ఏపీలో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ ప్రక్రియ హేతుబద్ధంగా జరగాలి

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఎప్పుడో మొదలు పెట్టాల్సింది. విశాలమైన ఈ రాష్ట్రంలో కేవలం 13 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్ర వైశాల్యంతో పోల్చితే ఈ సంఖ్య చాలా తక్కువ. చిన్న జిల్లాలను నెలకొల్పాలని మానవ హక్కుల వేదిక (హెచ్‌. ఆర్‌. ఎఫ్‌) చాలా కాలంగా డిమాండ్‌ చేస్తూ వస్తోంది.

అయితే కొత్త జిల్లాల ఏర్పాటుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంటరీ నియోజకవర్గం ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరణ చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదన ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ఉదాహరణకు, అరకు లోక్‌సభ నియోజక వర్గాన్ని చూస్తే ఈ విషయం స్పష్టమౌతుంది. అరకు పార్లమెంటరీ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంతో మొదలై శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం వరకు మొత్తం నాలుగు జిల్లాల మధ్య విస్తరించి వుంది. రంపచోడవరం నుండి అరకు 283 కిలోమీటర్ల దూరాన ఉండగా, పాలకొండ అరకు నుండి 157 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలోని కొన్ని మండలాలు అంతకంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. 

దూరాలను తగ్గించకపోగా దాన్ని పెంచే విధంగా ఉండే పునర్వ్యవస్థీకరణ జరిపి ఉపయోగమేమిటి? మైదాన ప్రాంతంలోని ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటే, అది ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంతం నుండి పశ్చిమాన వెనుకబడిన మెట్ట ప్రాంతమైన మార్కాపురం, గిద్దలూరు వరకు విస్తరించి వుంది. మార్కాపురం కేంద్రంగా విడిగా ఒక జిల్లా ఏర్పాటు చేస్తే బావుంటుంది. లోక్‌సభ నియోజకవర్గం ప్రాతిపదికన కొత్త జిల్లా ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని హెచ్‌.ఆర్‌.ఎఫ్‌ భావిస్తోంది. హేతురహితమైన ఈ ప్రతిపాదన ఆచరణలో చాలా ఇబ్బందులను సృష్టిస్తుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఎందుకు చేయాలనుకుంటున్నారో ఆ ప్రయోజనం నెరవేరకుండా పోతుంది.

ప్రస్తుత జిల్లాల్లో ప్రతి జిల్లాని మూడు జిల్లాలుగా పునర్వ్యవస్థీకరిస్తే బాగుంటుంది. రాష్ట్రంలో అతి పెద్ద జిల్లాలు అయిన అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాలను మాత్రం నాలుగు జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించవచ్చు. ఇప్పుడు ఉన్న ప్రతి జిల్లాను మూడు జిల్లాలుగా మార్చితే రాష్ట్రంలో మొత్తం 39 జిల్లాలు ఏర్పడతాయి. 1,80,058 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల తమిళనాడులో 38 జిల్లాలు ఉన్నాయనేది గమనార్హం. తెలంగాణ రాష్ట్రం 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిపి అప్పటివరకు వున్న 10 జిల్లాలను 33 జిల్లాలను చేసింది. 1,12,077 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల తెలంగాణ రాష్ట్రం విస్తీర్ణం రీత్యా ఆంధ్రప్రదేశ్ కంటే చిన్నది. కొత్తగా ఏర్పడే జిల్లాలకు జిల్లా కేంద్రాలను ఎంపిక చేసేటప్పుడు వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడం, జిల్లా కేంద్రాలు నైసర్గికంగా అన్ని ప్రాంతాలకు దగ్గరగా ఉండటం అనే విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి.

ఐటిడిఎ కేంద్రాలనే జిల్లాలు చేయొచ్చు.

ఇక ఐదవ షెడ్యూల్‌ ప్రాంతానికి వస్తే, ప్రతి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐ.టీ.డీ.ఏ.)ను కేంద్రంగా తీసుకుని ఒక జిల్లాను ఏర్పాటు చేయవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట, విజయనగరం జిల్లాలో పార్వతీపురం, విశాఖపట్నం జిల్లాలో పాడేరు, తూర్పు గోదావరి జిల్లాలో రంపచోడవరం, పశ్చిమ గోదావరి జిల్లాలో బుట్టాయిగూడెం మండలంలో వున్న కోట రామచంద్రపురం, ఖమ్మం నుండి విడగొట్టి ఇటీవల ఏర్పడిన ఐటీడీఏ కేంద్రమైన చింతూరును జిల్లాలుగా ఏర్పాటు చేయవచ్చు. గోదావరి నది ఆవలిగట్టున వున్న వేలేరుపాడు, కుక్కునూరు మండలాలను చింతూరుతో కలపవచ్చు. ఐదవ షెడ్యూల్‌ ప్రాంతంలో వున్న ఈ జిల్లాలకు గంటందొర, తమ్మన్న దొర వంటి ఆదివాసీ మృతవీరుల పేర్లు పెట్టవచ్చు. 

రాజ్యాంగం గుర్తించే ఐదవ షెడ్యూల్‌ ప్రాంతాల ప్రత్యేకత, విశిష్టతలను దృష్టిలో ఉంచుకుని వీటిని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తే బావుంటుంది. రాజకీయ ఉదాసీనత, అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల కొన్ని దశాబ్దాల కిందట ఐదవ షెడ్యూల్‌ ప్రాంతంలో కలపాల్సిన 553 ఆదివాసీ గ్రామాలను కలపకుండా ఉంచేశారు. ఆ ఆదివాసీ గ్రామాలు నాన్‌ షెడ్యూల్డ్‌ ప్రాంతాలుగా కొనసాగడం వల్ల ఆ గ్రామాల్లో నివసించే ఆదివాసులకు రాజ్యాంగం కల్పించే హక్కులు దక్కకుండా పోయాయి. ఇది ఒక చారిత్రక తప్పిదం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత కాలయాపన చేయకుండా కేంద్రం ముందు ఆ మేరకు ప్రతిపాదన పెట్టి ఆ గ్రామాలకు షెడ్యూల్‌ ప్రాంత హోదా వచ్చేటట్లు చూడాలని, ఐదవ షెడ్యూల్‌ ప్రాంతంలో ఏర్పడబోయే కొత్త జిల్లాల్లో ఆ గ్రామాలను కూడా కలపాలని కోరుతున్నాం.

ఐదవ షెడ్యూల్‌ ప్రాంతంలో నూతన జిల్లాల ఏర్పాటు తరువాత ఆదివాసేతరులు అధిక సంఖ్యలో అక్కడకు వచ్చి స్థిరపడిపోయే ప్రమాదముంది. ఆ పరిణామాన్ని నివారించే విధంగా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం. మూడేళ్ల క్రితం తెలంగాణలో ఏర్పడిన నూతన ఆదివాసీ జిల్లాల్లో ఆదివాసేతర వ్యాపారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు చాపకిందనీరులా ప్రవేశించి ఆదివాసీ గ్రామాల్లో తిష్ట వేసుకు కూర్చున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఐదవ షెడ్యూల్‌ ప్రాంతంలో కొత్తకార్యాలయాలు ఏర్పాటు చేస్తే ఆదివాసేతరులు అక్కడ పెద్ద సంఖ్యలో చేరిపోయి ఆదివాసుల భూములు గుంజుకుంటారని, ఆదివాసులను దోచుకుంటారనే భయం చాలామందిలో ఉంది. అటువంటి పరిణామం ఆదివాసుల ప్రయోజనాలను దెబ్బ తీస్తుంది. వాళ్ళ హక్కులను నిలువునా కాలరాస్తుంది. 

గ్రామ సభలకు అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చే పంచాయత్‌ (షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు విస్తరింపు) చట్టం (పెసా), షెడ్యూల్డ్‌ తెగల, ఇతర సాంప్రదాయక అటవీవాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం-2006 (ఎఫ్‌.ఆర్‌.ఏ) లను అమలు చేసే పనికి ప్రభుత్వం ఇప్పటివరకు పూనుకోలేదు. పెసా, ఎఫ్‌.ఆర్‌.ఏలను పక్కన పెట్టి గ్రామసభలకు అస్తిత్వం లేకుండా చేసారు. భూమి బదలాయింపు చట్టాలను, ఆదివాసుల హక్కులను కాపాడే ఇతర రక్షణ చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేయాలని, ఆదివాసీయేతరులు గుంజుకున్న భూములను ఆదివాసులకు తిరిగి ఇవ్వడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాం. 

కొత్త జిల్లాల ఏర్పాటు అధికార వికేంద్రీకరణకు దారి తీస్తుంది. పాలనా యంత్రాంగాన్ని ప్రజల వద్దకు తీసుకుపోతుంది. సంక్షేమ పథకాల అమలు కోసం, అధికారులకు వినతి పత్రాలు, ఫిర్యాదులు అందజేయడం కోసం ప్రజలు పడే ఎనలేని కష్టాలు, దూరాభారాలను తగ్గిస్తుంది. ఇంత ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజలను సంప్రదించడం ప్రభుత్వ కనీస బాధ్యత. కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీ ఆ పని చేస్తుందని మేము కోరుకుంటున్నాం. ఇది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ముఖ్యమైన నిర్ణయం. ఆగమేఘాల మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఏది చేసినా పారదర్శకంగా చేయాలి. ప్రజాస్వామిక సూత్రాలను గౌరవిస్తూ విస్తృతంగా చర్చ జరపాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీకి హెచ్‌. ఆర్‌. ఎఫ్‌ త్వరలో తన అభిప్రాయాలు తెలియచేస్తుంది.

మానవహక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్‌
20 జూలై 2020

Related Posts

Scroll to Top