కల్లుకుంట గ్రామానికి చెందిన దళిత మహిళ గోవిందమ్మను గ్రామ పెత్తందారు సత్యం గౌడ్ అండతో బీసీ కులస్థులు కులం పేరుతో దూషించి, ఆమెను దౌర్జన్యంగా ఈడ్చుకొని వెళ్లి, వివస్త్రను చేసి, గ్రామ ప్రజల సమక్షంలో కరెంటు స్థంబానికి తాడుతో కట్టివేసి చిత్ర హింసలకు గురిచేసిన అమానవీయ ఘటనను మానవ హక్కుల వేదిక, IFTU, రైతు కూలీ సంఘం, PDSU, మాల మహానాడు, PYS, ఆరు ప్రజా సంఘాల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం.
ప్రజా సంఘాలు సంయుక్తంగా కమిటీగా ఏర్పడి, ఆ కమిటీ భాద్యులు భాధితు రాలిని, ఎమ్మిగనూరు డి ఎస్ పి శ్రీనివాసా చారిని ఫోన్లో మాట్లాడడం జరిగింది.
మానవ హక్కుల వేదిక నుండి రాష్ట్ర అధ్యక్షులు U. G. శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి దేవేంద్ర బాబు, HRF కర్నూలు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుఉరుకుందప్ప, సూర్యనారాయణ, HRF సభ్యులు శేఖర్, తిక్కయ్య, తస్లీమ్, IFTU రాష్ట్ర నాయకులు నర్సన్న, హనీఫ్,అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రసాద్, యేసేపు, ప్రగతిశీల యువజన సంఘం ( PYU) చిన్ని ప్రసాద్, PDSU రవి, మాల మహానాడు రాష్ట్ర నాయకులు నర్సన్న, రవిచంద్ర, చెన్నయ్యలు ఉన్నారు.
కమిటీ భాద్యులు భాధితురాలు గోవిందమ్మను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కలవడం జరిగింది. ఆమె తన ఎకరా 88 సెంట్ల భూమికి పంట నష్టపరిహారం కొరకు వేలిముద్ర వేయడానికి 12 సెప్టెంబర్, 2024 సాయంత్రం కల్లుకుంట గ్రామానికి వెళ్లానని చెప్పింది. తన పెద్ద కొడుకు ఈరన్న, చాకలి నాగలక్ష్మిని ప్రేమించి 6-7 నెలల క్రితం ఎమ్మిగనూరులో పెళ్లి చేసుకోగా, ఆవిషయాన్ని జీర్ణించు కోలేని బీసీ కులస్థులంతా ఏకమై, గ్రామ పెత్తందారు ఈడిగ సత్య గౌడ్ అందండలతో తనపై దౌర్జన్యానికి చేశారని వాపోయింది. తనను ఇంటి నుండి తన కోడలు చాకలి నాగలక్ష్మి కుటుంబ సభ్యులు నన్ను జుట్టు పట్టుకొని బలవంతంగా ఈడ్చుకొని పోయి, కరెంటు స్థంబానికి కట్టివేశారని చెప్పింది. వారిలో తన కోడలు తల్లి, అక్క, నలుగురు వదినెలు, ఇద్దరు అన్న కొడుకులు ఉన్నారని చెప్పింది. అదేవిధంగా తనను కుల దూషణకు పాల్పడి, వివస్త్రను చేసి, దౌర్జన్యం చేసిన వారిలో చాకలి కులస్థులతో పాటు, బోయ, నెంబి, ఈడిగ, కురువ కులస్థులు కూడా ఉన్నారని చెప్పింది. ఆఖరికి మా మాదిగ కులస్థులే నన్ను ఊరికి ఎందుకు వచ్చావు? అని అడగడం చూస్తే, బీసీ కులస్థులు నన్ను, నా చిన్న కొడుకు రాజు (17) ను గ్రామంలో ప్రాణాలకు బ్రతకనిస్తారా? అన్న అనుమానం కలుగుతుందని, తమకు రక్షణలేదని వాపోయింది. వారు నన్ను సాయంత్రం 6.30 నుండి నాలుగు గంటల పాటు గ్రామ ప్రజల సమక్షంలో వేధించారని చెప్పింది.తనను రక్షించడానికి వచ్చిన పెద్ద కడుబూరు పోలీసులను కూడా, బీసీ కులస్థులు అడ్డుకున్నారని, అతి కష్టం మీద వారు నన్ను బాపురం గ్రామంలో చీర కట్టుకోవడానికి అవకాశం కల్పించి, నన్ను జీపులో కోసిగి మీదుగా ఎమ్మిగనూరు ఆసుపత్రికి చేర్చారని చెప్పింది.
కమిటీ భాద్యులు ఎమ్మిగనూరు డి ఎస్ పి ని ఫోన్లో మాట్లాడగా , తాము నిందితు లపై కేసును నమోదు చేసి రిమాండ్ పంపిన విషయం చెబుతూనే, FI R నకలు అడగ్గా, ఆయన తన ఆఫీస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది.మేము FIR పరిశీలించగా, పోలీసులు కేవలం గోవిందమ్మ కోడలు నాగలక్ష్మి కుటుంబ సభ్యులను ప్రధానంగా నిందితులుగా చూపి, గ్రామ పెత్తందారు సత్యం గౌడ్ ను, మిగితా బీసీ కులస్థులను పోలీసులు కాపాడే ప్రయత్నం జరిగిందని మేము భావిస్తున్నాం.
కావున రాష్ట్ర ప్రభుత్వం, ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరుగకుండా, ఒంటరి దళిత మహిళ గోవిందమ్మపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి, అందుకు కారకులైన వారందరిపై SC, ST (అత్యాచారాల నిరోధక ) చట్టం 1989 ప్రకారం కఠినంగా శిక్షించాలని, భాధితురాలికి రక్షణ కల్పించడంతో పాటు, వారికి తగిన ఆర్ధిక సహాయం చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం. ఆవిధంగా చేయని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేయవలసి వస్తుందని విజ్ఞప్తి చేస్తున్నాం.
( U. G. శ్రీనివాసులు )
HRF రాష్ట్ర అధ్యక్షులు,
ఆదోని.
(నర్సన్న)
IFTU రాష్ట్ర నాయకులు.
(ప్రసాద్)
అఖిల భారత రైతు కూలీ సంఘం,
చిన్న హరివాణం.
15.09.2024,
ఎమ్మిగనూరు.