మందమర్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకులపై పోలీసుల వేధింపులు ఆపాలి

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ విద్యానగర్ కాలనీకి చెందిన నలుగురు యువకులు మందమర్రి పోలీస్ స్టేషన్ ఎస్సై, ఐడీ పార్టీ పోలీసులు తాము చేయని నేరాల్లో ఇరికించాలని చూస్తూ, తమను మానసికంగా వేధిస్తున్నారని, గతంలోని కేసుల విచారణ కోర్టులో ఉన్నప్పటికీ మాపై జులుం ప్రదర్శిస్తూ మా జీవితాలతో ఆడుకుంటున్నారని, పోలీసులు మేం సాధారణ జీవితం గడిపే అవకాశం లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ నెల 19వ తేదీన సెల్ఫీ వీడియో ద్వారా అందరికీ ఒక అభ్యర్థన పెట్టి, హెయిర్ డై తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఈ విషయమై మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ బృందం ఆదివారం రోజు బాధితులను, వారి కుటుంబ సభ్యులను, కాలనీవాసులను, పోలీసు అధికారులను కలిసి వివరాలు సేకరించింది.

ఈ ఆత్మహత్యా ప్రయత్నాన్ని ఆ యువకులు చనిపోయే ఉద్దేశంతో చేయకపోయినా, వాళ్లు తామున్న పరిస్థితి నుండి ఎట్లా బయట పడాలో తెలియక ఈ ప్రమాదకర మార్గాన్ని ఎంచుకున్నారు. ఇదే కాలనీకి చెందిన ఆటో నడుపుకునే ఎరుకల కులానికి చెందిన మరో యువకుడు ఒక సంవత్సరం కింద పోలీసులు తనపై అనేక కేసులు బనాయిస్తున్నారని భయపడి పోలీస్ స్టేషన్లోనే తన శరీరంపై తనే పెట్రోల్ పోసుకుని అంటించుకున్నాడు. దానికి ముందు ఒకసారి గొంతు కోసుకున్నాడు.

ఈ కాలనీ యువకులపై నమోదైన కేసులూ, వాటికి తట్టుకోలేక భీతి గొలిపే వారి పెనుగులాటల వెనుక చాలా సామాజిక, ఆర్థిక, వ్యవస్థాపరమైన అంశాలున్నాయి.
మందమర్రి విద్యానగర్ లోని ఎస్సీ ఎస్టీ కాలనీ అనేది అనేక ప్రాంతాలనుండి ఒకప్పుడు వలస వచ్చి, కాలరీ ఏరియాలో రోజూవారి కూలీ చేసుకొని బ్రతికే నిరుపేదలు నివసించే ప్రాంతం.

నవంబర్ 15న జరిగిన ఒక ముప్పై వేల రూపాయల విలువైన 40 మీటర్ల కాపర్ వైర్ దొంగతనం కేసులో కేసులో షారుఖ్ , శివ, రాజు, అజయ్ అనే ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఈ నలుగురితో పాటు మరో ఐదుగురిని కలిపి తొమ్మిది మంది దొంగతనం చేసినట్టు ఎఫ్ఐఆర్ లో రాశారు. అసలు ఇంతమంది కలిసి దొంగతనానికి పోవటం అనేదే నమ్మశక్యంగా లేదు. రిమాండ్ పీరియడ్ పూర్తి చేసుకుని, బెయిల్ పై విడుదలైన వారిని కండీషన్ పేరుతో వారానికి రెండు సార్లు స్టేషన్ కి రప్పించి బెదిరిస్తూ, అవమానకరమైన పనులు చేపిస్తూ, కొత్త కేసుల్లో కూడా ఇరికించటానికి ప్రయత్నం చేస్తున్నారని భయపడి ఈ నలుగురు యువకులు ఈ ప్రయత్నం చేశారు.

పోలీసులను పేదల మీదకు వదిలితే, వారు సామాజికంగా ఆర్థికంగా అట్టడుగున ఉన్న బలహీనుల మీద తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. చిన్న చిన్న దొంగతనం ఆరోపణల మీద తీవ్రమైన పోలీస్ వేధింపులకు, లాక్ అప్ హత్యలకు సైతం పాల్పడుతున్నారు. ఒకవైపు యువత చెడుదారు పట్టడానికి కావలసిన వ్యసనరమైన సంస్కృతిని పెంచే పాలకులే మరోవైపు నేరాల అదుపు పేరుతో అదే యువతపై కేసులు బనాయించటం, జైళ్లకు పంపటం అనేది అనైతిక మైన విషయం. ఈ విషయాలు సమీక్షించబడాలి.ఈ నిజ నిర్ధారణలో పాల్గొన్న మానవ హక్కుల వేదిక బృందంలో రాష్ట్ర అధ్యక్షులు ఆత్రం భుజంగరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. తిరుపతయ్య, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లింగాల రఘోత్తం రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు పందిళ్ళ రంజిత్ కుమార్ గార్లు ఉన్నారు.

మా డిమాండ్లు:

  1. రాష్ట్రవ్యాప్తంగా చిన్న చిన్న నేరారోపణలతో నిమ్నకులాలు, పేదలపై అమలౌతున్న పోలీసు అత్యాచారాలపై సమగ్ర విచారణ జరిపించాలి.
  2. మందమర్రి విద్యానగర్ కాలనీ యువకులపై పోలీసులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించకూడదు. మాటిమాటికీ వారి ఇంటి ముందు జీపులు పెట్టడం, ఫోన్లు చేసి పిలిపించటం, వారి తల్లిదండ్రులను అసభ్యంగా తిట్టడం, ఇతర కేసుల్లో నేరస్తులు దొరకనప్పుడు వీరిని చూపెట్టే ప్రయత్నం చేయటం వెంటనే ఆపివేయాలి.
  3. ఈ విషయంలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి గారు ఎస్సీ, ఎస్టీ కమిషన్ మరియు జిల్లా పరిపాలన అధికారులు కల్పించుకొని ఎంతో భవిష్యత్తు గల ఈ యువకులు తమ జీవితాన్ని గౌరవప్రదంగా గడిపే అవకాశాలను కల్పించాలి.
  4. రాష్ట్రంలో చట్టబద్ధమైన వేతనంతో కూడిన ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండటం పౌరులందరికీ ఒక హక్కుగా ఉండాలి.
  5. రాష్ట్రంలో మద్యం, గుట్కాలు, గంజాయి మొదలగు వ్యసనపర సంస్కృతిని అరికట్టాలి.

ఆత్రం భుజంగరావు , రాష్ట్ర అధ్యక్షులు మానవ హక్కుల వేదిక.

డా. ఎస్. తిరుపతయ్య , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానవ హక్కుల వేదిక.

మందమర్రి ,
23.12.2024.

    Related Posts

    Scroll to Top