దేశవ్యాప్తంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను నిరసిస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న పోరాటాలకు సంఘీభావం తెలుపుతూ, ప్రతి మనిషికి ఒకే విలువ అన్న అంబేద్కర్ పిలుపును కొనసాగిస్తూ డిసెంబర్ 14 , 15వ తేదీల్లో అనంతపురంలో జరిగే మానవ హక్కుల వేదిక 10 వ ఉభయ రాష్ట్రాల మహాసభలను జయప్రదం చేయాలని శనివారం జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి వీరస్వామి ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులతో కలిసి నకిరేకల్ ప్రెస్ క్లబ్ లో కరపత్ర ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇజ్రాయిల్ గాజా యుద్ధం , భారత దేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న మానవ హక్కుల హననం, బస్తర్ లో ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న ఆదివాసి ప్రజల ఊచకోతల నిరసిస్తూ మానవ హక్కుల వేదిక ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతుందన్నారు.
ఈ మహా సభల్లో ‘కుల గణన ఎందుకు అవసరం’ అనే అంశం పై ఎస్.ఎన్. సాహు, సామాజిక విశ్లేషకులు మాజీ రాష్ట్రపతి కె.ఆర్. నారాయణను ఓఎస్టి;
‘బస్తర్ లో మానవ హక్కుల ఉల్లంఘనలు’ అనే అంశం పై మాలిని సుబ్రహ్మణ్యం, స్వతంత్ర విలేఖరి;
‘NEP 2020: కాషాయికరణ, కార్పొరేటీకరణ’ అనే అంశం పై కొప్పర్తి వెంకట రమణమూర్తి, చరిత్ర విశ్రాంత అధ్యాపకులు ప్రసంగిస్తారని తెలిపారు.
‘ప్రతి మనిషికీ ఒకే విలువ’ అని బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇచ్చిన పిలుపుని మా సంస్థ అంతర్లీనం చేసుకుంది. బుద్ధుడి నుండి అంబేడ్కర్ వరకు మానవహక్కుల దేశీయ మూలాలు వెతుక్కుంటూ, దేశ విదేశాలలో జరిగే హక్కుల ఉల్లంఘనలను ప్రశ్నించడం, వాటి గురించి పోరాడడం మానవ హక్కుల ఉద్యమ కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని ఈ మహాసభలలో పునరుద్ఘాటిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో సిహెచ్ కాశీరాం హెచ్ఆర్ఎఫ్ సహాయ కార్యదర్శి, బొమ్మకంటి కొమరయ్య రైతుకూలి సంఘం రాష్ట్ర గౌరవధ్యక్షులు, బొల్లికొండ లింగయ్య బీసీపీ జిల్లా నాయకులు, సిహెచ్ వేంకటాద్రి, వంటేపాక సుందర్, మండల కృష్ణ, బొజ్జ ఆరోగ్యం ఎమ్మార్పీఎస్ నాయకులు, తిరుగుడు రవి అఖిల భారత యాదవ సంఘం నాయకులతో పాటుగా వెంకటరమణ, పుట్ట సత్తయ్య, ఫయాజ్, కారింగుల యాదగిరి, గుత్త వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.