అదానీ సంస్థతో ఒప్పందాలను తక్షణమే రద్దు చేసుకోవాలి

అదాని గ్రీన్ ఎనర్జీ కి చెందిన గౌతం ఆదాని, ఇతర ఉద్యోగుల మీద అమెరికాలోని న్యూయార్క్ లో ప్రాసిక్యూటర్స్ క్రిమినల్ అబియోగాలు మోపిన నేపధ్యంలో, అదానీ సంస్థతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలని తక్షణమే రద్దు చేసి, ఈ వ్యవహారం మీద విచారణ జరపాలి అని మానవ హక్కుల వేదిక (HRF) డిమాండ్ చేస్తున్నది.

అదాని గ్రీన్ ఎనర్జీ కి చెందిన గౌతం ఆదానీ, ఇతర ఉద్యోగుల; అజూర్ పవర్ సంస్థకి చెందిన ఉద్యోగుల; కెనడాకి చెందిన ఒక ఇన్వెస్ట్మెంట్ సంస్థకి చెందిన ఉద్యోగుల మీద ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ కమీషన్ జరిపిన విచారణ అనంతరం న్యూయార్క్ తూర్పు జిల్లా కి చెందిన అటార్నీ అక్టోబర్ 24, 2024 నాడు అభియోగ పత్రం దాఖలు చేశారు. దీనిని నవంబర్ 20, 2024 నాడు అందరికి అందుబాటులోకి తీసుకొచ్చారు.

సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పవర్ సప్లై అగ్రీమెంట్ కోసం అదానీ సంస్థ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అధికారులకి సుమారుగా 1600 కోట్ల లంచం ఇచ్చింది అనేది ఇందులో ముఖ్య అభియోగం. “సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర ప్రదేశ్ డిస్కం ల మధ్య పవర్ సప్లై అగ్రిమెంట్ త్వరితగతిన చేపట్టడానికి” 2021లో గౌతం అదానీ ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ఒక ముఖ్యమైన వ్యక్తిని కలిశారు అని ఈ అభియోగంలో ఉంది. ఈ వ్యక్తి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అర్ధం అవుతుంది.

ఈ రహస్య సమావేశం వివరాలని బయటపెట్టాలని నాడు ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ 7000 మెగా వాట్ల సౌర విద్యుత్తు ఒప్పందం, యూనిట్ కి 2.49 రూపాయల టారిఫ్ లని వ్యతిరేకిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), తెలుగు దేశం పార్టీ (టిడిపి) నాయకులు ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో కేసులు వేయడం కూడా జరిగింది.

అలాగే, వివిధ చట్టాలని, రాజ్యాంగంలోని షెడ్యూల్ V అధికరణలని బుట్టదాఖలు చేస్తూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అదానీ సంస్థకి అల్లూరి సీతారామరాజు, పార్వతిపురం-మన్యం జిల్లాలలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకి అనుమతులు కేటాయించింది అనే విషయం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి.

వి. ఎస్. కృష్ణ (HRF ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు)

వై. రాజేష్ (HRF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

జి. రోహిత్ (HRF రాష్ట్ర కార్యదర్శి)

22.11.2024,
విశాఖపట్నం.

Related Posts

Scroll to Top