ప్రకృతి వైపరీత్యాల నివారణకు తగిన వ్యవస్థను బలోపేతం చేయాలి

ఆగస్టు చివరి వారంలో రాష్ట్రమంతటా కురిసిన భారీ వర్షాలు తీవ్ర ఆస్తినష్టం, ప్రాణ నష్టం కలిగించాయి. కొన్ని పదుల మంది మనుషులు చనిపోయారు. 117 గ్రామాలు వరదల వల్ల నష్టపోయాయి. 58 వేల దాకా ఇళ్ళు దెబ్బ తిన్నాయి. ఇప్పటివరకు పూర్తిగా లెక్కలోకి రాని ఎంతో ఆస్తి నష్టం, వేలాది ఎకరాల్లో పంటల నష్టం జరిగింది. ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, కరీంనగర్, కామారెడ్డి జిల్లాలలో ఈ నష్టం ఎక్కువగా జరిగింది. ప్రభుత్వం తరుపు నుండి ప్రజాప్రతినిధులు, అధికారులు వరద భాదిత ప్రాంతాలను, ప్రజలను సందర్శించారు. సహజంగానే వారి సందర్శనలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. కానీ, లక్షలాది మంది ప్రజలు కోలుకోవడానికి మాత్రం కొన్ని నెలలూ, సంవత్సరాలు కూడా పట్టవచ్చు.

గత అయిదు సంవత్సరాలలో రాష్ట్రంలో వరదల వల్ల జరిగే నష్టం పెరుగుతున్నది. ఇటువంటి సందర్భాల్లో నష్టం జరిగిన తర్వాత తీసుకునే సహాయక చర్యలకు ప్రభుత్వం పరిమితం కాకుండా, నష్టాలను తగ్గించే వ్యవస్థలైన స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) ను బలోపేతం చేయాలి. జాతీయ స్థాయిలో నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉన్నట్టు, ప్రతి రాష్ట్రం లోనూ ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది ఉండాలి. భూకంపాలకు, వరదలకు, తూఫాన్లకు, అగ్ని ప్రమాదాలకు, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాన్ని తగ్గించడానికి ఈ సంస్థ నిరంతరం పనిచేస్తుంది. ఇది వరదలు వచ్చేముందే లోతట్టు ప్రాంతాలను గుర్తించటం, ఆయా ప్రాంతాలలో ఉన్న ఎత్తైన ప్రదేశాలకు ప్రజలు తరలే విధంగా సన్నద్ధం చేయటం, వరదలు వచ్చే ప్రాంతాలలో సుశిక్షితులైన రెస్క్యూ బృందాలను, పడవలను, హెలికాఫ్టర్లను ముందుగానే సిద్ధం చేసి ఉంచుతుంది. అనేక సాంకేతిక మార్గాల ద్వారా కూడా ఈ సంస్థ మొత్తం రాష్ట్ర ప్రజలను ప్రకృతి వైపరీత్యాలు పట్ల చైతన్యపరుస్తుంటుంది.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దగ్గర నుంచీ ఈ విషయంలో ప్రభుత్వం వైపు నుండి తగిన ప్రయత్నం లేక రాష్ట్రంలో అగ్నిమాపక దళమే స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ గా వ్యవహరిస్తోంది. వరదలు వచ్చినపుడల్లా ప్రభుత్వం కొన్ని పైపై చర్యలు మాత్రమే తీసుకొని క్రమంగా మర్చిపోవడమో, లేదా కేంద్రంపై రాష్ట్రం, రాష్ట్రంపై కేంద్రం అరోపణలు చేయటం మాత్రమే జరుగుతున్నది. ఇకనైనా తక్షణ పరిహారం మీద మాత్రమే కాకుండా భవిష్యత్తులో నిర్మాణాత్మకంగా పనిచేసే సంస్థల బలోపేతంపై దృష్టి పెట్టాలి. తెలంగాణ కొత్త ప్రభుత్వమైనా ఈ విషయంపై స్పందించి, స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను అన్ని రకాల ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే విధంగా బలోపేతం చేయాలని మేం కోరుతున్నాం. అలాగే ప్రకృతి వైపరీత్యాల బాధితులకు నష్టపరిహారం ఒక హక్కుగా ఖచ్చితంగా అందేటట్టు చట్టం తీసుకురావాలి.

తక్షణమే చేపట్టవలసిన చర్యలు

  1. మృతుల కుటుంబాలకు కనీసం పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేసియా, పంట నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారం మరియు పునరావాస సహాయాలను వెంటనే అందించాలి.
  2. రెండు నెలలపాటు బాధితులు అందరికీ నిత్యావసర సరుకులను రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా అందించాలి.
  3. వరదల్లో ఆధార్, సర్టిఫికెట్లు, భూమి పత్రాలు వగైరా కోల్పోయిన వారికి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసి నకలు కాపీలు అందించే ఏర్పాట్లు చేయాలి.

ఎస్. జీవన్ కుమార్, (HRF ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు)
డాక్టర్ ఎస్. తిరుపతయ్య, (ప్రధాన కార్యదర్శి, తెలంగాణ HRF)
దిలీప్, (HRF వరంగల్ ప్రధాన కార్యదర్శి)
సంజీవ్, (HRF హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శి)

08.09.2024.

Related Posts

Scroll to Top