స్థానిక ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న అరాచకాలు ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తున్నాయి

అధికార వర్గాల రాజకీయాలలో విలువల గురించి ప్రస్తావించడం హాస్యాస్పదమని ఈ రోజుల్లో అత్యంత సామాన్యులకు కూడా అర్థమైన విషయం.

స్థానిక ఎన్నికల సందర్బంగా ప్రతిపక్షాలపై, ప్రత్యర్థులపై జరుగుతున్న దాడులు చూస్తుంటే రాజ్యాంగాన్ని కాపాడవలసిన చట్టబద్ధ వ్యవస్థలు ఎంత నిర్వీర్యమయిపోయాయాయో తేట తెల్లమౌతుంది. అధికారంలో ఉన్న వాళ్ళు నిస్సిగ్గుగా గతంలో మీరు ఇలాగే చేసారుగా అని తమ దాడులను సమర్థించుకోవడం దిగజారుడుతనానికి పరాకాష్ఠ. రాజకీయ అధికారం ఉంటే చాలు, తమను ఏ చట్టబద్ధ వ్యవస్థలూ ఏమీ చేయ లేవనే నమ్మకం ప్రబలంగా ఉండబట్టే అధికార పార్టీలకు చెందిన మూకలు ఎన్నికల అధికారుల, పోలీసుల ఎదురుగానే దాడులు చేయడం, నామినేషన్ పత్రాలు లాక్కుపోవడం లాంటి చర్యలకు తెగబడుతున్నారు. దానికి తగినట్టుగానే వారిపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు.

రాజ్యాంగ వ్యతిరేకమైన సర్ ప్రక్రియతో కోట్లాదిమంది ఓటు హక్కును హరించడం, నిర్ణయాలు తీసుకోవడంలో పారదర్శకంగా లేకపోవడం ప్రజల ప్రశ్నలకు, ఆరోపణలకు సమాధానం చెప్పకపోగా బలప్రయోగంతో అణచివేయడం లాంటి చర్యలు ఎన్నికల కమిషన్ నిబద్ధత ను తూట్లు పొడిచాయి. ఈ విషయం గురించి రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏవీ కూడా నోరు మెదపలేదు. తమ అభ్యర్థులను అడ్డగిస్తున్నారని వై ఎస్ ఎస్ ఆర్ సీ పి కోర్టుకి వెళ్ళింది తప్ప నిజంగా చట్ట బద్ధ పాలన పట్ల గౌరవం ఉండి కాదు. అయితే ఈ దిగజారుడుతనమూ, రాజకీయ అధికారానికి కొమ్ము కాసే వ్యవస్థల వైఫల్యమూ ఆయా పార్టీలకు ఏమంత నష్టం కాదు కానీ ఈ ధోరణులు మన సమాజాన్ని వేగంగా అరాచకత్వం లేదా నియంతృత్వం దిశగా నెట్టడానికి దోహదపడతాయి. మానవ హక్కుల వేదిక ప్రజాస్వామ్యం పై జరుగుతున్న ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తుంది.

కె. వి. జగన్నాధ రావు (HRF ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు)
వై. రాజేష్ (HRF ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

విశాఖపట్టణం,
24.10.2026.

Related Posts

Scroll to Top