ఆగష్టు 22 నాడు అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ (యా.ఆర్.ఎస్) విద్యార్థులు 12 మంది పురుగుల మందు కలిపిన నీళ్లు తాగడం వల్ల అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సమాచారాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న మానవ హక్కుల వేదిక నలుగురు సభ్యుల నిజనిర్ధారణ బృందం ఇవ్వాలా (24- 08- 2025 న) విద్యార్థులు చికిత్స పొందుతున్న భూపాలపల్లి వంద పడకల ఆసుపత్రికి చేరుకొని చికిత్స పొందుతున్న విద్యార్థులతో వారి తల్లిదండ్రులతో మరియు పాఠశాలకు చేరుకుని పాఠశాలలో ఉన్న విద్యార్థులు పాఠశాల ప్రత్యేక అధికారి ఇతర సిబ్బందిని కలిసి వివరాలు సేకరించడం జరిగింది.
సంఘటన జరిగిన రోజు ఉదయం విద్యార్థులు రోజు వారీగా టిఫిన్ తిన్న తరువాత మంచినీళ్ళు తాగడానికి వెళ్ళారు. ఆ సమయంలో ముందుగా తాగిన విద్యార్థులు కొంతమంది నీళ్లు ఏదో వాసన వస్తున్నవి అని తోటి విద్యార్థులకు చెప్పడంతో మిగతా విద్యార్థులనువా నీళ్లు తాగకుండా ఉంచి త్రాగునీరున్న ఆ డ్రమ్మును పరిశీలించగా అందులో ఎవరో క్రిమిసంహారక మందు కలిపినట్టుగా గుర్తించిన పాఠశాల ప్రత్యేక అధికారి వెంకన్న మిగతా విద్యార్థులు ఆ నీరు తాగకుండా చూశారు. అప్పటికే తాగిన విద్యార్థులలో వాంతులు, తల తిరగడం మొదలైందని చెప్పగా వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికీ విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏడవ తరగతికి చెందిన శ్రావణ్ 22 వ తారీకు నుండి ఐ.సి.యూ లో ఉండి చికిత్స పొందుతున్నాడు.
ఈ మొత్తం సంఘటన గురించి విద్యార్థులను విచారించగా ఆ రోజు రాత్రి డ్యూటీలో ఉన్న సైన్స్ ఉపాధ్యాయుడు నీళ్ళ ట్యాంక్ వద్ద ఏదో కలుపుతున్నటుగా మేము చూసాము కానీ అంతగా పట్టించుకోలేదు అన్నారు. పాఠశాలలో విద్యార్థులను సిబ్బందిని విచారిస్తే ఆ సంఘటన జరిగిన రోజు ఉపాధ్యాయులు రాజేందర్ ఎనిమిదవ తరగతి విద్యార్థులందరిని బయటకి పంపి అతను గదిలో తలుపులు మూసి కాసేపటికి బయటకి వచ్చారు అన్నారు. ఆ రోజు సాయంత్రమే విద్యార్థులు వారివారి బెడ్షీట్లు సర్దుకుంటుండగా క్రిమిసంహారక మందు ఉన్నటువంటి ఒక సీసాను కనుగొన్నామని దానిని సిబ్బందికి చూపించగా దానిని బీరువాలో దాసి నిన్న పాఠశాలకు వచ్చిన MLA గారికి, ఇతర అధికారులకు అందించినట్టుగా తెలిపారు.
ఈ మొత్తం సంఘటన వెనుక పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు రాజేందర్ ఉన్నట్టుగా విద్యార్థులు చెబుతున్నారు. ఐతే దీని పూర్వాపరాలు ఏంటని పాఠశాల ప్రత్యేక అధికారిని అడుగగా పాఠశాలలో సిబ్బంది మధ్య వ్యక్తిగతమైన విబేధాలు ఉన్నట్టుగా చెబుతున్నారు. మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ బృందం పాఠశాల విద్యార్థుల త్రాగునీరులో విషం కలిపిన సంఘటనపై లోతైన విచారణ చెయ్యాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు పేర్కొన్నట్టుగా ఇందుకు కారణమని భావిస్తున్న రాజేందర్ అనే ఉపాధ్యాయుడు మరియు ఇతర బాధ్యులపై ముందుగా హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ జరిపి నిందితులను చట్టప్రకారం శిక్షించాలని మానవ హక్కుల వేదికగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కారకులైన నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లుగా అధికారులు పేర్కొన్నారు కానీ సత్వరమే విచారణ చేసి ఆ ఉద్యోగులను పూర్తిగా తొలగించాలి. ఆ రాజేందర్ అనే ఉపాధ్యాయుడు కానీ ఇతర సిబ్బంది కానీ వ్యక్తిగతమైన విభేదాలతో ఇంతటి దారుణానికి ఒడిగట్టడం ఎవరమూ క్షమించరాని నేరం.
సుమారు 32మంది ఉన్న పాఠశాలలో ఒకటే రోజు 12మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైనారు. మేము ఆసుపత్రిలో విచారణ చేస్తున్న క్రమంలోనే ఇంకొక విద్యార్థి ఆ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల నుండి తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరడం గమనార్హమని చెబుతూ ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులందరికీ మెరుగైన వైద్యాన్ని అందించాలని అన్నారు. అంతేకాక పాఠశాలలో పనిచేస్తున్న ఇంకొక ఇద్దరు ఉపాధ్యాయులు సూర్యకిరణ్, వేణులు చెపితే వినకున్నా లేదా విద్యార్థులు ప్రశ్నిస్తే మనసులో ఉంచుకుని కక్షపూరితంగా వ్యవహరిస్తూ కొడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారని వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు.
పాఠశాలలో విద్యార్థులతో తల్లిదండ్రులతో మాట్లాడిన తరువాత వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ నిజనిర్ధారణ కమిటీ ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను పెట్టింది.
డిమాండ్లు:
- సంఘటనకు కారకులైన అందరిపైన హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేసి విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలి.
- పాఠశాల పరిసరాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చెయ్యాలి.
- ప్రస్తుతమున్న పాఠశాల రేకుల గృహాలలో నిర్వహిస్తున్నందున వర్షాకాలం గదులన్నీ ఉరుస్తూ ఇబ్బందులు పడుతున్నందున పక్కా భవనం నిర్మించి విద్యార్థులను అందులోకి మార్చాలి.
- పాఠశాల విద్యార్థులు నేలమీదనే పడుకుంటున్నారు. కావున ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి వెంటనే ఆ విద్యార్థులకు పడుకోవటానికి బెడ్స్ ఏర్పాటుచేయాలి.
- పాఠశాలలో హిందీ,ఫిజిక్స్ బోధించే ఉపాధ్యాయులు లేనందున ఆ సబ్జెక్ట్స్ ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పిల్లలే ఇందులో సదువుకుంటున్నందువల్లే ప్రభుత్వం ఈ పాఠశాలలో ఉంటున్న విద్యార్థులకు సరైన వసతులు కల్పించడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కావున ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం మెరుగైన వసతులు కల్పించి,నాణ్యమైన విద్యా ప్రభుత్వ విద్యాసంస్థలలో అందేవిధంగా చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది
కార్యక్రమంలో వేదిక ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు దిలీప్.వి, జిల్లా ఉపాధ్యక్షులు పాలకుర్తి శ్రీనివాస్,కార్యదర్శి కర్ణాటక సమ్మయ్య,కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శంకర్ మరియు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు సేవానాయక్ తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి,
24.08.2025