దేశానికి స్వాతంత్రం వచ్చి, మనుషులందరూ సమానమే అనుకొని, అందుకు తగిన రాజ్యాంగం రాసుకుని 75 సంవత్సరాలు గడిచినా సమాజంలో కుల వ్యవస్థ కారణంగా మనుషులందరూ అనేక సామాజిక వర్గాలుగా విభజింపబడి, ఇంకా ఒకరి పట్ల మరొకరు వివక్ష పాటిస్తూనే ఉన్నారు. దళితుల పట్ల అంటరానితనం ఇంకా సమసిపోకుండా కొనసాగుతూనే ఉన్నది. అందుకు తాజా సాక్ష్యమే ఈ సంఘటన. రాజ్యాంగం ఏమి చెప్పినప్పటికీ ప్రభుత్వాలు సెంటిమెంట్ల పేరుతో ప్రజల మధ్య ఉన్న సాంస్కృతిక, సామాజిక వైరుధ్యాలను పెంచి పోషించుకుంటూ వస్తున్నాయి. ప్రజలకు తమ కులం పట్ల ఉండే వేర్పాటువాద భావాన్ని పెంచుకునే కుల సంఘాలను పోటీపడి ప్రోత్సహిస్తున్నాయి. ఫలితంగా, ప్రజల మధ్య ఉన్న సామాజిక అంతరాలు తగ్గటం కాకుండా రోజురోజుకూ మరింతగా పెరుగుతున్నాయి.