కర్నూలు లోని TGV SRAAC విషపూరిత రసాయన పరిశ్రమ విస్తరణకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల అభిప్రాయాలను వ్యక్తం కాకుండ చేయడాన్ని నిరసిస్తూ కర్నూలు జిల్లా మోటార్ వర్కర్స్ యూనియన్ భాద్యులైన వి. వెంకటేశ్వర్లు కవిత రాయడం జీర్ణించుకోలేని టీజీ గ్రూప్ యాజమాన్యం ఫిర్యాదు ఆధారంగా చేయని నేరాన్ని అపాదిస్తూ అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని మానవ హక్కుల వేదిక (HRF) తీవ్రంగా ఖండిస్తోంది.
వెంకటేశ్వర్లు TGV SRAAC రసాయన పరిశ్రమ నుండి వెలువడే విషపూరిత రసాయనాలు పర్యావరణానికి, మనిషి ఆరోగ్యానికి ఏవిధంగా హాని కలుగజేస్తాయో ఎండగడుతూ కవిత రాయడం జీర్ణించుకోలేని యాజమాన్యం అతనిపై ఉద్దేశ్యపూర్వకంగా తమ వాచ్ మెన్ తో ఫిర్యాదు చేయించింది.
కర్నూలు 3 టౌన్ పోలీసులు బాధితుడిని విచారించకుండా, యాజమాన్యానికి కొమ్ముకాస్తూ, వారి ప్రాపకం కోసం బాధితుడిపైనే క్రిమినల్ కేసు నమోదు చేయడం దారుణం. పోలీసులు అంతటితో ఆగకుండా, అతన్ని పోలీసుస్టేషన్లో మూడు రోజులు అక్రమంగా నిర్భంధించి, అతని మొబైల్ లాక్కోవడమే కాకుండా, అతను వాచ్ మెన్ ను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి, డబ్బులు లాక్కొన్నాడని, చేయని నేరాన్ని అపాదిస్తూ, క్రిమినల్ కేసును నమోదు చేయడం పోలీసుల చట్టవిరుద్ధమైన చర్యగా మేం భావిస్తున్నాం.
రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి టి. జి. భరత్, అతని తండ్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు టి. జి. వెంకటేష్ లు విషపూరిత రసాయనాలు తయారుచేసే పరిశ్రమ యజమానులు కాగా, ఇక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఏవిధంగా కాలుష్యాన్ని నియంత్రణ చేయడం జరుగుతుంది అన్నది ఎవరికైనా అనుమానమే. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఒక వైపు రసాయన
పరిశ్రమకు అనుమతినిస్తూ, మరోవైపు “స్వచ్ఛ భారత్” గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది.
టి. జి. వెంకటేష్ రాజకీయాలను ఆసరా చేసుకొని, రసాయన పరిశ్రమలను పెంచుకొంటూ వచ్చాడు. ఆయన రసాయనాల నుంచి ఎదురయ్యే చెడు ప్రభావాల గురించి ప్రజలలో చైతన్యం కొరకు ప్రయత్నం చేసే ప్రజాసంఘాల బాద్యులను వేధించడంలో భాగంగా వారిపై క్రిమినల్ కేసులను బనాయించడం గతం నుండి కొనసాగుతున్నదే.
రాష్టాన్ని ఏలుతున్న కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను మరచి, అధికారంలోకి వచ్చినాక వాటిని విస్మరిస్తే ఎలా? రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1)(a) లోని ప్రాథమిక హక్కులలోని భావప్రకటనా స్వేచ్ఛను కాపాడే భాద్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? బాధితునికి అండగా ఉండవలసిన పోలీసులు, పరిశ్రమ యాజమాన్యానికి కొమ్ముకాస్తే, చట్టాలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఎవరు?
కావున రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పట్ల ఏమాత్రం భాద్యత ఉన్నా, పోలీసుల చట్టవిరుద్ధ చర్యలపై వెంటనే సమగ్రమైన విచారణ జరిపి, అందుకు కారకులైన పోలీసులపై చర్యలు తీసుకొంటూనే, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రసాయన పరిశ్రమపై జరిపిన ప్రజాభిప్రాయ సేకరణను వెంటనే రద్దు చేసి, బాధితుడైన వెంకటేశ్వర్లుపై పెట్టిన క్రిమినల్ కేసును ఉపసంహారించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
యు. జి. శ్రీనివాసులు (HRF ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు)
యు. ఎం. దేవేంద్ర బాబు (HRF ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి)
01.06.2025,
కర్నూలు.