరణాన్ని నాశనం చేస్తుంది.
జి.ఓ. 51 ద్వారా PSPకి నీటి కేటాయింపును 9 మిలియన్ క్యూబిక్ మీటర్ల (MCM) నుండి 23 MCMకు భారీగా పెంచారు. దీని ద్వారా రైవాడ జలాశయానికి నీటిని సమకూర్చే శారదా నది పరివాహక ప్రాంతం నుండి ఈ ప్రాజెక్టుకు నేరుగా నీటిని మళ్లించనున్నారు. రైవాడ జలాశయం దేవరాపల్లి, కె. కోటపాడు, చోడవరం మండలాల్లో 44 గ్రామాల్లో 15,344 ఎకరాల పంటభూములకు సాగునీరు అందిస్తుంది. అలాగే, విశాఖపట్నం నగరానికి త్రాగునీటికి ప్రధాన వనరుగా ఉంది. శారదా నది మరో 6,000 ఎకరాలకు అనధికారికంగా సాగునీరు అందించడంతో పాటు అనకాపల్లి, కశింకోట, మునగపాక, యలమంచిలి, రాంబిల్లి మండలాల రైతులకు దిగువ ప్రవాహ హక్కులను కల్పిస్తుంది. ఈ ముఖ్యమైన నీటి వనరును PSP కోసం మళ్లించడం అంటే ఈ ప్రాంత వాసుల జీవనోపాధికి, వ్యవసాయానికి, త్రాగునీటి భద్రతకు ముప్పు కలిగించడమే అవుతుంది.
దిగువ ఆనకట్ట కోసం స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న సమ్మెద, పల్లపుకోడాబు, చింతలపూడి (తామరబ్బ, చింతలపూడి పంచాయతీలు) రెవెన్యూ గ్రామాల భూములు అత్యంత సారవంతమైనవి. అక్కడ ప్రధానంగా నివసించేది ఆదివాసులే. ఇటువంటి వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకోవడం వల్ల స్థానిక ప్రజల జీవనోపాధికి తీవ్రమైన విఘాతం కలుగుతుంది.
మారిక రిజర్వ్ ఫారెస్ట్లోని ఎగువ ఆనకట్ట కోసం ప్రతిపాదించిన 213.08 ఎకరాల భూసేకరణ, గ్రామాన్ని పూర్తిగా తరలించడంతో పాటు ఆదివాసుల జిరాయితి హక్కులను తుడిచివేసి, వారి స్వయం సమృద్ధి జీవనాన్ని నాశనం చేస్తుంది. మారికలో మొత్తం 103 కుటుంబాలు నివసిస్తున్నాయి. పాత మారికలో 76 కొండదోర కుటుంబాలు, కొత్త మారికలో 27 కొందు (అత్యంత బలహీన ఆదివాసి వర్గం PVTG) కుటుంబాలు ఉన్నాయి. ఈ ప్రజలు తమ ఇళ్లు, భూములు, సాంస్కృతిక వారసత్వం అన్నీ కోల్పోతారు.
మారిక కొండ మీదున్న పుష్కలమైన నీరు, అటవీ ఉత్పత్తులు, సారవంతమైన నేల ఆదివాసులకు జీవనాధారం. అక్కడ వారు ఎటువంటి రసాయనిక ఎరువులు, మందులు వాడకుండా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. అప్పుడప్పుడు రెండు పంటలు వరి కూడా పండిస్తారు. జొన్నలు, రాగులు, పప్పులు, పెసలు, ఉలవలు పండిస్తున్నారు. పనస, జామ, చింత, జీడిపప్పు, కొబ్బరి, సీతాఫలం వంటి పండ్లతో ఈ ప్రదేశం నిండి వుంటుంది.
సంవత్సరమంతా పారే ‘మారిక గెడ్డ’ ఈ కొండ మీదే పుట్టి శారదా నదిలో కలుస్తుంది. ఇది దేవరపల్లి మండలంలో నాగయ్యపేట పంచాయతీ రైతులకు, అలాగే వేపాడ మండలంలో వావిలపాడు, వీలుపర్తి పంచాయతీల గ్రామాలకు సాగు నీటిని అందిస్తుంది. ఈ ప్రాజెక్టు వస్తే మారిక ఆదివాసులతోపాటు మైదాన ప్రాంతాల రైతులు కూడా నీటి భద్రతను కోల్పోతారు.
మారిక, తామరబ్బ, చింతలపూడి పంచాయతీల గ్రామస్తులు ఈ ప్రాజెక్టుకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ ఏడాది పలు మార్లు వారు అధికారులను సర్వేలు చేయకుండా అడ్డుకున్నారు, మండల కార్యాలయాల వద్ద నిరసనలు నిర్వహించారు.
ఈ PSPలను హరిత ప్రాజెక్టులుగా ప్రచారం చేస్తున్నా, వాస్తవానికి అవి స్థానిక పర్యావరణాన్ని దెబ్బ తీస్తాయి. అవి అడవిని, జీవ వైవిధ్యాన్ని నాశనం చేయడమే కాక సహజ నీటి ప్రవాహాలకు అంతరాయం కలిగిస్తాయి. PSPలు స్థానిక నీటి వనరులను ఆక్రమించి, ఆదివాసుల జీవనాధారాన్ని ధ్వంసం చేస్తాయి. ఇవి నదులు, భూములు, అడవులు వంటి సామూహిక వనరులను ప్రైవేటీకరిస్తాయి. భారీ స్థాయిలో బలవంతపు భూసేకరణలు హింసాత్మక విస్థాపనకు దారి తీస్తాయి. ‘క్లీన్, గ్రీన్ ట్రాన్సిషన్’ అనేది భూవనరులను, నీటి వనరులను అదాని లాంటి కార్పొరేట్ సంస్థలు దోచుకోవడానికి ఒక నెపం మాత్రమేననే అభిప్రాయం బలంగా ఉంది.
గతంలో HRF ఉత్తరాంధ్రలోని ఇతర PSP ప్రతిపాదనలపై వాస్తవాలను సేకరించింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు, ప్రస్తుత ప్రభుత్వం విస్తరించిన అనుమతులు ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో విపత్తుకు కారణమవుతాయని మేము భావిస్తున్నాము. ప్రభుత్వం రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ నిబంధనలను పూర్తిగా బేఖాతర చేస్తూ ప్రైవేట్ సంస్థలకు ఈ PSPలను అప్పజేపుతోంది. ASR జిల్లాలోని చింతపల్లి మండలం యర్రవరం PSP తాండవ నది పరీవాహక ప్రాంతంలో నీటిని మళ్లించాలని చూస్తుంది. దీని వల్ల 34 ఆదివాసి నివాసాలు ముంపుకు గురవుతాయి. అలాగే తాండవ రిజర్వాయర్పై ఆధారపడి ఉన్న దిగువ రైతులు నష్టపోతారు. రైవాడ PSPకు సమీపంలోని అనంతగిరి మండలం పెదకోట PSP సామర్థ్యాన్ని జి.ఓ. 51 ద్వారా 1,000 మెగావాట్ల నుండి 1,800 మెగావాట్లకు పెంచారు. ఇది కూడా రైవాడ జలాశయంలో కలిసే తమటపుగెడ్డ నుండి నీటిని మళ్ళిస్తుంది.
మా డిమాండ్లు:
- రైవాడ PSPకి సంబంధించిన జి.ఓ. 51 అనుమతులను తక్షణమే రద్దు చేయాలి.
- భూసేకరణ, నీటి మళ్లింపు ప్రణాళికలను రద్దు చేయాలి.
- ఎర్రవరం, పెదకోట PSPల ప్రతిపాదనలను కూడా వెన్నక్కి తీసుకోవాలి.
- ఐదవ షెడ్యూల్ ప్రాంతాల రాజ్యాంగ పరిరక్షణలను కచ్చితంగా పాటించాలి.
కె.వి. జగన్నాథరావు – HRF ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు
కె. అనురాధ – HRF ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు
వి.ఎస్. కృష్ణ – HRF ఏపీ & తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యులు
11-8-2025,
విశాఖపట్నం.