కర్నూల్ జిల్లా కప్పట్రాల రిజర్వు ఫారెస్టులో ఇకపై ఉరేనియం నిక్షేపాల సర్వే, వెలికితీసే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితులలో చేయబోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర శాసనసభలో ఖచ్చితమైన తీర్మానం ఆమోదింప చేయాలని మానవహక్కుల వేదిక (HRF) డిమాండ్ చేస్తోంది. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టడంతో “ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ ప్రతిపాదన కొనసాగింపుకై ఎటువంటి చర్యలు తీసుకోరాదని” ప్రభుత్వం ఇచ్చిన హామీ కేవలం తాత్కాలిక ఉపశమనమేనని మేము భావిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉరేనియం తవ్వకాలు చేపట్టే ప్రమాదం ఇప్పటికీ పోంచే ఉంది.
13 మంది సభ్యులు గల హెచ్. ఆర్.ఎఫ్. బృందం 02-02-2025న దేవనకొండ మండలంలోని కప్పట్రాల, నెల్లిబంద, పి. కోటకొండ గ్రామాలను సందర్శించి స్థానిక ప్రజలను కలుసుకున్నాం. మా బృందం రిజర్వు ఫారెస్ట్ లో కొండపైనున్న కౌలుట్ల చెన్నకేశవ స్వామి ఆలయం వరకు వెళ్లి వచ్చింది. యురేనియం తవ్వకాల వల్ల తమ ఆరోగ్యం, వ్యవసాయం దెబ్బతింటాయని, తమకు జీవనోపాధి లేకుండాపోతుందని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. 2017లోనే అణు ఖనిజ ప్రాధమిక తవ్వకాల, పరిశోధన డైరెక్టరేట్ (ఏ.ఎం.డి.) స్థానిక ప్రజలకు తెలియకుండా రిజర్వు ఫారెస్ట్ లో 20 బోర్ బావుల తవ్వకాలను చేపట్టింది. అదంతా రహస్యంగా, ఎటువంటి పారదర్శకత లేకుండా గుట్టు చప్పుడు కాకుండా చేసేసారు. ఈ ప్రాంతంలో యురేనియం నిల్వలు అంచనా వేయడానికి మరో 68 బోర్ బావులు తవ్వాలని ఏ.ఎం.డి. కొత్త ప్రతిపాదనతో వచ్చింది. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం ఏ.ఎం.డి. ఆదోని ఫారెస్ట్ రేంజ్ లోని పత్తికొండ సెక్షన్ లోని కప్పట్రాల రిజర్వు ఫారెస్ట్ లో యురేనియం సర్వే చేపట్టాలనుకున్నది.
యురేనియం తవ్వకాలు మానవజాతికి, పర్యావరణానికి అత్యంత హానికరమని హెచ్.ఆర్.ఎఫ్. భావిస్తుంది. అంతే కాదు, యురేనియం తవ్వకాలు సామాజికంగా హానికరం, అనైతికం. ఈ తవ్వకాల వల్ల భూమి విషపూరితమౌతుంది. భూగర్భజలాలు తగ్గిపోతాయి, కలుషితమౌతాయి. భావితరాలకు కూడా హానికరం. యురేనియం మైనింగ్ వల్ల విడుదలయ్యే అవశేషాలు కొన్ని వేల సంవత్సరాల వరకు ఉండిపోతాయి. దాని వల్ల ఆ ప్రాంతంలోనున్న ప్రజలందరికీ ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశముంది. పుట్టుకతో అంగవైకల్యం, సంతానలేమి, రక్తంలో, ఎముకల వ్యవస్థలలో రకరకాల సమస్యలతో పిల్లలు పుట్టే అవకాశముంది. ఈ విషయం మనకి యురేనియం తవ్వకాలు జరిగిన జార్ఖండ్ లోని జాదుగుడా ప్రాంత ప్రజలను చూస్తే అర్ధమౌతుంది. మైనింగ్ నిలిపేసిన అనేక సంవత్సరాల తర్వాత కూడా ఆ ప్రదేశంలో అణు పదార్ధాలు విషం చిమ్ముతూనే ఉంటాయి.
కప్పట్రాల ప్రాంతంలో ఎటువంటి తవ్వకాలు చేపట్టినా దాని ప్రభావం స్థానిక జల వనరుల వ్యవస్థపై పడుతుంది. 1157 ఎకరాలలోనున్న కప్పట్రాల రిజర్వు ఫారెస్ట్ గొనెగండ్ల మండలంలోని మధ్యతరహ నీటిపారుదల ప్రాజెక్టయిన గాజులదిన్నె ప్రాజెక్ట్ (సంజీవయ్య సాగర్) పరివాహక ప్రాంతంలో ఉన్నది. ఈ ప్రాజెక్ట్ గొనెగండ్ల, పత్తికొండ, దేవనకొండ, కోడుమూర్ మండలాల్లోనున్న అనేక గ్రామాలకు తాగునీరు, సాగు నీరు సరఫరా చేసే హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగం. కప్పట్రాల రిజర్వు ఫారెస్ట్ నుండి పారే నీరు జిల్లేడుబుడకల, కరివేముల, నెల్లిబండ, ఎర్రబండ కొలను మీదగా గాజులదిన్నె ప్రాజెక్ట్ లోకి ప్రవహిస్తాయి. కప్పట్రాల రిజర్వు ఫారెస్ట్ నుంచి పారే వర్షపునీరు కోటకొండ చెరువు, నాగమ్మ వంక మీదగా మాచవరం చెరువులోకి ప్రవహిస్తాయి. ఆ ప్రాంత రైతులకు జీవనాడి అయిన ఈ చెరువులు యురేనియం మైనింగ్ వల్ల కలుషితమైతే 25 గ్రామాల ప్రజల జీవితాలు ధ్వంసమౌతాయి. భూగర్భ, ఉపరితల జలాలు రెండూ కలుషితమౌతాయి. లోతుల్లోకి పోయి తవ్వకాలు చేపట్టడం వల్ల భూగర్భ జలాశయాలు అణుపదార్దాలుగల రాతిని తాకే ప్రమాదముంది. భూగర్భజలాల వ్యవస్థ అంతా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది కాబట్టి ఆ నీటిలో శరవేగంగా అణుధార్మిక పదార్ధాలు కలిసి పోతాయి.
కప్పట్రాల రిజర్వు ఫారెస్ట్ లో తోడేళ్లు, నక్కలు, జింకలు, అడవి పందులు, ముళ్ళ పందులు, నక్షత్ర తాబేళ్లు, నెమళ్ళు ఉంటాయని స్థానికులు మాకు చెప్పారు. యురేనియం మైనింగ్ చేపడితే వాటి ఆవాసాలు నాశనమై వాటి ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. అంతే కాదు, కర్నాటక ఇతర సుదూర ప్రాంతాల నుండి మేత మేయడానికి పశువులను రిజర్వు ఫారెస్ట్ కి మళ్లిస్తూ ఉంటారు.
కడప జిల్లా వేముల మండలంలో భారత యురేనియం కార్పొరేషన్ సంస్థ (యు.సి.ఐ.ఎల్.) తుమ్మలపల్లిలో చేపట్టిన యురేనియం తవ్వకాల వల్ల ఆ ప్రాంత ప్రజలకు ఎంత నష్టం జరుగుతోందో కప్పట్రాల ప్రజలకు తెలుసు. తుమ్మలపల్లి పరిసర గ్రామాలలో ప్రజలు లాభసాటిగా సాగే వ్యవసాయ వృత్తిని, జీవనోపాధిని, మంచి ఆరోగ్యాన్ని, నీటి భద్రతను కోల్పోయి ఎన్ని అవస్తలు పడుతున్నారో అనే విషయం కూడా వారికి బాగా తెలుసు.
అణువిద్యుత్ అత్యంత ప్రమాదకర విద్యుత్శక్తి అనేది అందరికీ తెలిసిన విషయమే. అంతటి ప్రమాదకర విద్యుత్శక్తి కి ప్రాధాన్యత ఇచ్చే బదులు ప్రభుత్వం గాలి, సౌర శక్తుల వంటి పునరుత్పాదక విద్యుత్శక్తి వనరులకు, వాటికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి వెచ్చిస్తే మంచిది. విద్యుత్శక్తి భద్రత కోసం, వాతావరణ మార్పు అరికట్టడానికి అణువిద్యుత్ ప్రధాన పాత్ర వహిస్తాయని ప్రభుత్వం అనుకుంటోంది. మన దేశంలో విద్యుతృక్తి భద్రత సమకూరాలన్నా, వాతావరణ మార్పుని అరికట్టాలన్నా కావాల్సింది ఇందనపు విద్యుతృక్తి కాదు. అణువిద్యుత్ అంతకంటే కాదు. మిగిలిన పునరుత్పాదక విద్యుత్శక్తి వనరులతో పోల్చితే అణువిద్యుత్ ఉత్పాదన చాలా ఖర్చుతో కూడుకున్నది.
కప్పట్రాల ప్రాంతంలో యురేనియం నిల్వల అంచనా కోసం జరిగే ప్రయత్నాలను వెంటనే ఆపేయాలని హెచ్.ఆర్.ఎఫ్. డిమాండ్ చేస్తోంది.
యు.జి. శ్రీనివాసులు – హెచ్.ఆర్.ఎఫ్., ఏ.పి. రాష్ట్ర ఉపాధ్యక్షులు
యు.ఎం. దేవేంద్ర బాబు – హెచ్.ఆర్.ఎఫ్., ఏ.పి. రాష్ట్ర కార్యదర్శి
వి.ఎస్. కృష్ణ – హెచ్.ఆర్.ఎఫ్. ఏ.పి. & టి. జి. సమన్వయ కమిటీ సభ్యులు
05-02-2025,
కర్నూల్.