ఉలవపాడు మండలంలో బిపిసిఎల్ రిఫైనరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలి

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) వారి ప్రాజెక్ట్ కోసం నెల్లూరు జిల్లా కందుకూరు డివిజన్ ఉలవపాడు మండలం లోని తీర ప్రాంతంలో భారీ స్థాయి భూసేకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) డిమాండ్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగితే కనుక స్థానికంగా జరిగే విధ్వంసం చెప్పరానిదిగా ఉంటుంది.

         ఈ ప్రాంతంలో 6000 ఎకరాలలో బిపిసిఎల్ సంవత్సరానికి 9 మిలియన్ మెట్రిక్ టన్స్ సామర్ధ్యంతో (9mmtpa) చమురు శుద్ధి రిఫైనరి మరియు పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మించదలచిందని, అలాగే భవిష్యత్తు అవసరాల కోసం ఇంకొక 10,000 ఎకరాలు కూడా సేకరించే ఉద్దేశ్యంతో ఉందనే వార్తా కథనాల నేపధ్యంలో మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్), రాష్ట్ర చేనేత జన సమాఖ్య, మత్స్యకార సంఘం ఈ ప్రాంతంలో ఫిబ్రవరి 24, 2025 నాడు నిజ నిర్ధారణ చేపట్టాయి. ఉలవపాడు మండలంలోని కరేడు, చాకిచర్ల, పెద పట్టపుపాలెం పంచాయతీలలో ఎనిమిది గ్రామాల ప్రజలతో మేము మాట్లాడాము. ఈ గ్రామాలన్నీ కూడా బంగాళాఖాతం, జాతీయ రహదారి 16 మధ్య ఉన్నాయి. వీటికి ఉత్తరాన మన్నెరు నది సరిహద్దు కాగా, దక్షిణాన రామాయపట్టణం నౌకాశ్రయం సరిహద్దు. మేము ముఖ్యంగా రైతులతో, రైతు కూలీలతో, మత్య్సకారులతో (పట్టపు, పల్లెకారు), అలాగే ఈ గ్రామాలలో గణనీయమైన సంఖ్యలో ఉన్న షెడ్యూల్డ్ ట్రైబ్ అయిన యానాది వారితో మాట్లాడాము.

         ఈ మూడు పంచాయతీల ప్రజలకి ప్రధానమైన ఆదాయ వనరు వ్యవసాయం, చేపల వేట. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు కేవలం 15 అడుగుల లోతులో లభ్యమవ్వడంతో వ్యవసాయం సమృద్ధిగా ఉంది.  స్థానిక కరేడు చెరువు కింద 1300 ఏకరాలకి పైగా ఆయకట్టు ఉంది. ఇదే చెరువు పల్లెకారులకి, యానాదులకి చేపలు పట్టుకోవడానికి ఆధారం కూడా. ఈ పంచాయతీలలో కరేడు చెరువే కాకుండా సీతమ్మ చెరువు, కొత్త చెరువు, గోకుల చెరువు, జమ్ముల చెరువు కూడా ఉన్నాయి. ఈ ఒకొక్క చెరువు కింద 300-350 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో వరి ప్రధానమైన పంట. ఈ గ్రామాలలో మత్స్యకారులతో సహా ఎక్కువ మంది ఆధారపడుతున్నది వ్యవసాయం మీదనే. వరి, వేరుశెనగ, పత్తి, మినుములు, పెసలు, వివిధ కూరగాయలు, ఆకు కూరలు ముఖ్యమైన పంటలు. చిన్న చాకిచర్ల లాంటి గ్రామాలలో అయితే ప్రజలు పూర్తిగా చేపల వేట మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. అదే విధంగా పెద పట్టపుపాలెం గ్రామంలో కూడా అనేక మంది బంగాళాఖాతంలో చేపల వేట మీద ఆధారపడతారు.

         ఈ గ్రామాలలో ప్రజలు తాము ఈ ప్రాజెక్టుకి పూర్తిగా వ్యతిరేకం అని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ పెట్రోకెమికల్ ప్రాజెక్ట్, దాని కారణంగా ఉత్పన్నమయ్యే కాలుష్యం, ప్రాజెక్ట్ కోసం జరిగే భూ సేకరణ కారణంగా తమ ఆర్థిక జీవితం శాశ్వతంగా దెబ్బతింటుందని, తమ జీవనోపాధులు పూర్తిగా ధ్వంసం అవుతాయని గట్టిగా నమ్ముతున్నారు. కొన్ని గ్రామాలలో అయితే ఈ ప్రాజెక్ట్ కారణంగా తాము విస్తాపనకి గురవ్వాల్సి వస్తుంది అనే కోపం, ఆందోళన ఉన్నాయి.

         రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్స్ తో సహా వివిధ పద్ధతులలో చేపడుతున్న సర్వేల గురించి గ్రామస్తులలో అనేక సందేహాలు నెలకొన్నాయి. తమకి ఈ ప్రాజెక్ట్ గురించి ప్రభుత్వం ఏ సమాచారం ఇవ్వలేదని, అన్ని విషయాలని గోప్యంగా ఉంచుతున్నదని వారు తెలిపారు. బిపిసిఎల్ పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ గురించి వార్తా కథనాలు మొదలయినప్పటి నుండి స్థానికులు కలిసికట్టుగా తమ వ్యతిరేకతను తెలియచేస్తూనే ఉన్నారు. ఫిబ్రవరి 14 నాడు అలగాయపాలెం గ్రామంలో జరిగిన సభలో మత్స్యకారులు ఈ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేశారు.

రిఫైనరీ విస్తీర్ణం:

9 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు శుద్ధి రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కోసం తొలి విడతలో 6,000 ఏకరాలు, భవిష్యత్తు విస్తరణ కోసం ఇంకొక 10,000 ఎకరాలు తీసుకోవాలనుకోవడం పూర్తిగా ఆక్షేపణీయం. ఉదాహరణకి తమిళనాడు మనాలిలో ఉన్న చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (సిపిసిఎల్) 10 mmtpa సామర్ధ్యం కలిగిన రిఫైనరీ విస్తీర్ణం కేవలం 800 ఎకరాలలో ఉంది. అలాగే విశాఖపట్టణంలో 15 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ పి సి ఎల్) రిఫైనరీ విస్తీర్ణం దాదాపుగా 900 ఎకరాలే. అదే విధంగా ఒడిశాలోని పరదీప్ లో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఇఓసిఎల్) 15 mmtpa  రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ విస్తీర్ణం 3350 ఎకరాలు. ఇవన్నీ సాపేక్షిక్షంగా తక్కువ విస్తీర్ణంలో ఉండగా, ఉలవపాడులో బిపిసిఎల్ రిఫైనరీ కోసం కోరతున్న భూమి విస్తీర్ణం (భవిష్యత్తు అవసరాలతో సహా) ఎంతవరకు సబబు? ప్రజల జీవితాలని, వారి భవిష్యత్తుని పణంగా పెట్టి ఇంత భూమి ఎందుకు సేకరించాలి?

         కావున, ఉలవపాడు మండలంలో బిపిసిఎల్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని హెచ్ఆర్ఎఫ్ డిమాండ్ చేస్తున్నది.

మేము పర్యటించిన గ్రామాలు:

కరేడు, కొత్త పల్లి పాలెం, టెంకాయచెట్ల పాలెం, బట్టిసోమయ్య పట్టిపాలెం, అలగాయపాలెం, చాకిచర్ల పల్లిపాలెం, పెద పట్టపుపాలెం, బాలకోటయ్య యానాది సంఘం

వి.ఎస్. కృష్ణ – హెచ్ఆర్ఎఫ్ ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు
వై. రాజేష్ – హెచ్ఆర్ఎఫ్ AP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
జి. రోహిత్ – హెచ్ఆర్ఎఫ్ AP రాష్ట్ర కార్యదర్శి
ఎం. మోహన్ రావు – రాష్ట్ర చేనేత జన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు
పి. దుర్గా రావు – మత్స్యకార సంఘం

27-02-2025,
నెల్లూరు.

Related Posts

Scroll to Top