నోముల గ్రామంలో మంత్రాల నెపంతో వృద్ధురాలిపై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

మానవ హక్కుల వేదిక, భారత నాస్తిక సమాజం, విజ్ఞానదర్శిని సంఘాల సంయుక్త పత్రిక ప్రకటన

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామంలో సెప్టెంబర్ 23వ తేదీ న పల్లాటి వెంకటమ్మ అనే వృద్ధురాలు మరియు ఆమె కుటుంబ సభ్యులపై జరిగిన మూక దాడి నేపథ్యంలో మానవ హక్కుల వేదిక, భారత నాస్తిక సమాజం, విజ్ఞానదర్శిని అనే మూడు సంఘాలు సంయుక్తంగా నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడి ఈరోజు అనగా అక్టోబర్ 4వ తేదీ 2026న బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను, నిందితులను కలిసి వివరాలు సేకరించాము. అలాగే స్థానిక మంచాల పోలీస్ స్టేషన్ కి వెళ్లి అధికారులతో మాట్లాడాము.

పల్లాటి వెంకటమ్మ అనే వృద్ధ ఎస్సీ మహిళపై అదే ఎస్సీ మాదిగ కులస్తులు హేతుబద్ధం కాని అపోహలతో, వారి మధ్య వారే అనేక రకాల వదంతులను ప్రచారం చేసుకుని సెప్టెంబరు 23న ఈ హేయమైన దాడి జరిపారు. వృద్ధ మహిళ అని చూడకుండా యువకులు ఇతర మహిళలు కలిసి పిడిగుద్దులు, కడుపులో తన్నడం, లాక్కెళ్ళటం, విసిరి వేయటం చేశారు. నోముల గ్రామంలో నివసించే వెంకటమ్మను వారి ఇంటికి దూరంగా ఉండే ఎస్సీ వాడదాకా, ఒక కిలోమీటర్ పాటు, ఇలా కొట్టుకుంటూ తీసుకువెళ్లి, అక్కడ గల మైసమ్మ గుడి ప్రాంగణంలోగల వేప చెట్టుకు కట్టేసి, మళ్లీ చిత్తం వచ్చినట్టుగా కొట్టారు. చివరికి ఒక డబ్బాలో చాలామంది కలిసి పోసిన మూత్రం తెచ్చి, వెంకటమ్మ తలపై పోసి, గుండు గీయించే సమయానికి పోలీసులు రావటంతో ఆగిపోయారు. వాళ్ళంతా కలిసి నన్ను చంపేద్దామని అంటూ కొట్టారని, సమయానికి పోలీసులు రాకపోయి ఉంటే వాళ్లు నన్ను తప్పకుండా చంపే వాళ్లే అని వెంకటమ్మ చెప్పింది. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆమె భర్త, ఆమె కొడుకు కూడా దాడికి గురయ్యారు. వెంకటమ్మ రెండు చేతి వేళ్ళ ఎముకలు విరిగిపోయాయి. వీపు, కడుపు, ముఖం, కాళ్ళపై రక్త గాయాలయ్యాయి.

40 మంది స్త్రీ, పురుషులు ముఖ్యంగా యువతీ యువకులు ప్రత్యక్షంగా పాల్గొన్న ఈ దాడిలో వందలాది మంది ప్రేక్షకులుగా ఉన్నారు. దాడికి గురైందీ, దాడి చేసిందీ అందరూ ఒకే కులానికి చెందినవారు. దాడి చేస్తున్న వారికి గానీ , చూస్తున్న వారికి గానీ తామంతా ఒక అనాగరికమైన, చట్ట వ్యతిరేకమైన పని చేస్తున్నామనే స్పృహ గానీ, భయం గానీ లేదు. మంత్రాలు, చేతబడి వంటివి ఉన్నాయని, వాటికి ప్రభావం ఉంటుందని ఈనాటికీ చదువుకున్న వారితో సహా అన్ని వయసుల వారూ నమ్ముతున్నారు. దాని పర్యవసానమే ఈ దాడి. ఒక పేద, తమ కులానికే చెందిన వృద్ధురాలు అయిన మహిళను సులభ టార్గెట్గా చేసి ఇక్కడ నోముల గ్రామస్తులు వారి మనసుల్లో ఉన్న కసినంతా తీర్చుకున్నారు. ఇది సమాజంలోని మూఢత్వానికీ , మూర్ఖత్వానికీ ప్రతీక. చాలా ఆశ్చర్యంగా, ఈ రకమైన మూడ నమ్మకాలు, భయాలు చేతబడి చేసే వారి పట్ల వ్యతిరేకత, దాడులు చేయాలనే కసి ఈ కాలంలోని ఏ కొద్ది మందికో మాత్రమే కాకుండా నాగరికలనుకునే అందరిలో విస్తృతంగా ఉంటున్నది. సమాజం అభివృద్ధి చెందటం అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందటం మాత్రమే కాదు, సామాజికంగా, మానసికంగా, ప్రజాస్వామ్యంగా కూడా అభివృద్ధి చెందటం. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు, వాటికి పెద్ద ఎత్తున సమాజంలో ఆమోదం ఉన్నప్పుడు మన సమాజాన్ని ఆధునిక సమాజం అని పిలుచుకోలేం. మొత్తం సమాజం, వ్యక్తులుగా ప్రతి మనిషీ, ప్రభుత్వం అందరూ తమ బాధ్యతగా శాస్త్రీయ, హేతుబద్ధమైన, నాగరిక సమాజాన్ని నిర్మించుకోవాలి.

మా డిమాండ్లు :

  1. నోముల గ్రామంలో పల్లాటి వెంకటమ్మ పై దాడికి పాల్పడ్డ ఏ ఒక్కరినీ మిహాయించకుండా అందరిపై ఆమె గౌరవానికి అప్రతిష్ట కలిగించటం , భౌతిక దాడి, హత్యాయత్నం కేసులు మోపి విచారణ జరపాలి.
  2. ⁠ఈ కేసులో ఇప్పటివరకు కేవలం ముగ్గురిని మాత్రమే రిమాండ్కు పంపారు. అంతటితో వదిలేయకుండా బాధితురాలితో సహా ప్రత్యక్ష సాక్షులను విచారించి మిగతా నిందితులందరినీ రిమాండ్ కు పంపాలి.
  3. ⁠ఫలానా వారు మంత్రాలు, చేతబడి చేస్తున్నారని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టం తీసుకురావాలి.
  4. ⁠రాష్ట్రంలో మూఢనమ్మకాల నిర్మూలన కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేయడమే కాకుండా, మూఢ నమ్మకాల నిర్మూలనకు అవసరమైన చట్టం చేయాలి.

ఈ నిజ నిర్ధారణ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. తిరుపతయ్య, రంగారెడ్డి జిల్లా బాధ్యులు ఎ.నరసింహ, సపావత్ రాజు, మానవ హక్కుల వేదిక సభ్యులు వి. దిలీప్, సంజీవ్, వెంకట నారాయణ, అచ్యుత్ కుమార్, కిరణ్ లు పాల్గొన్నారు.

భారత నాస్తిక సమాజం జాతీయ అధ్యక్షులు జీడి సారయ్య, జీడి స్పార్టకస్ లు పాల్గొన్నారు. విజ్ఞాన దర్శిని రాష్ట్ర అధ్యక్షులు రమేష్ గారు, విజ్ఞానదర్శిని సభ్యులు నవీన్, ప్రశాంత్, జ్ఞానేశ్వర్, మరియు నరేష్ లు పాల్గొన్నారు.

డా ఎస్. తిరుపతయ్య (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి HRF)
9849228212

జీడి సారయ్య ( భానాస జాతీయ అధ్యక్షులు)
9949652769

టి. రమేష్ ( రాష్ట్ర అధ్యక్షులు, విజ్ఞానదర్శిని)
7032297105

మంచాల, ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లా.
04.10.2026

Related Posts

Scroll to Top