శ్రీకాకుళం జిల్లా, పెద్దకొజ్జిరియా గ్రామానికి చెందిన రైతు బల్లెడ నరసింహ మూర్తి కుటుంబానికి న్యాయం జరగాలి, ప్రభుత్వం వెంటనే జి.ఓ 43ను అమలు చేయాలి

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం, పెద్దకొజ్జిరియా గ్రామానికి చెందిన రైతు బల్లెడ నరసింహ మూర్తి (58) కుటుంబానికి న్యాయం జరగాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే జి.ఓ 43ను అమలు చేయాలని మానవ హక్కుల వేదిక (HRF), రైతు స్వరాజ్య వేదిక (RSV), బీసీ సంక్షేమ సంఘం (BCWA) డిమాండ్ చేస్తున్నాయి.

2025 ఏప్రిల్ 9న నరసింహ మూర్తి ఆత్మహత్య చేసుకున్నారు. వరుసగా పంటలు విఫలమవడం వల్ల భారీ అప్పుల్లో కూరుకుపోయిన ఆయన ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తీసుకోవాల్సి వచ్చింది. స్వంత భూమి ఒక ఎకరంతోపాటు, కౌలుకు తీసుకున్న ఎనిమిది ఎకరాల్లో జీడి, కొబ్బరి పంటలు సాగు చేసేవారు. కౌలు మొత్తం ముందే చెల్లించడం కోసం, ఇంకా సాగు ఖర్చు నిమిత్తం అప్పు చేసారు. వరుసగా వర్షాలు పడకపోవడం, కొబ్బరి పంటపై రుగోస్ తెల్ల దోమ (RSW) వ్యాపించడంతో పంట దిగుబడిలో నష్టం వచ్చింది. అప్పుల భారం భరించలేక, కుటుంబాన్ని పోషించలేనన్న వేదనతో ఆయన పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

ລໍ 162 HRF, RSV, BCWA మృతుడి భార్య నీలవేణి, కుమారుడు ప్రవీణ్ తో పాటు మకరంపురం గ్రామ రైతులతో మాట్లాడింది. ఉద్దానం ప్రాంతంలో అలముకొన్న వ్యవసాయ సంక్షోభం గురించి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది.

జీ.ఓ 43 ప్రకారం ఆర్.డి.ఓ నేతృత్వంలోని డివిజనల్ స్థాయి త్రిసభ్య కమిటీ సంఘటన జరిగిన వారం లోగ విచారణ చేపట్టాలి. కాని ఇప్పటివరకు ఆ కమిటీ గ్రామాన్ని సందర్శించలేదు. MRO నేతృత్వంలోని మండల స్థాయి కమిటీ కూడా విచారణ జరపలేదు; కేవలం డిప్యూటీ తహసీల్దారు మాత్రమే వచ్చి వెళ్ళారు.

ఫలితంగా, మూర్తి కుటుంబానికి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. ఈ నిర్లక్ష్యం జీ.ఓ. 43 యొక్క లక్ష్యాన్నే నీరుగారుస్తుంది. ఈ రకం ఘోర నిర్లక్ష్యం రాష్ట్ర వ్యవసాయ మంత్రికే చెందిన జిల్లాలో చోటుచేసుకోవడం అత్యంత ఆందోళనకరం.

గత పదకొండు నెలల్లో ఉత్తరాంధ్రలో అయిదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో యే ఒక్క కుటుంబానికి జీ.ఓ 43 ను అమలు చేసి నష్ట పరిహారం ఇవ్వలేదు. గతంలో చాలా తక్కువగా రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకున్న ఈ ప్రాంతంలో ఇప్పుడు తీవ్ర వ్యవసాయ సంక్షోభం వ్యాప్తి చెందుతోంది.

డిమాండ్లు:

  • డివిజనల్ స్థాయి త్రిసభ్య కమిటీ వెంటనే పెద్దకొజ్జిరియా వెళ్లి విచారణ పూర్తిచేయాలి.
  • మృతుడి కుటుంబానికి తక్షణమే రూ. 7 లక్షల పరిహారం చెల్లించాలి.
  • ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి పంటను నాశనం చేస్తున్న తెల్ల దోమ వ్యాధిని అదుపు చేయడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి.

విషయ సేకరణలో పాల్గోన్నవారు:

జి బాలు- RSV రాష్ట్ర కో-కన్వీనర్
బి డిల్లీ రావు – BCWA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కెవీ జగన్నాథ రావు – HRF రాష్ట్ర అధ్యక్షుడు
కె అనురాధ – HRF ప్రచురణల ఎడిటర్
కె వెంకట్రావు – HRF శ్రీకాకుళం జిల్లా ఈసీ సభ్యుడు
వి ఎస్ కృష్ణ – HRF ఏపీ & తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యుడు

18-05-2025,
విశాఖపట్నం.

Related Posts

Scroll to Top