ప్రభుత్వం జీ.ఓ. 43ని అమలు పరచి, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలి

పల్నాడు జిల్లాలో అత్యధికంగా జరుగుతున్న రైతు ఆత్మహత్య కుటుంబాలను మానవ హక్కుల వేదిక (HRF), రైతు స్వరాజ్య వేదిక (RSV) కలిసి వివరాలను సేకరించాయి. ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రలేచి జీ.ఓ. 43ని అమలు పరచి, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము.

పాలకుల నిర్లక్ష్యం, ప్రకృతి చిన్న చూపు వల్ల, కౌలు రైతులకు జరుగుతున్న తీవ్ర అన్యాయం కారణంగానే పల్నాడు జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని మా నిజనిర్ధారణలో నిరూపణ అయ్యింది. చనిపోయిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందటం లేదు.

మా బృందం జులై 29, 30 తేదీలలో పల్నాడు జిల్లా గురజాల డివిజన్ లోని వెల్దుర్తి, దుర్గి, గురజాల మండలాల్లోని 8 గ్రామాలలో ఆత్మహత్య చేసుకున్న 9 మంది రైతు కుటుంబాలను, గ్రామస్తులను కలిసింది. రైతు ఆత్మహత్యలకు గల కారణాలు, ప్రభుత్వ స్పందన గురించి విషయ సేకరణ చేసింది.

పల్నాడు ప్రాంతంలో మిగిలిన డెల్టా ప్రాంతాల కంటే కౌలు రైతులు తక్కువగా ఉండేవారు కానీ గత కొన్ని సంవత్సరాలుగా పల్నాడులో కౌలు రైతుల సంఖ్య, కౌలు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. దాదాపు 25 వేల రూపాయల కౌలు చెల్లించి పత్తి, మిరప, వరి, కందులు సాగు చేసిన రైతులు కొన్ని సార్లు అధిక వర్షాలు, కొన్ని సార్లు అనావృష్టి, చీడ పీడల కారణాలతో తీవ్ర నష్టాలతో అప్పుల వారి వత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటు

న్నారు. వెల్దుర్తి మండలంలో వెయ్యి అడుగులు దాటితే గాని బోర్లలో నీళ్లు పడడం లేదు, బోర్ల కోసం కొంతమంది రైతులు లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ అప్పుల పాలవుతున్నప్పటికీ అవి చాలా సార్లు విఫలం అవుతున్నాయి. రైతులు అప్పులపాలు కావడానికి ఇది ఒక ప్రధాన కారణం. గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన తెగులు కారణంగా మిర్చి పంట దిగుబడి తగ్గిపోయింది. దానికి తోడు గణనీయంగా రేట్లు కూడా పడిపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. ప్రభుత్వ లోపభూయిష్ట పంటల భీమా కారణంగా పంటలు నష్టపోయిన రైతుల కుటుంబాలకు ఎప్పుడూ నష్ట పరిహారం అందిన దాఖలాలు లేవు. కౌలు రైతులకైతే అసలే అందవు.

ఇక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడం కోసం తెచ్చిన జీవో 43 అమలు తీరు ఎంత దారుణంగా ఉందంటే మేము సందర్శించిన 9 కుటుంబాలలో ఒక్క కుటుంబానికి మాత్రమే ఆ జీవో కింద ఏడు లక్షల ఎక్స్ గ్రేసియా అందింది. కొన్ని చోట్లనైతే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలవి నిజమైన రైతు ఆత్మహత్యలేనని నివేదికలు తయారు చేసి సంవత్సరం దాటిపోయినా ఆ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ఈ రోజుకీ అందలేదు. ఏ ఒక్క కుటుంబం దగ్గరికి కూడా డివిజన్ స్థాయి త్రిసభ్య కమిటీ (RDO, DSP, ADA) స్వయంగా వెళ్ళలేదు.

కనీసం ప్రాథమిక నివేదిక సమర్పించవలసిన మండల స్థాయి త్రిసభ్య కమిటీ (తహశీల్దార్, వ్యవసాయ అధికారి, సబ్ ఇన్స్పెక్టర్) కూడా కుటుంబాల దగ్గరికి రాలేదు. రెవెన్యూ ఇన్స్పెక్టర్, గ్రామ రెవెన్యూ అధికారి లాంటి అధికారులు కనీసం కుటుంబ సభ్యులను కూడా కలవకుండా తూతూ మంత్రంగా విచారణ చేసి నివేదికలు పంపారు. ఒక ఆదివాసి కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని ఈరోజు వరకు కూడా మండల స్థాయి అధికారులు పరామర్శించలేదు. ఆత్మహత్య చేసుకున్న రైతు (జటావత్ బాలు నాయక్ శ్రీరాంపురం తండా, వెల్దుర్తి మండలం, 11-01-2024), భార్య బిడ్డను ఉయ్యాలలో పడుకోబెట్టి తన కుటుంబ పోషణ జరగక కూలి పనికి పోయిన దృశ్యం నిజనిర్ధారణకు వెళ్లిన వారిని కలచి వేసింది. ఆ కుటుంబానికి ఆహార భద్రత కూడా కరువయింది. ఆ కుటుంబాలలోని పిల్లల చదువు అగమ్య గోచరంగా మారింది.

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు న్యాయంగా అందవలసిన ఎక్స్ గ్రేషియా చాలా రాజకీయ ఒత్తిళ్లకు గురవుతుందని మాకు అర్ధం అయ్యింది. “మేము ఫలానా పార్టీకి చెందిన వారము కాబట్టి ఎక్స్ గ్రేషియా రాద”ని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ మాతో చెప్పారు. ఆత్మహత్య జరిగిన రైతు కుటుంబాలలోని మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఏ ఒక్క కుటుంబంలో మహిళకు వితంతు పెన్షన్ రావడం లేదు.

సమాచార హక్కు చట్టం ద్వారా, నేర పరిశోధన విభాగం వారి లెక్కల ప్రకారం పల్నాడు జిల్లాలో ఈ దశాబ్ద కాలంలో 400కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే వారు ఎంత సంక్షోభంలో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఎప్పటికి రావచ్చని అధికారులను మా బృందం సంప్రదిస్తే వారి దగ్గర కూడా ఎటువంటి సమాధానం లేదు.

వాస్తవానికి రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు రైతు సంఘాలు, పోలీసుల లెక్కలు చెప్తుంటే ప్రభుత్వం కేవలం 39 మంది రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నట్లు అసెంబ్లీలో చెప్పడం రైతు ఆత్మహత్యలను ఎంత దాచి పెడుతున్నారో అర్ధం అవుతుంది.

డిమాండ్లు:

  • ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రలేచి చితికిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.
  • బాధిత కుటుంబాలను డివిజనల్ స్థాయి త్రిసభ్య ధృవీకరణ కమిటీ ఆలస్యం చేయకుండా సందర్శించి, విచారణ పూర్తి చేసి సత్వరమే పూర్తి స్థాయిలో కుటుంబాలకు ఆర్థిక సహాయం, పునరావాసం కల్పించాలి.
  • ప్రతి కౌలు రైతుకు గుర్తింపు కార్డు అందజేసి, వారికి బ్యాంకు రుణాలతో పాటు ప్రభుత్వ పధకాలు వర్తించేలాగా చూడాలి.
  • జీఓ 43కి సవరణ చేసి బాధిత కుటుంబాల అప్పుల వన్ టైం సెటిల్మెంట్ కోసం కొంత సొమ్మును కేటాయించాలి.
  • రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అత్యధిక ఆత్మహత్యలు జరుగుతున్న రాయలసీమ, పల్నాడు, ప్రకాశం జిల్లాలలో సమగ్ర అధ్యయనం చేసి సమస్యలు ఉన్న రైతుల కోసం ప్రభుత్వం ఒక హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేయాలి.

మేము సందర్శించిన రైతుల వివరాలు:

గురజాల డివిజన్, పల్నాడు జిల్లా

వెల్దుర్తి మండలం:

  1. మూలం శ్రీనివాసరెడ్డి- మందాడి గ్రామము, ఆత్మహత్య చేసుకున్న తేదీ 29-02-2024.
  2. ఐతంరాజు వెంకటేశ్వర్లు – రాచమల్లపాడు, 11-06-2024
  3. జటావత్ బాలు నాయక్ శ్రీరాంపురం తండా, 11-01-2024

దుర్గి మండలం:

  1. చల్లా వెంకటేశ్వరరావు ముత్తుకూరు, 27-12-2023
  2. కొల్లి రామయ్య -ముత్తుకూరు, 15-06-2022 (ఎక్స్ గ్రేషియా అందింది)

గురజాల మండలం:

  1. గంట గణేష్ – మాడుగుల, 02-03-2024
  2. బండ్ల నారాయణ మాడుగుల, 04-03-2024
  3. కన్నెబోయిన శివగంగరాజు – పులిపాడు, 23-09-2024
  4. గుండాల ఆంజనేయులు- తేలుకుట్ల, 17-08-2024

నిజనిర్ధారణలో పాల్గొన్న వారు:

  • జి. బాలు – రైతు స్వరాజ్య వేదిక AP రాష్ట్ర కో కన్వీనర్
  • బి. కొండల్ – రైతు స్వరాజ్య వేదిక AP రాష్ట్ర కమిటీ సభ్యులు
  • కె. అనురాధ – మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
  • వై. రాజేష్ – మానవ హక్కుల వేదిక AP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
  • వి.ఎస్. కృష్ణ – మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయకర్త

2-8-2025,
విశాఖపట్నం

Related Posts

Scroll to Top