నిజాలు చెప్పి విస్తరణకు వెళ్ళండి

బలబద్రపురం గ్రామం బిక్కవోలు మండలంలో ఉన్న గ్రాసిం పరిశ్రమ కాస్టిక్‌ సోడా ఉత్పత్తి చేస్తుంది. దాన్ని ప్రస్తుతం విస్తరించే ఆలోచనలో ఉన్నారు కనుక ప్రభుత్వ నియమాల ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉంది. ఈ నెల 28వ తారీఖున అది జరగనున్నది. అయితే ఈ సందర్భంగా విడుదల చేసిన పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలో వారు అనేక విషయాలను దాచిపెట్టారని మా దృష్టికి వచ్చింది. ఆ విషయమై మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజు జిల్లా కలెక్టర్ కు రాతపూర్వకంగా తన అభ్యంతరాలను అందజేశారు. దానిలోని కొన్ని ముఖ్యమైన అంశాలు –

కాస్టిక్‌ సోడా తయారీలో ఉపయోగించే ముడి సరుకులలో ఒకటైన పెర్ఫ్లోరే ఆక్టానిక్ యాసిడ్‌ (PFOA) స్థానిక తాగునీటి వనరులపైన, ప్రజారోగ్యంపైన చూపే దుష్ప్రభావం గురించి ఆ నివేదికలో ఎక్కడా లేదు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం PFOA నీటిలో 0.02 పి.పి.టికి మించి ఉంటే ప్రజారోగ్యానికి నష్టకరమని అనేక శాస్త్రీయ పరిశోధనలలో వెల్లడైంది. ఈ నీరు ఎక్కువ కాలం తాగితే ప్రజలలో రోగనిరోధక శక్తి తగ్గడం, లివర్‌ సరిగ్గా పనిచేయకపోవడం, థైరాయిడ్‌ వ్యాధులు, కిడ్నీ మరియు వృషణ క్యాన్సర్లు పెరిగే అవకాశం ఉందని పలు పరిశోధనలలో ప్రకటించారు.

నీటిలో PFOA ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం మన రాష్ట్రంలో ఏ లేబరేటరీలోనూ లేదు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు వంటి నియంత్రణ సంస్థలు, ఆంధ్రప్రదేశ్‌ భూగర్భ జలాల శాఖ, రెవిన్యూ యంత్రాంగం తమ విధులను నిర్వర్తించడంలో ఎప్పటిలాగే నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత మాత్రమే ప్రభుత్వ శాఖలు మేల్కొంటున్నాయి.

ఈ పరిశ్రమ వల్ల జరుగుతున్న కాలుష్యాన్ని, ప్రజారోగ్యంపై అది చూపే దుష్ప్రభావాన్ని దాచిపెట్టి తప్పుడు పర్యావరణ ప్రభావ నివేదికను విడుదల చేయడం నేరం. అన్ని వాస్తవాలతో కూడిన సరైన నివేదికను విడుదల చేసి, దానిపై స్థానిక ప్రజలకు సరైన అవగాహన కల్పించేంత వరకు ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేయాలని మానవ హక్కుల వేదిక డిమాండ్‌ చేస్తున్నది.

వై. రాజేష్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రాజమహేంద్రవరం
21.02.2023

Related Posts

Scroll to Top