వినాయక నిమజ్జనం సందర్బంగా అశోక్, రంగస్వామిని పై దాడికి పాల్పడిన సి.ఐ శ్రీనివాసులును విధుల నుంచి తొలగించాలి

వినాయక నిమజ్జనం సందర్బంగా ఎమ్మిగనూరు పట్టణంలో 31 ఆగస్టు, 2025 తేదిన రాత్రి నిర్దేశించిన మార్గంలో కాకుండ, ఊరేగింపును వేరే మార్గంలో మళ్ళించిన, ఆటో డ్రైవర్ అశోక్, DJ ఆపరేటర్ రంగస్వామిని పట్టణ సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసులు చట్టప్రకారం చర్య తీసుకోకుండా, వారిపై భౌతిక దాడిచేసి, దౌర్జన్యానికి పాల్పడడాన్ని మానవ హక్కుల వేదిక (HRF), మాల మహానాడు ( MMN) సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ ఘటన విషయమై బాధితులు అందుబాటులో లేనందున, విశ్వ హిందూ పరిషత్ (VHP) స్థానిక బాద్యులు ఉపేంద్రరెడ్డిని, శ్రీనివాసులును విచారించడం జరిగింది. సి.ఐ దౌర్జన్యం జరిపిన వైరల్ అయిన వీడియోను పరిశీలించడం జరిగింది. పోలీసు అధికారులైన సి ఐ, డిఎస్పీ లను కలవాలనుకున్నా, వారు కర్నూలు వినాయక నిమజ్జనం కార్యక్రమానికి వెళ్లడంవల్ల కలవడానికి వీలు కాలేదు. నిజనిర్ధారణబృందంలో, HRF తరపున U. G.శ్రీనివాసులు, K.ఉరుకుందప్ప, U. M. దేవేంద్ర బాబు, మాల మహానాడు తరపున మాలనర్సన్న, న్యాయవాది ఎద్దుల చెన్నయ్యలు పాల్గొనడం జరిగింది.

ఎమ్మిగనూరు పట్టణంలో వినాయక చవితి సందర్బంగా అన్ని వినాయక విగ్రహాలు, చవితి తరువాత మూడవ రోజున నిమజ్జనం, నాలుగు దేవాలయాలలోని విగ్రహాలను ఐదవ రోజున నిమజ్జనం కొరకు ఊరేగింపు జరపడం ఆనవాయితీగా ఉంది. అయితే ఈసారి అన్ని వినాయక విగ్రహాలు మూడవ రోజునే నిమజ్జనం చేయగా, సోగనూరు రోడ్డులోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలోని విగ్రహం 31 ఆగస్టు, 2025 తేదిన, ఐదవ రోజున నిర్దేశించిన మార్గంలో కాకుండ, ఎదురు బసవన్న గుడినుండి శ్రీరామస్వామి దేవాలయం వైపునకు మళ్ళించడం మీద మౌఖిక ఫిర్యాదు అందుకున్న సి ఐ శ్రీనివాసులు ఘటనాస్థలానికి సిబ్బందితో వెళ్లి, దారి మళ్ళించి, ఊరేగింపును జరిపిన వారిపై చట్ట ప్రకారం అవసరమైన బలప్రయోగం ఉపయోగించి, వారిని నియత్రించడం చేయాలి. ఆయన ఆవిదంగాకాకుండ, సంయమనం కోల్పోయి, ఆటో డ్రైవర్ అశోక్ ను, డి జే ఆపరేటర్ రంగస్వామిలను విచక్షణరహితంగా బూటు కాలితో తన్నడంతోపాటు, వారిపై బజార్లో దౌర్జన్యం జరపడం దారుణం. ఈ మొత్తం ఘటనపై తీసిన వీడియో వైరల్ కావడం వల్ల ఆయనగారి వీరంగం ప్రజలదృష్టికి వచ్చింది.

నిర్దేశించిన మార్గంలో కాకుండ విగ్రహాన్ని మళ్ళించడం వల్ల భిన్న వర్గాల ప్రజలలో వైషమ్యాల రాకుండా చూడవలసిందే. అయితే సి ఐ శ్రీనివాసులు అశోక్, రంగస్వామిలపై చట్టప్రకారం అవసరమైన బలప్రయోగం చేయడంలో తప్పులేదు. అయితే ఆయన పూర్తిగా విచక్షణ కోల్పోయి, సినిమాల్లో హీరోల మాదిరిగా హీరోజం ప్రదర్శించడం, భౌతిక దాడికిదిగి, బూటుకాలితో తంతూ, దౌర్జన్యానికి పాల్పడడం తీవ్రమైన చట్టవిరుద్ధమైన చర్యగా మేం భావిస్తున్నాం. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, అందుకు బాద్యులైన సి.ఐ శ్రీనివాసులును వెంటనే విధుల నుంచి తొలగించి, ఆయనపై చట్టప్రకారం చర్య తీసుకొంటూనే, బాధితులకు రక్షణ కల్పించి, మళ్ళీ ఇటువంటివి జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

U.G శ్రీనివాసులు, AP HRF రాష్ట్ర ఉపాధ్యక్షులు.
U.M. దేవేంద్ర బాబు, HRF రాష్ట్ర కార్యదర్శి.
K. ఉరుకుందప్ప, HRF కర్నూలు జిల్లా అధ్యక్షులు.
M. నర్సన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాల మహానాడు.
ఎద్దుల. చెన్నయ్య న్యాయవాది.

ఎమ్మిగనూరు,
04-09-2025.

Related Posts

Scroll to Top