ఆదోని,
18.02.2025.
గౌరవనీయులైన సబ్ కలెక్టర్ గారికి,
ఆదోని.
సార్,
విషయం : రాష్ట్ర ప్రభుత్వం ఆదోని బైపాస్ రోడ్డు కొరకు కల్లుభావి పరిధి లోని సర్వే నెంబర్. 414 కింద ఉన్న ఎ 1.41 సెంట్ల భూమిలో సేకరించిన భూమి ఎంత? – ఆ భూమిని హంపి దేవస్థానం నుండి గంగన్న కొని టి. ఎం. మస్తాన్ కు అమ్మడంతో, అతను ప్లాట్స్ వేయించగా, తాము కొన్నామని బాధితుల ఆవేదన – రాష్ట్ర ప్రభుత్వం హంపి దేవస్థానం, రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు గతంలోనే దీనికి సంబంధించి నిరభ్యంతర పత్రం ఇచ్చినప్పటికి ఆదోని రెవెన్యూ అధికారులు నష్టపరిహారం ఇవ్వకుండా, కాలయాపన చేస్తున్న విషయమై సమగ్ర విచారణ జరిపి, బాధితుల అనుమానాలను నివృత్తి చేస్తూనే, వారికి తగిన నష్టపరిహారం వెంటనే మంజూరు చేసి వారికి న్యాయం చేయటం గురించి.
మానవ హక్కుల వేదిక (HRF) రెండు తెలుగు రాష్ట్రాలలో గత 25 ఏళ్లకు పైగా కొనసాగుతున్న సంస్థ. మా దృష్టికి వచ్చే సామాజిక అంశాలపైనా, ప్రజల ప్రాధమిక హక్కులకు ఉల్లంఘన జరిగినప్పుడు స్పందించి, వారి తరపున మాట్లాడుతుంది.
అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వేస్తున్న జాతీయ రహదారి మన ఆదోని మీదుగా వెళ్లే క్రమంలో వేస్తున్న బైపాస్ కొరకు కల్లుభావి లోని సర్వే నెంబర్. 414 లోని భూమిని సేకరించగా, ఆ భూమిలో ప్లాట్స్ కొన్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇంతవరకు నష్ట పరిహారం ఇవ్వలేదు. ఆ విషయంలో జాప్యం జరుగుతున్నందున బాధితులకు కలిగిన అనుమానాలను నివృత్తి చేసి వారికి నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతున్నాం.
ఆదోని పట్టణం, కల్లుభావి గ్రామ పరిధి కింద హంపి విరుపాక్షేశ్వర దేవస్థానానికి చెందిన సర్వే నెంబర్ 414 కింద ఉన్న ఎ 1.41 సెంట్ల భూమిని గతంలోనే ఆదోనికి చెందిన గంగన్న హంపి దేవాదాయ శాఖ అధికారి ద్వారా కొని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించు కొన్నాడు. ఆయన ఆ భూమిని టి. ఎం. మస్తాన్ కు అమ్మాడు. మస్తాన్ ఆ భూమిలో ప్లాట్స్ వేసి నిరుపేదలకు, దిగువ మధ్య తరగతి ప్రజలకు అమ్మాడు. కేంద్ర ప్రభుత్వం వేస్తున్న జాతీయ రహదారి కల్లుభావి గ్రామ సర్వే నెంబర్ 414 మీదుగా వెళ్ళింది. అయితే ఆ సర్వే నెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత భూమిని సేకరించింది అనే విషయం అక్కడ ప్లాట్స్ కొన్న బాధిత ప్రజలకు తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని సేకరించిన తరువాత, మిగిలిన సర్వే నంబర్ల లలో ఉన్న వారికి నష్ట పరిహారం ఇచ్చింది. అయితే సర్వే నెంబర్. 414 లో ప్లాట్స్ కొన్న బాధిత ప్రజలు అందరితో పాటు ఆదోని రెవెన్యూ అధికారులకు వినతిపత్రం రాసి ఇచ్చినా, వారికి ఇంత వరకు నష్ట పరిహారం రాలేదు.
హంపి దేవస్థానానికి చెందిన దేవాదాయ శాఖ అధికారి, శాఖకు చెందిన కల్లు భావి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 414 లో ఎ 1.41 సెంట్ల భూమిని గంగన్నకు అమ్మి రిజిస్ట్రేషన్ చేసి, ఆదోని రిజిస్ట్రేషన్ శాఖ అధికారికి (Letter No. LND. CR. 03/2010- 11) నిరభ్యంతర పత్రం కూడ ఇచ్చినట్లు తెలిపిన పత్రాలు బాధితుల దగ్గర ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఇచ్చిన నిరభ్యంతర పత్రం (Letter Number. N1/ 32289/2010, Dt. 09.08.2010) కూడ వారి దగ్గర ఉన్నాయి.
బాధితులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఆదోని తహసీల్దార్ గారిని 19 డిసెంబర్, 2024, మరియు 26 డిసెంబర్, 2024 తేదీలలో సమాచారం కోరినా, వారు ఇంతవరకు సమాచారం ఇవ్వలేదు. కల్లు భావి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్. 414లోని ఎ 1.41సెంట్ల భూమిని హంపి దేవస్థానం వారు గంగన్నకు అమ్మలేదని, అదేవిధంగా హంపి దేవస్థానం వారు, రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ వారు నిరభ్యంతర పత్రం ఇవ్వలేదని ఆరోపణలు వచ్చినందున వారు సమాచారం అడిగారు. అదే నిజమైతే ఆదోని తహసీల్దార్ నెల దాటినా, ఎందుకు ఇంతవరకు సమాచారం ఇవ్వకుండా ఉన్నారు? కావున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, పై విషయమై సమగ్రమైన విచారణ జరిపించి, బాధిత ప్రజల అనుమానాలను నివృత్తి చేస్తూనే, బాధిత ప్రజలకు ప్లాట్స్ కోల్పోయిన భూమి ఎంత అన్నది చెబుతూనే, వారు కోల్పోయిన భూమికి తగిన నష్ట పరిహారం వెంటనే ఇవ్వాలని కోరుతున్నాం.
(యు. జి. శ్రీనివాసులు)
(HRF రాష్ట్ర ఉపాధ్యక్షులు)
ఆదోని