మానవ హక్కుల వేదిక ప్రతినిధులు కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెంలొ గల మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది. గురుకుల పాఠశాల వసతి గృహంలో విద్యార్థులకు సరిపడా గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారని. మొత్తం నాలుగు గదులలో 379 మంది విద్యార్థులను ఉంచడం వల్ల విద్యార్థులకు అసౌకర్యంగా ఉందని అనారోగ్యాలకు గురి అయ్యే అవకాశం ఉందని అన్నారు. పాఠశాలలు ప్రారంభమై ఆరు నెలలు కావస్తున్న దుప్పట్లు, బెడ్లు ఏర్పాటు చేయలేదనీ విద్యార్థులు వారి ఇంటి వద్ద నుంచి దుప్పట్లు తెచ్చుకొని వాడుకుంటున్నారని. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల సిబ్బందిని బెడ్లు లేవని ప్రశ్నించగా సరిపడా గదులు లేనందున బెడ్లు ఇవ్వలేమని అంటున్నారన్నారు. వంటగది అపరిశుభ్రంగా ఇరుకుగా ఉందని. బాలికల పాఠశాలకు ప్రధానంగా ఉండవలసిన రక్షణ ప్రహరీ గోడ నాలుగు వైపులా లేకపోవడం వల్ల రాత్రి సమయంలో విద్యార్థులు భయాందోళనకు అవుతున్నారని అన్నారు. విద్యార్థులకు లైబ్రరీ మరియు ల్యాబ్ పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ సరిపడా గదులు లేక విద్యార్థులు వినియోగించుకోలేకపోతున్నారు. నైపుణ్య శిక్షణ మెటీరియల్ ఉన్నప్పటికీ బోధించేవారు లేరనీ. హాస్టల్ వసతి గదులు పైకప్పు లీకేజీ ఉన్నదని మరుగుదొడ్లు సరిపడా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని గురుకుల పాఠశాలలకు సొంత పక్కా భవనాలు లేక అద్దె బిల్డింగులలో నిర్వహించడం వలన విద్యార్థులకు సరైన సదుపాయాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మానవ హక్కుల వేదిక ప్రతినిధులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించి విద్యార్థులకు నాణ్యమైన విద్య మంచి వసతి సౌకర్యాలు కల్పించాలని నల్లగొండ జిల్లా మానవ హక్కుల వేదిక(HRF) ప్రభుత్వాన్నిడిమాండ్ చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా హెచ్ఆర్ఎఫ్ అధ్యక్షుడు అక్కెనపల్లి వీరస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి అద్దంకి దశరథ, జిల్లా ఉపాధ్యక్షులు చింతమల్ల గురవయ్య, జిల్లా సహాయ కార్యదర్శి చెట్టిపల్లి కాశీరాం, మహమ్మద్ జరిన, గడ్డం వెంకటరమణ,మహమ్మద్ ఫయాజ్ లు పాల్గొన్నారు.
ముత్యాలమ్మగూడెం,
17-11-2024