Date: 07-01-2025
గౌరవనీయులైన చైర్మన్ బక్కి వెంకటయ్య గారికి,
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్,
హైదరాబాద్.
రెస్పెక్టెడ్ సర్,
విషయం: డిసెంబర్ 19వ తేదీన మందమర్రి విద్యానగర్ ఎస్సీ ఎస్టీ కాలనీకి చెందిన నలుగురు యువకులు పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసిన విషయమై.
మేము మానవ హక్కుల వేదిక (HRF) అనే సంస్థలో పని చేసే కార్యకర్తలం. మా సంస్థ, 1998 లో దివంగత డాక్టర్ కె.బాలగోపాల్ చే స్థాపించబడిన లాభాపేక్షలేని, రాజకీయేతర పౌర సమాజ సంస్థ. సర్, రాష్ట్ర చైర్మన్ గా మీరు బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ఎంతో ఆర్తితో రాష్ట్రంలోని బలహీనవర్గాలైన ఎస్సీ, ఎస్టీ ప్రజల వద్దకు నేరుగా వెళ్లి, వారిలో ధైర్యాన్ని నింపుతూ వారికి పరంగా పూర్తి న్యాయం చేయటానికి గొప్పగా ప్రయత్నం చేస్తున్నారు. మీ శ్రమకీ, అట్టడుగు ప్రజల కోసం మీరు తీసుకుంటున్న రిస్క్ కీ మా హృదయపూర్వకమైన వందనాలు, ధన్యవాదాలు. మీలాంటివారు ఉన్నారనే ధైర్యంతో ఈ విషయం మీ దృష్టికి తీసుకువస్తే, వారికి న్యాయం జరుగుతుందనే ఆశతో మేము నిజనిర్ధారణకు వెళ్లి సేకరించిన సమాచారంతో మీకు ఈ కింది లేఖను రాస్తున్నాం.
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ విద్యానగర్ ఎస్సీ ఎస్టీ కాలనీకి చెందిన నలుగురు యువకులు (విద్యానగర్ ఎస్సీ ఎస్టీ కాలనీ నివాసులు ఆవుల షారుఖ్, మేస్రం రాజు, యాపల్ నివాసులు బామండ్ల శివ, అజయ్) మందమర్రి పోలీస్ స్టేషన్ అధికారీ, ఐడీ పార్టీ పోలీసులూ తమను చేయని దొంగతనం కేసుల్లో కూడా ఇరికిస్తున్నారని, తమనే కాక, తమ కుటుంబ సభ్యులనూ వేధిస్తూ, తాము సాధారణ జీవితం గడిపే అవకాశం లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ 2024 డిసెంబర్ 19 వ తేదీన సెల్ఫీ వీడియో ద్వారా అందరికీ ఒక అభ్యర్థన పెట్టి, హెయిర్ డై తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు..
ఈ ఆత్మహత్యా ప్రయత్నాన్ని ఆ యువకులు చనిపోయే ఉద్దేశంతో చేయకపోయినా, వాళ్లు తామున్న పరిస్థితి నుండి ఎట్లా బయట పడాలో తెలియక ఈ ప్రమాదకర మార్గాన్ని ఎంచుకున్నారు. ఇదే కాలనీకి చెందిన ఆటో నడుపుకునే ఎరుకల కులానికి చెందిన మరో యువకుడు గుర్రాల పెద్దభూమయ్య ఒక సంవత్సరం కింద పోలీసులు తనపై అనేక కేసులు బనాయిస్తున్నారని భయపడి పోలీస్ స్టేషన్లోనే తన శరీరంపై తనే పెట్రోల్ పోసుకుని అంటించుకున్నాడు. దాని కంటే ముందు ఒకసారి గొంతు కోసుకున్నాడు. ఈ కాలనీ యువకులపై నమోదైన కేసులూ, వాటికి తట్టుకోలేక భీతి గొలిపే వారి పెనుగులాటల వెనుక చాలా సామాజిక, ఆర్థిక, వ్యవస్థాపరమైన అంశాలున్నాయి.
నవంబర్ 15వ తారీకు మందమర్రి కేకే వన్ మైన్ మీద కాపర్ వైర్ దొంగతనం ప్రయత్నం జరిగింది. ఆ సమయంలో స్థానిక వాచ్ మన్ కూ దొంగతనానికి వచ్చిన వారికీ మధ్య ఘర్షణ జరిగింది. వాచ్ మన్ గాయపడ్డాడు. వాచ్ మన్ తన పై అధికారులకు సమాచారం ఇచ్చి, డిపార్ట్మెంట్ నుండి మందమర్రి పోలీస్ స్టేషన్లో ఆ దొంగతనం విషయమై ఫిర్యాదు చేస్తూ, ఇద్దరు అనుమానితుల పేర్లను కూడా రాశారు. ఆరోజు నుండి పది రోజుల పాటు పోలీసులు తమ పాత పద్దతుల్లోనే గతంలో దొంగతనం కేసుల్లో ఉన్న వారిని పిలిపించి, ‘విచారించి ‘ ఒక రిమాండ్ కేస్ డైరీ తయారు చేశారు. ఎస్సీ ఎస్టీ కాలనీ, యాపల్ లోని తొమ్మిది మందిని RCD లో చూపించి, అందులో కొంతమందిని రిమాండుకు పంపారు. ఫిర్యాదు దారులు అనుమానించిన ఇద్దరు ఆ రిమాండ్ కేస్ డైరీలో లేరు. నిజంగా, ఎవరు దొంగతనం చేశారనేది మాలాంటి పౌర సంఘాలు నిర్ధారించే విషయం కాదు. కానీ కొన్ని అనుమానాలైతే కలుగుతున్నాయి. అంత మంది కలిసి ఆ చిన్న దొంగతనానికి పోవటం అనేదే ఏ మాత్రం నమ్మశక్యంగా లేదు. వాళ్లే దొంగతనం చేశారని మీ దగ్గర ఏమైనా సాంకేతిక ఆధారాలు ఉన్నాయా అని ఎస్ఐ గారిని అడిగినప్పుడు ” మాకు సమాచారం ఇచ్చేవారు ఇచ్చారు, విచారణలో వీళ్ళు ఒప్పుకున్నారు” ఇదీ వారి సమాధానం. ఫిర్యాదు దారులు తమ ఫిర్యాదులో ఈ తొమ్మిది మందిలో ఎవరినీ అనుమానించలేదు. ఆధునిక సాంకేతిక సాధనాల ద్వారా వచ్చే తిరుగులేని ఆధారం ఏదీ ఇక్కడ లేదు. ఫిర్యాదులో ఉన్న విషయం ఆధారంగానే అక్కడ , ఆరోజు కాపర్ వైర్ దొంగతనమే జరగలేదు. కానీ పోలీసులు ఆరోజు 30 వేల రూపాయల విలువైన దొంగతనం జరిగినట్లుగా రాశారు. ఇవన్నీ ఈ కేసు వీరిపై అన్యాయంగా బనాయింపబడినదని తెలియజేస్తున్నాయి. రిమాండ్ పీరియడ్ పూర్తి చేసుకుని, బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా అందరినీ కండీషన్ పేరుతో వారానికి రెండు సార్లు స్టేషన్ కి రప్పించి బెదిరిస్తూ, అవమానకరమైన పనులు చేపిస్తూ, కొత్త కేసుల్లో కూడా ఇరికించటానికి ప్రయత్నం చేస్తున్నారని భయపడిన నలుగురు యువకులు ఈ ‘ఆత్మహత్య ప్రయత్నం ‘ చేశారు. ఇది వారి దుస్థితిని తెలియజేస్తుంది. దీన్ని నాటకంగా మాత్రమే కొట్టి పారేస్తే అసలు విషయాలు మరుగునపడిపోతాయి.
మందమర్రి విద్యానగర్ లోని ఎస్సీ ఎస్టీ కాలనీ అనేది, కాలరీ ఏరియాలో రోజూవారి కూలీ చేసుకొని బ్రతకవచ్చని, ఒకప్పుడు అనేక ప్రాంతాలనుండి వలస వచ్చిన నిరుపేదలు నివసించే ప్రాంతం. అక్కడ స్థిరపడిపోయిన వారిలో ప్రధానంగా మాదిగ, నేతకాని, మాల దాసరి, ఎరుకల కులాలున్నాయి. వాళ్ల తరువాత తరాలు కూడా ఇక్కడే పుట్టి పెరుగుతున్నాయి. ఇప్పటికి అక్కడ దాదాపు 160 కుటుంబాలు ఉన్నాయి. ఎస్సీలు 120 కుటుంబాలకు పైగా ఉంటాయి. మిగతా వాళ్లు ఎస్టీలు. ఈ కాలనీ కుటుంబాలకు నిర్మాణ రంగంలో దొరికే రోజువారీ అడ్డకూలీ పని, యువకులైతే ఆటోలు నడుపుకోవటం, లారీ డ్రైవర్లు, క్లీనెర్లుగా వెళ్లటం, పాన్ టేలలు, వెల్డింగ్, చిన్న చిన్న మెకానిక్ పనులే జీవనాధారం. ఎస్సీలలో కొంతమంది మున్సిపాలిటీలో నాలాల క్లీనింగ్, రోడ్లు ఊడ్చటం వంటి కాంట్రాక్టు లేబర్ పనులు చేస్తున్నారు. తల్లిదండ్రుల జీవితాల్లోనే స్థిరత్వం లేకపోవటం, ఒకరి కంటే ఎక్కువ మంది పనిచేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితీ, మంచి స్కూల్ కి పంపించే స్థోమత లేకపోవటం, పరిసరాల ప్రభావం, ఇతర సాంస్కృతిక కారణాల వలన అక్కడి పిల్లలు పెద్దగా చదువులో రాణించటం లేదు. ఈ తొమ్మిది మందిలో కొందరిపై గతంలో చిన్న చిన్న స్క్రాప్, కాపర్ వైర్లు, ఇతర దొంగతనాల కేసులున్నాయి. ఇద్దరిపై గంజాయిని స్థానికంగా అమ్మి పెట్టే కేసులున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ కేసుల్లో ఎవ్వరికీ ఎప్పుడూ కోర్టులో శిక్ష పడలేదు. ఎవ్వరూ, ఎన్నడూ సీరియస్ అఫెన్స్ చేయలేదు. స్క్రాప్ బిజినెస్ చేసే వైశ్య కులానికి చెందిన ఒక్కరు మినహా మిగతా వాళ్ళంతా ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన కటిక పేదవారు. ఎవరికీ సరైన ఇల్లు లేదు. ఒక్కరు తప్ప ఎవరి చదువూ ఏడవ తరగతి దాట లేదు. ఇందులో ఒకరు తల్లిదండ్రులు ఏనాడో చనిపోయి, తన పుట్టిన గ్రామం కూడా తెలియకుండా అనాధగా పెరిగిన 22 సంవత్సరాల మేస్రం రాజు అనే గోండి తెగ అబ్బాయి ఉన్నాడు. ఒక అబ్బాయి డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతుండగా, మిగతావారు చిన్నాచితక పనులు చేసుకుని బతుకుతున్నారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోకుండా వారు దొంగతనం చేశారా లేదా అనే దాని మీదనే పోలీసులు, న్యాయ వ్యవస్థ కేంద్రీకరిస్తూ పరోక్షంగా వారికి చాలా అన్యాయం చేస్తున్నారు. కొన్ని సార్లు వారు చేయని నేరాలను కూడా వారిపై మోపి, వారిని మరింత గందరగోళపరుస్తున్నారు. నవంబర్ 26 న పోలీసులు బుక్ చేసిన కేసు అట్లాంటిదే.
మేం మీకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే పేదరికం, తగిన ఉపాధి మార్గాలు లేకపోవడం, పెరుగుతున్న వ్యసనపర సంస్కృతులు అట్టడుగు వర్గంలో ఉన్న వారిని వారికి తెలియకుండానే ఒక విషవలయంలోకి పంపుతాయి. దీనికి వ్యక్తిగతంగా, వారినే బాధ్యులుగా చేయటం కంటే నాగరికులైన పరిపాలనా అధికారులు, పాలకులు ఆ భాధ్యత తీసుకోవటం ఉచితంగా ఉంటుంది. తెలియక చేసినా వారు చేసినవి (గతంలో చేసినవైనా) నేరాలే కదా అనుకున్నా నేరం జరగటానికి గల నేపథ్యాన్నీ , నివారించడానికి గల అవకాశాలనూ పరిశీలించకుండా నేరస్తులను మాత్రమే శిక్షించే సాంప్రదాయం నాగరికమైనది కాదు, విశాల దృక్పథం కలిగినది కూడా కాదు. సమాజంలోని పౌరులందరూ గౌరవప్రదమైన ఉపాధితో, సమానమైన హోదా, అవకాశాలతో జీవించేటట్టు చూడాల్సిన రాజ్యాంగ బాధ్యత పరిపాలకులదే అని మేం భావిస్తున్నాం. కాబట్టి మీరు దయతో ఆ నిరుపేద, అట్టడుగు కులాల యువకుల జీవితాలను మొదటగా పోలీసుల వేధింపుల నుండీ, తర్వాత ఆ విషవలయం నుండి వారు విముక్తి కావటానికి వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికీ మార్గదర్శకం చేస్తారని ఆశిస్తూ మీకు ఈ లేఖ రాస్తున్నాం.
కృతజ్ఞతలతో ,
డాక్టర్ ఎస్. తిరుపతయ్య,
ఆత్రం భుజంగరావు,
మానవ హక్కుల వేదిక, తెలంగాణ
ఈ విషయంలో మీరు కాంటాక్ట్ చేయడానికి మా వివరాలతో పాటు బాధితులైన కొంతమంది వివరాలు కూడా ఇస్తున్నాము.
డాక్టర్ ఎస్. తిరుపతయ్య, : 98492 28212; Email: drthirupathi.ped@gmail.com
బాధితులు:
1. బొచ్చు విజయ్ సాగర్ (mob: 8074636144)
2. బామన్ల శివకుమార్ (mob: 7981167844)
3. సెగ్గం అజయ్ కుమార్ (mob: 7601038103)
4. మేస్రం రాజు (mob: 6303661220)