ప్రభుత్వ పాఠశాలలో వేధింపులకు గురైన బాలికలు – నిందితునికి ఉపాధ్యాయ సంఘ పెద్దల మద్దతు

కాకినాడ జిల్లా కరప మండలం వాకాడ గ్రామంలోని ప్రాధమిక మెయిన్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు  వి. ఎస్. రామారావు ఐదవ తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడని, బాలిక తల్లి పెద్దల సమక్షంలో ఉమ్మి ఊసి దూర్భాషలాడిందని, అతను సెలవుపై వెళ్ళేలా గ్రామస్తులు, పెద్దలు మాట్లాడారనీ వార్త వచ్చింది. తర్వాత రోజే 30-01-2025 బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు స్థానిక మండల విద్యా శాఖాదికారి. తదితరులతో కలిసి పాఠశాలకు వెళ్లి విచారణ చేయగా మరో నలుగురు విద్యార్థినులు కూడా వేధింపుల గురించి చెప్పారని, వెంటనే ఆ ప్రధానోపాధ్యాయున్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారని వార్త వచ్చింది. సదరు ఉపాధ్యాయుడు జన విజ్ఞాన వేదిక కార్యదర్శి కావడంతో ఉపాధ్యాయ యూనియన్ నాయకులు రంగంలోకి దిగి అతనిపై కేసు నమోదు కాకుండా ఉండే ప్రయత్నాలు ప్రారంభించారు. అని కూడా వార్తలో తెలిపారు.

మేము మానవ హక్కుల వేదిక (HRF) నుండి నలుగురం కలిసి 01-02-2025 న వాకాడ గ్రామంలోని ఆ పాఠశాలకు వెళ్ళాము. ఇంఛార్జ్ ప్రధానోపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయినులతో మాట్లాడానికి ప్రయత్నించగానే “యం.ఈ.ఓ. గారి పర్మిషన్ లేకుండా మేము ఎలా మాట్లాడము” అనే సమాధానమే అందరూ చెప్పారు. కొంత ప్రయత్నం చేశాక కొన్ని విషయాలు చెప్పారు. (ఆ స్కూల్ లో ఆయన తప్ప మిగిలిన ముగ్గురూ మహిళలే ), ఆయన వచ్చాక స్కూలు చాలా అభివృద్ధి అయిందని, ఆయన ప్రవర్తన తమకెప్పుడు అనుమానాస్పదంగా కూడా లేదని, విద్యార్థినులు కూడా ఎప్పుడూ ఎలాంటీ ఫిర్యాదు చేయలేదని అన్నారు. మరి కమిషన్ ముందు మొత్తం ఐదుగురు పిల్లలు వేధింపుల గురించి మాట్లాడిన విషయం ప్రస్తావించగా ఏమోనని దాట వేశారు. ఆ విద్యార్థినుల తల్లిదండ్రుల వివరాలు అడిగాము. మేమివ్వమని ఇస్తే వాళ్ళు గొడవకి వస్తారని రకరకాల సాకులు చెప్పారు. ఆఖరికి ఒక ఇద్దరి తల్లిదండ్రుల వివరాలు చెప్పారు. మేము బయటకి వచ్చి మళ్ళీ ఒక్కసారి చిరునామా అడుగుదామని వెనక్కు వెళ్ళేటప్పటికి ఆ టీచర్లంత క్లాసులు వదిలిపెట్టి  స్టాఫ్ రూమ్ లో గాభరాగా ఏంటో మాట్లాడేసుకుంటున్నారు. వాళ్ళ స్కూళ్ళో బాలికలకు ఇంత ఇబ్బంది ఎదురైందన్న భావన ఏ కోశానా లేదు. సరి కదా ఎంత సేపూ తమకి కాని, తమ తోటి ఉపాధ్యాయుడికి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ఘటనను సమసిపోయేలా  చేయాలనే తాపత్రయం  మాత్రం బలంగా  ఉంది.

సరే అక్కడ నుండి ఇద్దరిద్దరుగా విడిపోయి చిరునామాలు అడుగుతూ ఎస్.సి పేటకి చెరో వైపుకూ వెళ్ళాము. ఒక ఇంటిలో ఎవరూ లేరు. తాళం వేసి ఉంది. బంధువుల ఇంటికి వెళ్లారని ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పారు. ఎందుకెళ్ళారు అంటే, ఎవ్వరూ సరిగా ఏమీ చెప్పలేదు. వేరే చిరునామాలో ఇంటి తలుపు తీసే ఉంది. వరండాలో ఒక వ్యక్తి వాషింగ్ మెషిన్ బాగు చేయడానికి వచ్చిన టెక్నీషియన్ లతో మాట్లాడుతున్నాడు. మేమీ పని మీద వచ్చామని చెబితే ఆ ఇల్లు తమది కాదని, తమ బంధువులదని, వాషింగ్ మెషిన్ బాగు చేయించడానికే తను వచ్చానని చెప్పాడు. ఇంట్లో వాళ్ళు కూలి పనులకెళ్ళి పోయారని ఎక్కడికెళ్ళారో తెలియదని హడావిడిగా తాళం కూడా వేసుకోకుండా వెళ్ళిపోయాడు. అతను వేధింపులకు గురైన అమ్మాయి తండ్రి. ప్రక్కిళ్ళ వాళ్ళనడిగితే పెద్దగా ఏమీ తెలీదంటూనే పిల్లలు లేనిపోనివి కల్పించి చెప్పరు కదా అంటారు. అంబేద్కర్ బొమ్మ దగ్గరరికి చేరేప్పటికి మా బృందంలో వేరే ఇద్దరు అక్కడ కొంత మంది గ్రామస్తులతో మాట్లాడుతూ ఉన్నారు. వేధింపులు జరిగిన మాట వాస్తవమే కానీ మేమెవ్వరం వివరంగా మాట్లాడడానికి సిద్ధంగా లేమన్నట్లుగా చెప్పారు. వాళ్ళ స్నేహితులలో కొంత చదువుకున్న వేరే వ్యక్తికి ఫోన్ చేసి కొన్ని వివరాలు చెప్పారు. ఆయనని ఇంకా వివరంగా చెప్పమంటే తర్వాత మాట్లాడతాను అన్నాడు. కొంత సేపటి తర్వాత ఫోన్ చేస్తే నాకేమి తెలీదు అన్నాడు.

నిందితుడు కుల పరంగాను, ఆర్ధికంగానూ బలవంతుడు కావడంతో అతని యూనియన్ నాయకత్వం, గ్రామ పెద్దలూ అతనికి దన్నుగా నిలిచి గ్రామస్తులను మాట్లాడకుండా కట్టడి చేయగలిగారు. ఇక అక్కడి నుండి కరప పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఆరా తీయగా ఎఫ్.ఐ.ఆర్ (సి.ఆర్ సంఖ్య.40/2025 ఆఫ్ కరప పోలీస్ స్టేషన్ ) అయితే నమోదు చేశామని, అయితే దర్యాప్తుకు గ్రామానికి వెళ్ళి రోజంతా కూర్చొన్నా కూడా ఎవ్వరూ నోరు మెదపడం లేదని, ఈ కేసులో తాము చేయగలిగింది ఇక నామమాత్రమేననీ పోలీసులు అన్నారు. అంతకు ముందు రోజే ఉపాధ్యాయ సంఘ పెద్దలు నిందితునితో పాటు స్టేషన్ కి వెళ్లి, పోలీసులను ప్రభావితం చేసి స్టేషన్ బెయిలు తీసుకుని వెళ్లారని తెలిసింది. పోక్సో కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం చాలా అరుదు. పైగా ఇక్కడ నిందితుడు నివసించేది ప్రక్క గ్రామమైన వేములవాడలోనే, అతను సాక్షులను ప్రభావితం చేస్తున్నాడని కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అయినా సరే అతనికి స్టేషన్ బెయిలు ఇచ్చారు. మామూలుగా అయితే పోలీసులు సాధారణ జేబు దొంగలకు సైతం కనీసం రెండు వారాలు జ్యుడీషియల్ రిమాoడు అడుగుతారు. అయితే ఈ కేసులో మాత్రం తమ విచక్షణాధికారాలను వినియోగించి తక్షణమే బెయిలు ఇచ్చేశారు.

సరే మేము గమనించిన విషయాలతో క్లుప్తంగా ఒక పత్రికా ప్రకటన రాసి స్థానిక విలేఖరులకు ఫోన్ ద్వారా పంపించాము. ఆంధ్రజ్యోతి కంట్రిబ్యూటర్ సత్తిబాబు కైతే మేము మూడు నెంబర్ల నుండీ ఫోన్ చేశామని కోపం వచ్చేసింది, “నేను వార్త వేయను, అసలు దీనిలో మీ మోటో (మోటివ్) ఏంటి?” అంటూ మాట్లాడాడు. ఒక స్థానిక పత్రిక తూర్పు ఉదయమో, తొలి ఉదయమో పేరు గుర్తు లేదు, అతనికి మేము వార్త పంపను కూడా లేదు. అతనే ఫోన్ చేసి మేము వస్తున్నట్లు అతనికి ముందుగా తెలియజేయక పోవడమే పెద్ద పొరపాటని, ముందుగా మేము తప్పు ఒప్పుకుంటేనే వార్త వేసే విషయం ఆలోచిస్తానంటూ చాలా వదరాడు. ఇలాంటి పరిస్థితులలో వార్త రాదేమోనని కాకినాడ, అమలాపురం లలోని విలేఖరులకు కూడా పంపించాము. ఏదో ఒక లాగా వార్తయితే వచ్చింది. తర్వాత తెలిసిందేoటంటే ఈ ఘటనకు సంబంధిచిన వార్తలు ప్రముఖంగా రాకుండా ఉండడానికి బేరసారాలు జరిగి డబ్బులు చేతులు మారాయని అలానే గ్రామ పెద్దల ముందు నిoదితుడు తన తప్పు ఒప్పుకుని, వేరే ప్రాంతానికి బదిలీ చేయించుకుని వెళ్లిపోవడానికి రాజీ ఒప్పందం కుదిరిoదని.

మహిళల పై లైంగిక దాడులు జరిగిన ఘటనలలో దేశ వ్యాప్తంగా ఆగ్రహాందోళనలు చెలరేగడం, నిందుతులను బహిరంగంగా ఉరి తియ్యాలని, అంగ విచ్చేదనం లాంటి కౄరమైన శిక్షలు విధించాలని డిమాండ్లు రావడం మనం చూస్తూనే ఉంటాం, ఇక పైనా చూస్తాం. ఎందుకంటే మన సమాజంలో ‘చట్టబద్ధ పాలన’ అనేది (జోక్) హాస్యాస్పద స్థాయికి దిగజారి పోయింది. ఈ ఘటనలోనే చూస్తే నిందితుడు తమ వాడైనందుకు తాము వేదికలెక్కి చెప్పే విలువలను తుంగలో తొక్కి, నిస్సిగ్గుగా అతనిని కాపాడారు. బదిలీ పై వేరే చోటికి పంపేస్తారు సరే, మరి అక్కడి పిల్లల భద్రతకి భరోసా ఏంటి? ఒక్కటయితే ఖచ్చితంగా చెప్పొచ్చు, వేధింపులకు గురైన పిల్లలెవరూ కూడా ఈ పెద్దల సామాజిక, ఆర్ధిక స్థాయి దరిదాపులలో కూడా లేరు. వాళ్ళెప్పటికీ ఇతరులే. వారిపై సానుభూతి చూపగలరు కానీ సహానుభూతి ఉండదు. అందుకే మధ్య తరగతి/ఎగువ మధ్య తరగతి మహిళలపై లైంగిక దాడులు జరిగిన ఘటనలలో మాత్రమే పౌరసమాజం ఆగ్రహం ప్రకటిస్తుంది, వాళ్ళను తమ వాళ్ళుగా ఐడెంటిఫై చేసుకొంటారు. కొన్ని సమూహాలను ఎప్పటకీ మనం సమాజం అనుకునే దానికి ఆవలే ఉంచే పరిస్థితులను మార్చే కృషి బలంగా జరిగేంతవరకూ ఇంతే.

వై. రాజేష్ (మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

మహమ్మద్ ఇక్బాల్ (మానవ హక్కుల వేదిక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు)

కరప/కాకినాడ/అమలాపురం,
04.02.2025.

Related Posts

Scroll to Top