ఈ నెల 13వ తారీకు రాత్రి నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో మరణించిన పెద్దపల్లి జిల్లా అంతర్గాం నివాసి అలకుంట సంపత్ కుటుంబాన్ని మానవ హక్కుల వేదిక ఐదుగురు సభ్యుల నిజనిర్ధారణ బృందం కలిసి వివరాలు సేకరించింది. మా బృందంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. తిరుపతయ్య, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి, న్యాయవాది పందిళ్ళ రంజిత్ కుమార్, జిల్లా కార్య వర్గ సభ్యులు జి. మధు, ఎస్. అచ్యుత్ కుమార్, కె.సదానందం లు ఉన్నారు. మా విచారణలో కుటుంబ సభ్యుల ఆరోపణలు, నిజామాబాద్ పోలీసుల పత్రికా ప్రకటనలు, రిమాండు కేసు డైరీనీ పరిశీలించాం.
పెద్దపల్లి జిల్లా అంతర్గాం గ్రామ నివాసి, వడ్డెర కులానికి చెందిన అలకుంట సంపత్ డిగ్రీ చదివి ఉన్నా గౌరవప్రదమైన ఏ ఉద్యోగం, ఉపాధి లేని కారణంగా ఏడాది క్రితం వరకూ స్థానికంగానే గృహ నిర్మాణాలకు అవసరమైన ఇసుకను సరఫరా చేస్తూ జీవనం సాగించేవాడు. దాంట్లోనూ పోలీసుల జోక్యం పెరిగి, తనకేమీ మిగలటం లేదని, మరొకతనితో కలిసి జగిత్యాలలో ఇతర ఏషియా దేశాలకు వలసలు వెళ్లే నిరుద్యోగులను అక్కడి కంపెనీలకు సప్లై చేసే సంస్థను అధికారికంగా రిజిస్టర్ చేసి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ క్రమంలో విదేశాల్లో కంప్యూటర్ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం కోసమని థాయిలాండ్ కు పంపబడిన ఒక యువకుడికి, అక్కడ ఉద్యోగం కల్పిస్తామన్న సంస్థ మోసం చేసి, ఆన్లైన్ ప్రలోభాలకు గురిచేసి డబ్బులు కాజేసే ఇల్లీగల్ సంస్థలో పని చూపించి తనను మోసం చేసిందని, అందుకు జగిత్యాలలో తన దగ్గర డబ్బులు తీసుకుని థాయిలాండ్ కు పంపిన సంస్థదే బాధ్యత అని అతను నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఆరోపణతో సంపత్ తో పాటు అతని సహా నిందితుడు చిరంజీవిని కూడా మార్చి మూడున జగిత్యాలలో అరెస్టు చేసి, నాలుగవ తారీఖున రిమాండుకు పంపారు. తిరిగి, అదే పోలీసులు పదకొండవ తేదీన ఇద్దరినీ కస్టడీకి తీసుకుని సంపత్ ను బాగా కొట్టినట్లు అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.
విచారణలో భాగంగా పోలీసులు13 వ తేదీన సంపత్ ను జగిత్యాలకి తీసుకువచ్చిన సందర్భంగా తనని పోలీసులు చిత్రహింసలు పెడుతున్న విషయం సంపత్ చెప్పి ఏడ్చాడని అతని తల్లి, భార్య, తమ్ముళ్లు మాకు తెలియజేశారు. ఆ సమయంలో సంపత్ నిలబడలేని, నడవలేని స్థితిలో ఉన్నాడన్నారు. తనను పది లక్షల రూపాయల లంచం అడుగుతూ కొడుతున్నారని, ఎలాగైనా ఆ మొత్తం సమకూర్చండని సంపత్ తన తమ్మునికి చెప్పాడు. అదేరోజు సాయంత్రం సంపత్ ను తిరిగి నిజామాబాద్ కు తరలించిన సైబర్ క్రైమ్ పోలీసులు రాత్రి పన్నెండు తర్వాత బంధువులకు ఫోన్ చేసి అతను సీరియస్ గా ఉన్నాడని ఒకసారి చెప్పి, మరికొన్ని నిమిషాలకు అతను గుండెపోటు కారణంగా చనిపోయాడన్నారు.
ముప్పై ఒక్క సంవత్సరాల వయసున్న యువకుడికి గుండె పోటు రావటమే అసాధారణం. అదీ పోలీస్ స్టేషన్ లోనే రావటం, హాస్పటల్ లో ట్రీట్మెంట్ జరిగిన దాఖలా లేకపోవటం, అంతకు ముందు నుండీ పోలీసులు అతన్ని కొడుతూ ఉండటం మొదలగు విషయాలన్నీ సంపత్ గుండెపోటు వల్ల చనిపోలేదని చెప్తున్నాయి. పోలీసులు మృతున్ని హాస్పిటల్ కు తరలించి సంపత్ కు గుండెపోటు వచ్చిందని చేసిన ప్రదర్శనంతా వారి నేరాన్ని కప్పి పుచ్చుకునే నాటకం మాత్రమే. నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును ఆసరగా చేసుకుని సంపత్ ను లంచాల కోసం కొట్టి, చంపటమే వాస్తవం.
ఏ ప్రభుత్వం మారినా పోలీసుల అనాగరిక స్వభావం, అక్రమ సంపాదనా పద్ధతులు, పేద, నిమ్న వర్గాల నిందితులను అలవోకగా కొట్టి చంపే చరిత్ర మారటం లేదు. ఇవన్నీ పూర్తిగా, ప్రతి ప్రభుత్వమూ పోలీసులను పాలకుల కాపలాదారులుగా చట్టాలకు అతీతంగా, క్రూర మనస్త్వత్వంతో కొనసాగాలని కోరుకుంటున్న ఫలితంగానే జరుగుతున్నాయి. అందుకోసం వారు చేసే ఈ రకమైన హత్యలు కూడా మాఫీ అవుతున్నాయి. దీన్ని అవకాశం గా తీసుకుంటున్న పోలీసులు అవే చిత్రహింసలను, లాకప్ హత్యలను నిర్భయంగా కొనసాగిస్తున్నారు. పనిలో పనిగా ఈ అవకాశాన్ని వారి అక్రమ సంపాదనకూ విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. ఫలితంగా పేదలూ, పలుకుబడిలేని నిమ్న కులాల నిందితులు వారి చేతిలో పడి ఇలా చనిపోతున్నారు. కాబట్టి, సంపత్ కస్టడీ మరణానికి పోలీసులే కాదు, ప్రభుత్వమూ బాధ్యత వహించాలి.
మా డిమాండ్లు:
- నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో ఉండగా సంపత్ మరణించాడు కాబట్టి దీనిని హత్యగానే పరిగణించి సంబంధిత సిఐ, ఎస్ఐ మరియు ఆ రోజు విధుల్లో ఉన్న సిబ్బందిపై వెంటనే హత్యా నేరం కింద అరెస్టు చేసి, విచారణ జరపాలి.
- నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులందరినీ వెంటనే సస్పెండ్ చేయాలి.
- మృతునికి నలుగురు చిన్న పిల్లలున్నారు. వారి భవిష్యత్తు ఇప్పుడు అంధకారం అయ్యింది. ఈ కస్టడీ మరణానికి ప్రభుత్వం కూడా బాధ్యత వహిస్తూ అతని కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం అందించాలి.
- రాష్ట్రంలో మరొక లాక్ అప్ హత్య జరగకుండా పోలీస్ శాఖ స్వభావాన్నీ, విచారణ పద్ధతులనూ ప్రక్షాళన చేసి, నాగరీకరించాలి.
- కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు, వచ్చిన కొత్తలో కూడా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన పునరుద్ధరిస్తామని చెప్పి ఉంది. ఆ హామీకి అతీ గతి లేదు. ఆ ఏడవ హామీ అమలును వెంటనే సమీక్షించాలి.
డాక్టర్ ఎస్. తిరుపతయ్య
(రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మానవ హక్కుల వేదిక తెలంగాణ)
పందిళ్ళ రంజిత్ కుమార్
(మానవ హక్కుల వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి).
అంతర్గాం,
పెద్దపల్లి జిల్లా,
01.04.2025.