కర్నూలు జిల్లా గొందిపర్ల గ్రామంలో ఉన్న TGV SRAACL పరిశ్రమ విస్తరణ కోసం తయారుచేసిన ముసాయిదా పర్యావరణ ప్రభావ ఆంచనా నివేదికను సవరించాలి.

గౌరవనీయులైన పి. రంజిత్ బాషా గారికి,
జిల్లా కలెక్టర్,
కర్నూలు.

విషయం: కర్నూలు జిల్లా గొందిపర్ల గ్రామంలో ఉన్న TGV SRAACL పరిశ్రమ విస్తరణ కోసం తయారుచేసిన ముసాయిదా పర్యావరణ ప్రభావ ఆంచనా (Draft Environmental Impact Assessment) నివేదికను సవరించాలి. సవరించిన తరువాతనే ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి.

సర్,

మానవ హక్కుల వేదిక (HRF) దాదాపుగా గత మూడు దశాబ్దాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో హక్కుల దృక్పధంతో హక్కుల పరిరక్షణకై, నూతన హక్కుల దఖలుకై పనిచేస్తున్న సంస్థ.

గొందిపర్ల గ్రామంలో ఉన్న TGV SRAACL పరిశ్రమ విస్తరణ కోసం తయారు చేసిన ముసాయిదా పర్యావరణ ప్రభావ అంచనా నివేదికను సవరించటానికి మీ తక్షణ జోక్యం కొరతూ కర్నూలు జిల్లా నివాసితులుగా, కర్నూలు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములుగా మేము మీకు ఈ నివేదన అందచేస్తున్నాము.

ఈ విస్తరణకి సంబంధించి ప్రజలకి అందుబాటులో ఉంచిన ముసాయిదా పర్యావరణ ప్రభావ ఆంచనా నివేదికని క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఇందులో అనేక లోపాలు ఉన్నాయని, ఈ విస్తరణ కారణంగా ఉండబోయే పర్యావరణ, సామాజిక ప్రభావం గురించి అవగాహనతో కూడిన ఒక అభిప్రాయానికి ప్రజలు రావడానికి అవసరమైన ముఖ్యమైన సమాచారం ఇందులో లేదని స్పష్టమయ్యింది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ముఖ్యమైన డేటా ఇందులో లేకపోవడం కారణంగా పర్యావరణ అనుమతుల ప్రక్రియలో ప్రజలు పూర్తి అవగాహనతో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.

ముఖ్యంగా, ఈ పరిశ్రమలో ఉపయోగించే, తయారుచేసే రసాయనాల కారణంగా ఉండే ప్రమాదాల గురించి, రిస్కుల గురించి ఈ నివేదికలో ఏమీ లేదు. అందుకు ఒక ఉదాహరణ అత్యంత హానికారకమైన టెట్రాఫ్లోరోఎథిలీన్ (Tetrafluoroethylene) మోనోమర్. ఈ రసాయనం నిల్వ చేయడం కారణంగా, ఈ రసాయనం వాడటం కారణంగా ఉత్పన్నమమయ్యే ప్రభావం గురించి కానీ, ప్రమాదం గురించి కానీ ఈ నివేదికలో ఒక్క ముక్కా లేదు. ఈ రసాయనం కనుక గాలి లేదా ప్రాణవాయువు (Oxygen) కి ఎక్స్పోజ్ అయితే పేలిపోయే ప్రమాదం ఉంది.

ఈ పరిశ్రమ తెలంగాణ సరిహద్దులో ఉంది. అందువలన పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986 ప్రకారం ఈ విస్తరణ కారణంగా తెలంగాణలో ప్రభావానికి గురయ్యే ప్రాంతాలకి చెందిన ప్రజల అభిప్రాయాలు కూడా సేకరించాల్సి ఉంటుంది. ఇలా చేయకపోవడం రియో ప్రకటన 1992 స్పూర్తికి తూట్లు పొడవటమే. అలాగే ఈ ప్రాజెక్టు మాంట్రియాల్ ప్రకటన, స్టాక్ హోమ్ కన్వెన్షన్ ప్రకటన లని కూడా ఉల్లంఘిస్తున్నది.

PTFE ఉత్పత్తి కోసం వాడే సాంకేతికత చాలా క్లిష్టమైనది. అలాగే చాలా సాంకేతిక పరిజ్ఞానం అవసరమైన ప్రక్రియ కూడా. అయితే ఈ సంస్థకి ఈ రసాయనం ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉన్నదా అనేది అనుమానమే. ఈ సంస్థ PTFE ఉత్పత్తి కోసం ఏ రకమైన టెక్నాలజీ వాడుతున్నదో బహిర్గతం చేయాలి అని మీరు డిమాండ్ చేయాలి అని మేము కోరుతున్నాము. అలాగే వారి డిజైన్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఎవరో, వారి గత ప్రాజెక్టు వివరాలు కూడా బహిర్గతం చేయాలి.

సరైన డిజైన్ లేని కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లోని రసాయన పరిశ్రమలలో ఘోర ప్రమాదాలు నిత్యకృత్యం అయ్యాయి. డిజైన్ లో ఏ మాత్రం లోపం ఉన్నా కూడా భారీ ప్రమాదం జరుగుతుంది. సాల్వెంట్ లీకు కారణంగా గత సంవత్సరం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఎసెన్షియా సంస్థలో ప్రమాదం జరిగి 17 మంది మరణించగా, 39 మంది గాయపడ్డారు. అలాగే 2022 లో ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ లాబ్స్ సంస్థలో రియాక్టర్ లోపం కారణంగా జరిగిన ప్రమాదంలో 10 మంది కార్మికులు చనిపోయారు.

PTFE ఉత్పత్తిలో పోలిమరైజేషన్ అనేది చాలా కీలకమైన ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఒక సర్ఫెక్టెంట్ వాడతారు. అయితే ఏ సర్ఫెక్టెంట్ వాడదలుచుకున్నారో అనే విషయం ఈ నివేదికలో లేదు. పోలిమరైజేషన్ కోసం సర్ఫెక్టెంట్ వాడని PTFE ఉత్పత్తి సంస్థలు దాదాపుగా లేవు. సర్ఫెక్టెంట్ గా ఉపయోగించే ఫ్లోరినేటెడ్ రసాయనాల కారణంగా వివిధ రకాల క్యాన్సర్లు వస్తున్నాయి అనేది జగత్విదితం.

ఈ పరిశ్రమ విస్తరణ కారణంగా కృష్ణ, తుంగభద్ర, ఇతర నీటి వనరుల మీద ఉండబోయే ప్రభావం గురించి కూడా ఈ పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలో ఒక్క వాక్యం లేదు. ఇప్పటికే భారతదేశం నదులు PFAS రసాయనంతో కలుషితమై ఉన్నాయి. ఇఇటి మద్రాస్ వారు నదులలో PFAS కాలుష్యం గురించి చేసిన పరిశోధన ఆధారంగా ఇప్పటికే దీని గురించి జాతీయ హరిత ట్రైబ్యునల్ సుమోటోగా విచారణ చేస్తున్నది (OS. 548/2024). రోజుకి 250 గ్రాముల PFAS లీకు అయితే కృష్ణ నది మొత్తం కాలుష్యం అవుతుంది అని మాకు తెలిసింది. అంటే అప్పుడు కృష్ణ నీరు తాగటానికి కూడా పనికి రాదు.

ప్రజలని, పర్యావరణాన్ని కాపాడటానికి ముందస్తు జాగ్రత్త సూత్రాన్ని అమలు చేయాలి చాలా అవసరం. అంటే దానర్థం తమ పరిశ్రమ, పరిశ్రమ విస్తరణ కారణంగా ఎటువంటి హానీ, ప్రమాదం లేదు అని నిరూపించాల్సిన బాధ్యత TGV SRAACL సంస్థ మీద ఉంది. హాని జరుగుతుంది అనే వాదనని ఖండించటం కాకుండా, హాని జరగదు అని వారు నిరూపించాలి.

వారు ఈ క్రింది పరిశోధన చేపట్టాలి.

  • పరిశ్రమ విస్తరణ నిర్మాణం అప్పుడు, అలాగే ఉత్పత్తి మొదలపెట్టినప్పుడు వెలువడే వాయు, శబ్ధ కాలుష్యం, వాటి ప్రభావం.
  • ప్రాజెక్టు కారణంగా స్థానిక జీవవైవిధ్యం మీద ఉండే ప్రభావం.
  • పరిశ్రమ వ్యర్ధ నిర్వహణకి సంబంధించి వివరణాత్మకమైన ప్రణాళిక. అలాగే హానికారక వ్యర్ధాల తొలగింపు ప్రణాళిక.
  • స్థానిక ప్రజల మీద ఉండే పర్యావరణ, సామాజిక ప్రభావం. అంటే వారు విస్తాపనకు గురయ్యే అవకాశం ఉందా, వారి జీవనోపాధుల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, స్థానిక మౌలిక వసతుల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది ఇత్యాది.
  • ఎటువంటి కాలుష్య నియంత్రణ టెక్నాలజీలు వాడతారు, వాటి ఫలోత్పాదకశక్తి (efficiency) గురించి సమగ్రమైన సమాచారం.
  • సమగ్రమైన రిస్క్ అంచనా, విపత్తు నిర్వహణ ప్రణాళిక.
  • ముసాయిదా పర్యావరణ ప్రభావ ఆంచానా నివేదిక తయారుచేసేటప్పుడు వచ్చిన ప్రజాభిప్రాయలు, వాటిని నివేదికలో ఏ విధంగా పొందుపరిచారు అనే పూర్తి సమాచారం.
    ఈ పైన పేర్కొన్న అంశాలు ఏవీ కూడా ప్రస్తుత నివేదికలో లేవు. కాబట్టి ప్రస్తుత నివేదిక అసంపూర్ణం. పర్యావరణ అనుమతి ప్రక్రియ పారదర్శకంగా, ప్రజల భాగస్వామ్యంతో జరగాలి. అయితే ఈ లోపభూయిష్టమైన నివేదిక కారణంగా పారాదర్శకతా లేదు, ప్రజలు భాగస్వాములు అవ్వడానికి సరిపడినంత సమాచారమూ లేదు. ఇటువంటి నివేదికని ప్రజల ముందుపెట్టడం అంటే పర్యావరణ ప్రభావ ఆంచనా ప్రక్రియని అపహాస్యం చేయడమే.

అందువలన, మేము మిమ్మల్ని కోరేది ఏమిటంటే-

  • ముసాయిదా పర్యావరణ ప్రభావ అంచనా నివేదికని సవరించమని, అందులో పూర్తి సమాచారం ఇవ్వాలని, పైన పేర్కొన్న లోపాలని పూరించాలని పరిశ్రమ యాజమాన్యానికి స్పష్టంగా తెలియచేయాలి.
  • సవరించిన నివేదికని సమయబద్ధంగా ప్రజల ముందు ఉంచాలి. ఈ నివేదికని క్షుణ్ణంగా పరిశీలించడానికి ప్రజలకి తగినంత సమయం ఇవ్వాలి.
  • ఈ సవరించిన నివేదిక ఆధారంగా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. అక్కడ ప్రజలు తమ అనుమానాలు, అభ్యంతరాలు, అనుభవాలు వ్యక్తపరచడానికి తగిన అవకాశం ఇవ్వాలి. వారి అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోవాలి.
    సమగ్ర, పారదర్శక పర్యావరణ ప్రభావ అంచనా ప్రక్రియ అనేది పూర్తి సమాచారంతో ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్నప్పుడే సాధ్యపడుతుంది అని మేము భావిస్తున్నాము. కర్నూలు సుస్థిర అభివృద్ధికి ఇది తప్పనిసరి అని మేము భావిస్తున్నాము.

మా ఈ నివేదన మీద మీరు సత్వరం స్పందిస్తారు అని, TGV SRAACL పరిశ్రమ విస్తరణకి సంబంధించి పర్యావరణ ప్రభావ అంచనా ప్రక్రియని పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తారని మేము ఆశిస్తున్నాము.

యు. జి. శ్రీనివాసులు (HRF రాష్ట్ర ఉపాధ్యక్షులు)
పాణి (HRF జిల్లా కార్యవర్గ సభ్యులు)

కర్నూలు,
12.05.2025

Related Posts

Scroll to Top