గోవర్ధనగిరి గ్రామ దుర్ఘటనపై మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ

సిద్దిపేట జిల్లా, అక్కన్నపేట మండలం, గోవర్ధనగిరి గ్రామంలో తేదీ: 30/01/2025 నాడు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భద్రతా ప్రమాణాలను పాటించకపోవడంతో మట్టిగుట్ట కూలిపడి ఇద్దరు మహిళలు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో కాందారపు సరోజన (58), మమత (35) తల్లి కూతుళ్లు ఉండగా, గాయపడిన వారిలో వలబోజు మనెమ్మ, ఇంద్రాల స్వరూప, ఇంద్రాల రేణుక, తాటికొండ విమల, గౌడ వెంకటయ్య ఉన్నారు. మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ కమిటీ పరిశీలనలో, భద్రతా ప్రమాణాల అసమర్థ నిర్వహణే ఈ ప్రమాదానికి కారణమని తేలింది. పని మేనేజర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని కమిటీ అభిప్రాయపడింది. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, మృతుల కుటుంబాలకు తక్షణమే కేంద్ర ప్రభుత్వ పరిహారంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం వారు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది.

ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణ – రైతుల వ్యతిరేకత:
అక్కన్నపేట మండలంలోని చౌటపల్లి, తోటపల్లి, జనగామ గ్రామాల్లో 124 ఎకరాలను ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతో, స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని. వారి హక్కులకు అభిప్రాయాలకు వ్యతిరేకంగా వందలాది మంది చిన్న, సన్నకారు రైతుల జీవనాధారం అయిన భూములను బలవంతంగా భూసేకరణ ఆలోచన ప్రజావ్యతిరేక చర్య అని రైతులు అభిప్రాయపడ్డారు.

మానవ హక్కుల వేదిక ప్రతినిధులు, భూసేకరణ తక్షణమే నిలిపివేయాలని, రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, మరియు వ్యవసాయ భూములకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను పరిశీలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలతో సమగ్రంగా చర్చించకుండా భూములను స్వాధీనం చేసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని వారు తెలిపారు.

“భూమి రైతుల హక్కు – దానిని బలవంతంగా స్వాధీనం చేసుకోవడం అప్రజాస్వామిక చర్య” అని మానవ హక్కుల వేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించి, రైతులకు న్యాయం చేయాలని మానవ హక్కుల వేదిక స్పష్టం చేసింది.

ఈ కమిటీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ పందిళ్ళ రంజిత్ కుమార్, సభ్యులు కొయ్యడ కొమరయ్య, ముక్కెర సంపత్, ఎగ్గోజు సుదర్శన చారి, కన్నూరి సదానందం, సమ్మెట అచ్యుత్, కొంటు రాజేందర్, ఇంజం చైతన్య తదితరులు ఉన్నారు.

09.02.2025,
సిద్ధిపేట.

Related Posts

Scroll to Top