వెంకటాయపాలెం శిరోముండనం తీర్పు నేరానికి తగిన శిక్షేనా?

“శిరోముండనం తీర్పు – నేరానికి తగిన శిక్షేనా?” సభ అమలాపురంలోని ఈదరపల్లి అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో దళిత ఐక్య పోరాట వేదిక, మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో జరిగింది. ఈ సదస్సుకు నామాడి శ్రీధర్ అధ్యక్షతన వహించారు. శిరోముండనం తీర్పు నేరానికి తగిన శిక్ష కాదని, తోట త్రిమూర్తులుకి విధించిన 18 నెలల జైలు శిక్ష కంటి తుడుపు చర్య మాత్రమే అని వక్తలు అభిప్రాయపడ్డారు.

తీర్పుతో తాము సంతృప్తి చెందలేదు అని, న్యాయం జరిగే దాకా తమ పోరాటం కొనసాగుతుందని బాధితుల్లో ఒకరైన పట్టాభి సీతారామయ్య చెప్పారు. ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ కాలంలో అనేక భయాందోళనలకు గురయ్యామని, విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ కోర్టు నేరస్థులకు విధించిన శిక్ష సరిపోలేదని మరో బాధితుడు కోటి చినారాజు తెలిపారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు కె సుధ గారు మాట్లాడుతూ దళితులు తాము చేసే ఈ ఆత్మ గౌరవ పోరాటంలో అనేక ప్రజా సంఘాలు కలిసి వచ్చాయని, ఇలాంటి సామూహిక పోరాటాల ద్వారానే రాజ్యాంగ విలువలు కాపాడగలమని అభిప్రాయపడ్డారు.

శిరోముండనం తీర్పును అప్పీల్ చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమని జిల్లా బార్ కౌన్సిల్స్ కి మానవ హక్కుల వేదిక పిలుపునిచ్చింది. వివిధ ప్రజా సంఘాల నాయకులు తమ అభిప్రాయాలు తెలియజేశారు.

కార్యక్రమంలో బాధితులు చల్లపూడి పట్టాభి సీతారామయ్య, కోటి చినరాజు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు కె సుధ, ఏడిద రాజేష్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మొహమ్మద్ ఇక్బాల్, ముత్యాల శ్రీనివాసరావు, ఏ రవి, దళిత ఐక్య పోరాట వేదిక నాయకులు భీమశంకర్, గుబ్బల శ్రీనివాసరావు, కో కన్వీనర్ రేవు నాగేశ్వరరావు ఇతర ప్రజాసంఘాల నాయకులు పెయ్యల పరశురాముడు, రేవు తిరుపతిరావు, జిల్లెళ్ళ మనోహర్, పెనుమాల సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

మొహమ్మద్ ఇక్బాల్
(మానవ హక్కుల వేదిక తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు)

ముత్యాల శ్రీనివాస రావు
(మానవ హక్కుల వేదిక తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి)

16.06.2024

Related Posts

Scroll to Top