అనుమతుల్లేని భూముల్లో ఆక్వా సాగుకు విద్యుత్ సౌకర్యం కల్పించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి

సి.ఆర్.జెడ్ పరిధిలో ఆక్వా సేద్యం చేయడం చట్ట విరుద్ధమని, అనుమతుల్లేని భూముల్లో సాగుకు విద్యుత్ సౌకర్యం కల్పించడం చట్టరీత్యా నేరమని, తక్షణమే విచారణ చేసి బాధ్యులపై చర్యలు చేపట్టాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. ఎన్జీటీ తీర్పు రీత్యా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అనుమతుల్లేని ఆక్వా సాగుకు విద్యుత్ కనెక్షన్ తొలగించడానికి వచ్చిన వివిధ డిపార్ట్మెంట్ అధికారులను అడ్డుకోవడం రైతులకు తగదన్నారు.

కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ చట్టం (CAA), 2005 ప్రకారం పోటు అల (హై టైడ్ లైన్) నుండి 2 కిలోమీటర్ల వరకు అనుమతుల్లేని ఆక్వా సాగును తొలగించాలని చట్టం చెబుతున్నప్పటికీ, జిల్లా యంత్రాంగం దానిని 500 మీటర్ల వరకు పరిమితం చేయడం చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు. AP Water Land And Tress Act, 2002 (వాల్టా) ప్రకారం అనుమతుల్లేని బోర్లను తక్షణమే తొలగించాలి. వరి సాగు పంటల మధ్య జరిగే ఆక్వా సాగును తొలగించాలి. ఇప్పటికే చమురు సహజవాయువుల సంస్థలు చమురు, సహజవాయువు వెలికితీత వల్ల తీర ప్రాంతంలో పర్యావరణం దెబ్బతిందని ఎన్జీటీ చెప్పిన విషయాలను ఆక్వా రైతాంగం దృష్టిలో ఉంచుకుని పర్యావరణ రక్షణకు, మానవ మనుగడకు సహకరించాలన్నారు. ఆక్వాజోన్ పరిధిలో నిబంధనలకు అనుగుణంగా ఆక్వా సాగు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు, అభ్యంతరాలు ఉండవని మానవ హక్కుల వేదిక అభిప్రాయపడుతుంది.

ముత్యాల శ్రీనివాసరావు,
మానవ హక్కుల వేదిక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి.

చెవ్వాకుల వెంకట్,
మానవ హక్కుల వేదిక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు.

మలికిపురం,
28.09.2024.

Related Posts

Scroll to Top