ఎన్కౌంటర్లు ఉండవని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించాలి

ములుగు జిల్లా ఏటూరునాగారం దగ్గర చెల్పాక అడవిలో జరిగిన ఎన్కౌంటర్ విషయంలో పోలీసులు చెప్పే కథనానికీ, ఎన్కౌంటర్ మృతుడు మల్లయ్య @ కమలాకర్ భార్య మీనా ప్రత్యక్షంగా శవాన్ని పరిశీలించి చెప్పిన కథనానికీ ఎక్కడా పొంతన లేదు. ఎన్కౌంటర్ మృత దేహాల ఫోటోలను పరిశీలించినా బుల్లెట్ గాయాలు కాక అనేక అనుమానాలు కలిగించగల ఇతర గాయాలు కనిపిస్తున్నాయి. కమలాకర్ భార్య కూడా వాళ్ళను అరెస్టు చేసి చిత్రహింసలుపెట్టారని, మరణించిన ఒక మహిళా కార్యకర్త భుజం చిత్ర హింసల వల్ల నుజ్జు నుజ్జు అయిందని పత్రికా విలేఖర్లకు, ఎలక్ట్రానిక్ మీడియాకు చెప్పింది. పోలీసులు మాత్రం ఎన్కౌంటర్ల విషయంలో గత ఆరు దశాబ్దాలుగా చెప్పుతూ వస్తున్న కథనే ఇప్పుడూ చెప్పారు.

ఎన్కౌంటర్ లో పాల్గొన్న ఏ ఒక్క పోలీసుకు కూడా చిన్న గాయం కూడా కాకపోవడం, మృతులెవ్వరికీ కాళ్ళకు చెప్పులు గానీ, బూట్లుగానీ లేకపోవడం గమనిస్తే వాళ్లు అలెర్ట్ గా లేరనీ, ఇవి నిజమైన ఎదురుకాల్పులు కావని అర్థమవుతుంది. వాళ్ళను ముందే అదుపులోకి తీసుకుని ఉండవచ్చు. వారిని అదుపులోకి తీసుకుని, చట్టబద్ధంగా కోర్టులో ప్రవేశ పెట్టకుండా ఇలా చంపేయటం రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. ఎదురుకాల్పుల పేరుతో పోలీసులు జరిపిన ఈ హత్యాకాండను మానవ హక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తున్నది.

గత ఆరు దశాబ్దాలుగా అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రభుత్వాలన్నీ ఎన్కౌంటర్ ప్రక్రియతో నక్సలైట్లను హతమార్చడం ఒక ఉమ్మడి పాలసీగానే చేస్తున్నాయి. అయితే గతంలో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్కౌంటర్లు ఉండవని ఒక విధాన ప్రకటన చేసిన మూడు సంవత్సరాలూ (1978, 79 & 80), ఎన్.టి రామరావు ప్రకటించిన ఒక సంవత్సరం (1984) రాష్ట్రంలో ఎన్కౌంటర్లు జరగలేదు. అంజయ్య, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గార్లు అధికారంలో ఉన్నప్పుడు.(1981, 82 &83) అతి స్వల్ప సంఖ్యలో ఎన్కౌంటర్లు జరిగాయి. కాబట్టి, ఎన్కౌంటర్లు చేస్తున్నది పోలీసులైనా, చేయిస్తున్నది మాత్రం పాలకులే.

అలాగే ఇటీవల కాలంలో ఎన్కౌంటర్ మృతులందరూ దాదాపు ఆదివాసులు అయి ఉంటున్నారు. గత వారం మావోయిస్టులు వాజేడు మండలంలో ఇన్ఫార్మర్ల పేరుతో ఇద్దరిని చంపారు. ఆ ఇద్దరు కూడా ఆదివాసీలే. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా, విద్యా పరంగా ఎంతో అభివృద్ధి చెందాల్సిన ఈ వర్గ ప్రజలు ఇలా యుద్ధ వాతావరణంలో చిక్కుకుని చనిపోతూ ఉండటం చాలా బాధాకరం.

మా డిమాండ్లు:

  • ఈ యుద్ద వాతావరణానికి ప్రధాన కారణం అయిన కేంద్ర, రాష్ట్ర పాలకులే చొరవ తీసుకొని ఈ మానవ హననాన్ని ఆపాలి.
  • రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాగ్రెస్ పార్టీ ఒక విధాన నిర్ణయం తీసుకొని బూటకపు ఎన్ కౌంటర్లు ఉండవని ప్రకటించాలని మా సంస్థ డిమాండ్ చేస్తున్నది.
  • ఎన్కౌంటర్ మృతుల పార్థివదేహాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పోస్టుమార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగించాలి.
  • ఎన్కౌంటర్లో బాధ్యులైన పోలీసులపై హత్యా నేరం నమోదు చేసి, స్వతంత్ర సంస్థల చేత విచారణ జరిపించాలి.

ఎస్ జీవన్ కుమార్
(ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు)

ఆత్రం భుజంగరావు
(రాష్ట్ర అధ్యక్షుడు)

డాక్టర్ ఎస్. తిరుపతయ్య
(రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

03/12/2024
హైదారాబాద్.

Related Posts

Scroll to Top