రాజేష్ మృతిపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో రీ-పోస్టుమార్టం జరపాలి
బాధ్యులపై హత్య కేసు నమోదు చేసి ఉద్యోగం నుంచి తొలగించాలి
రాజేష్ ది ముమ్మాటికి కస్ట్టోడియల్ డెత్ పోలీసులపై 302 సెక్షన్ కింద కేసు పెట్టాల్సిందే……
కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ మృతి ముమ్మాటికీ కస్టోడియల్ డెత్ అని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి మోహన్ స్పష్టం చేశారు. శుక్రవారం కోదాడలో పర్యటించిన మానవ హక్కుల వేదిక బృందం సభ్యులు మృతుడి తల్లితో పాటు చిలుకూరు పోలీస్ స్టేషన్, హుజూర్నగర్ జైలు అధికారుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ విచారణ పేరుతో పోలీసులు రాజేష్‌పై విచక్షణారహితంగా బలప్రయోగాన్ని ప్రయోగించారని ఆరోపించారు. తీవ్రమైన దెబ్బల వల్లే రాజేష్ ఆరోగ్యం క్షీణించి మరణించాడని, దీనిపై వాస్తవాలు వెలుగులోకి రావాలంటే మృతదేహాన్ని వెలికితీసి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నిపుణులతో రీ-పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన పోలీస్ అధికారులను వెంటనే విధుల్లోంచి తొలగించి, వారిపై సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేసి తక్షణమే బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారాన్ని అందించి వారి కుటుంబానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు స్పష్టం చేశారు. రాజేష్ మృతికి న్యాయం జరిగేంతవరకు మానవ హక్కుల వేదిక అండగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక ఈ.సి మెంబెర్ మోహన్, ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు అక్కనపల్లి వీరస్వామి, ప్రధాన కార్యదర్శి అద్దంకి దశరథ, ప్రసాద్, వెంకటరమణ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ, ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు భూక్య రవి నాయక్ , కర్ల కమల్, తదితరులు పాల్గొన్నారు
02-01-2026,
కోదాడ.