హెచ్.ఆర్.ఎఫ్ కి పవన్ కోరాడ తో సంబంధం లేదు 

మా సభ్యుడు కాకపోయినా గతంలో మాతో కొంతకాలం కలిసి ప్రయాణం చేసిన పవన్ కోరాడ తమను లైంగికంగా వేధించినట్టు కొందరు స్త్రీలు ఇటీవల మానవహక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) దృష్టికి తీసుకువచ్చారు. అతనితో 2018 నుండి పరిచయమున్న 8 మంది స్త్రీలు తమ చేదు అనుభవాలను మాతో పంచుకున్నారు. మరి కొందరు బాధితులు ఉండే అవకాశం కూడా ఉంది.

ఆ స్త్రీలు మా సంస్థకు ఇచ్చిన ఉమ్మడి ప్రకటనను మేము జాగ్రత్తగా పరిశీలించాం. వారు పంచుకున్న అంశాల్లో చాలా సారూప్యత ఉందనే విషయం మేము గమనించాం. వారిని శారీరికంగా, లైంగికంగా హింసకు గురిచేయడం, వారి ఆత్మాభిమానాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం, నయవంచనకు పాల్పడటం, వారి గోప్యతను ఉల్లంఘిస్తానని బెదిరించడం, ఆర్ధికంగా దోచుకోవడం, తన అసలు స్వరూపం తెలుసుకుని నిలదీసిన స్త్రీలను వెంటాడి, వారిపై న్యాయపరమైన చర్యలు సహా అనేక రకాల చర్యలకు పాల్పడతానని బెదిరించడం వగైరా.

అంతే కాదు, బాధిత స్త్రీలను తన అదుపాజ్ఞలలో ఉంచుకోవడానికి అతను కులాన్ని ఒక ఆయుధంగా కూడా వాడుకున్నాడని అర్ధమైంది. సందర్భాన్ని బట్టి ఒక్కో స్త్రీ దగ్గర ఒక్కొక్క కులానికి చెందిన వాడినని చెప్పుకోవడం, తన వెంట పడుతున్నారని కొందరు స్త్రీలపై పని గట్టుకుని అబద్దపు ప్రచారం చేయడం, పని ప్రదేశంలో అధికార దర్పాన్ని వాడుకుని వయోభేదాన్ని కూడా లెక్క చేయక వారిని వెంటాడి లోబర్చుకోవడం, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తను చేసిన పనులను వక్రీకరించి చెప్పడం మొదలైనవెన్నో చేశాడని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయంగా, మేధోపరంగా తను చాలా ఉన్నతుడినని చెప్పుకుని వారిని లోబర్చుకోవడం, వారిని ఒక చట్రంలోకి నెట్టి ఊపిరి సలపకుండా చేయడం, అందుకు రకరకాల అబద్దాలు చెప్పడం వంటివెన్నో చేశాడని వారు చెప్పారు. రాజ్యహింసకు గురయ్యానని చెప్పుకోవడం, మాతో కలిసి కాశ్మీర్ నిజనిర్ధారణకు వెళ్లినట్టు చెప్పుకోవడం వాటిల్లో కొన్ని.

పైన పేర్కొన్న ఆరోపణలతో కూడిన ఫిర్యాదును ఆ స్త్రీలు పవన్ కోరాడ ప్రస్తుతం పని చేస్తున్న సంస్థకు కూడా ఇవ్వడంతో వారు అతన్ని ఉద్యోగంలో నుండి తొలగించారని మా దృష్టికి వచ్చింది.

తన ప్రతిష్టను పెంచుకోవడం కోసం గతంలో హెచ్.ఆర్.ఎఫ్.తో తనకున్న సాన్నిహిత్యాన్ని పవన్ కోరాడ వాడుకుంటున్నాడనేది వీటి వల్ల స్పష్టమవుతోంది. నిజానికి మా సంస్థకు అతనితో చాలా కాలం నుండి అధికారికంగా గాని, అనధికారికంగా గాని ఎటువంటి సంబంధం లేదు. ఇకముందూ ఉండదు. హెచ్.ఆర్.ఎఫ్.తో సన్నిహితంగా ఉంటున్నట్టు అతను తప్పుడు అభిప్రాయం ఎవరికీ కలిగించే అవకాశం ఇవ్వకూడదనే మేము ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేస్తున్నాం.

వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తమకు కలగగలిగే హానిని కూడా లెక్క చేయకుండా ఈ విషయాలను బహిర్గతం చేయడానికి ముందుకు వచ్చిన ఆ స్త్రీల సాహసాన్ని మేము గౌరవిస్తున్నాం. గౌరవప్రదంగా జీవించే హక్కు అందరికీ ఉందని, అవి వట్టి మాటలు కావని, చేతల్లో కూడా అవి ప్రతిఫలించాలని మానవ హక్కుల వేదిక గట్టిగా నమ్ముతుంది.

ఎస్. జీవన్ కుమార్, వి. వసంతలక్ష్మి, ఎ. చంద్రశేఖర్, వి.ఎస్. కృష్ణ హెచ్.ఆర్.ఎఫ్.
సమన్వయ కమిటీ – ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ

5-5-2026

Related Posts

Scroll to Top