తూర్పు గోదావరి జిల్లా గుమ్మళ్లదొడ్డి గ్రామంలో అసాగో ఇండస్ట్రీస్ నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను తక్షణమే నిలిపివేయాలి

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలో అసాగో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమ చట్టవిరుద్ధం అని, ఆ నిర్మాణాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని మానవ హక్కుల వేదిక (HRF) డిమాండ్ చేస్తుంది.

రోజుకి రెండు లక్షల లీటర్ల ఇథనాల్ సామర్థ్యంతో అసాగో సంస్థ పరిశ్రమ నిర్మాణాన్ని ప్రారంభించింది. గ్రామంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి చమురు శుద్ధి పరిశ్రమ కాంపౌండ్ లోనే సుమారుగా ఇరవై ఐదు ఎకరాలలో నిర్మిస్తున్నారు. ఈ కాంపౌండ్ కి ఎదురుగానే హిందుస్థాన్ పెట్రోలియం వాటి శుద్ధి పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమకి ఒక రెండు వందల మీటర్ల దూరంలో పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం కాలువ ఉండగా, ఒక మూడు వందల మీటర్ల దూరంలో గ్రామంలో మాగాణి వ్యవసాయం ఆధారపడిన చెరువు ఉంది. ఈ పరిశ్రమ ప్రహరీ గోడకు ఆనుకుని ఊరి దళిత వాడ ఉంది. పరిశ్రమ చుట్టూ మాగాణి పొలాలు ఉన్నాయి. అంటే, ఊరికి నడి మధ్యలో కడుతున్నారు. ఈ విషయం గురించి ముగ్గురు సభ్యుల వేదిక బృందం ఆదివారం నాడు నిజ నిర్ధారణ జరిపింది.

ఈ పరిశ్రమ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ జరపలేదు. ఒక లీటరు ఇథనాల్ తయారీకి నాలుగు లీటర్ల నీరు వాడతాము అని చెబుతున్నారు. భూగర్భ జలాలు వాడతాము అని చెబుతున్నారు. ఐతే, ఒక లీటరు ఇథనాల్ తయారీకి కనీసం ఎనిమిది లీటర్ల నీరు అవసరం అవుతుంది. అంటే రోజుకి పదహారు లక్షల లీటర్ల భూగర్భ జలాలు కనీస అవసరం. ఈ నీటి వాడకం ప్రభావం గురించి ఎటువంటి పర్యావరణ ప్రభావ అంచనా చేసిన దాఖలా లేదు. అంతే కాక భూగర్భ జలాల కాలుష్యం కారణంగా ఎత్తిపోతల పథకం కాలువ చెరువు కాలుష్యం అవ్వడం ఇథనాల్ పరిశ్రమలు ఉన్న చోట్ల సర్వసాధారణం. ఇక్కడ ఉన్న కాలువ మీద ఆధారపడి అనేక గ్రామాలు ఉన్నాయి. పక్కనే అచ్యుతాపురం, బావాజీపేట ఉన్నాయి.

అంతే కాక, ఈ పరిశ్రమని చమురు శుద్ధి కేంద్రం కాంపౌండ్ లో నిర్మిస్తున్నారు. చమురు శుద్ధి కేంద్రాలు ఉన్నాయని చెప్పి గ్రామంలో తారాజువ్వలు చేయడానికి కానీ, పొలంలో వ్యర్థాలను కాల్చడానికి కానీ కూడా అనుమతి లేదు. అటువంటి పరిస్థితులలో శుద్ధి కేంద్రం కాంపౌండ్ లోనే ఇటువంటి పరిశ్రమని ఎలా నిర్మిస్తున్నారు? అందులోనూ దట్టమైన జనావాసాల మధ్య నిర్మిస్తున్నారు. ఇదెంత ప్రమాదకరం అనే విషయాన్ని కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడం క్రిమినల్ నిర్లక్ష్యం.

అలాగే, ఇథనాల్ పరిశ్రమ రెడ్ కేటగిరీ పరిశ్రమ. ఈ పరిశ్రమలను ఊరికి, పొలాలకి దూరంగా నిర్మించాలి అని కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనలు ఉన్నాయి. ఇక్కడేమో ఊరికి నడి మధ్యలో, ఇళ్లు, పొలాల, జల వనరుల మధ్య ప్రమాదకరమైన ప్రదేశంలో నిర్మిస్తున్నారు. ఇంతకన్నా చట్ట ఉల్లంఘనలు బహుశా మనకి కనపడకపోవచ్చు. అదే కాక పాక్షికంగా తయారీ మొదలెట్టపడం కారణంగా పరిశ్రమ కాలుష్యం జనాలా ఇళ్లలోకి, పొలాల మీదకి రావడం మొదలయ్యింది.

ఈ పరిశ్రమ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజల మీద కేసులు, బెదిరింపులు జరపడం కూడా సాధారణం ఐపోయింది. వారి నిరాహారదీక్షను వైద్యుల వేషంలో వచ్చి భగ్నం చేసి, వారి మీద కేసులు పెట్టడం ఆక్షేపనీయం. గ్రామస్తుల నిరసనల కారణంగా జిల్లా కలెక్టర్ అధికారులు, గ్రామస్తులతో కూడిన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదికను ఇప్పటిదాక కూడా బయటపెట్టలేదు. ఇదంతా కూడా పూర్తిగా అప్రజాస్వామికం.

ఇన్ని ఉల్లంఘనలతో, ప్రాణాలని, వ్యవసాయానికి, పర్యావరణానికి ప్రమాదకరమైన ఈ పరిశ్రమ నిర్మాణాన్ని తక్షణమే ఆపివేయాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. ఈ నిజ నిర్ధారణలో వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. రాజేష్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ ఇక్బాల్, రాష్ట్ర కార్యదర్శి జి. రోహిత్ పాల్గొన్నారు.

వై. రాజేష్ (మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

జి. రోహిత్ (మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి)

02.02.2025,
రాజమండ్రి.

Related Posts

Scroll to Top