ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తీర ప్రాంతంలో అక్రమంగా తవ్విన ఆక్వా చెరువులని తక్షణమే తొలగించాలి

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తీర ప్రాంతంలో అక్రమంగా తవ్విన ఆక్వా చెరువులని తొలగించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ 2022 లో ఇచ్చిన తీర్పుని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నేటి వరకు అమలు చేయకపోవడానిని మానవ హక్కుల వేదిక గర్హిస్తున్నది. ఆ తీర్పుని సత్వరమే అమలు చేయాలని, అక్రమ ఆక్వా చెరువులని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తున్నది.

నేటి డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు, సఖినేటిపల్లి, మలికిపురం మండలాలలో తీర ప్రాంతంలో సాగులో ఉన్న అక్రమ ఆక్వా చెరువులని తొలగించాలని, అక్కడ సాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలకి అడ్డుకట్ట వేయాలని, వారి మీద చర్యలు తీసుకోవాలని స్థానికులు 2020 లో ఎన్జీటీ లో కేసు వేయగా, విచారణ చేయమని ట్రైబ్యునల్ వివిధ అధికారులతో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదికలో ఈ విషయాలు వాస్తవమే అని తేలాయి. ఆక్వాకల్చర్ కి సంబంధించి ఈ నివేదిక పేర్కొన్న కొన్ని అంశాలని మేము క్రింద ఇస్తున్నాము.

  • తూర్పు గోదావరి జిల్లాలో అనధికార ఉప్పు నీటి రొయ్యల సాగు 3200 ఎకరాలలో జరుగుతున్నది. అలాగే అనధికార చేపల చెరువుల విస్తీర్ణం 7300 ఎకరాలు.
  • చెరువు చెరువుకి మధ్య చట్టపరంగా ఉండవలసిన దూరాన్ని పాటించకుండా సాగు చేస్తున్నారు.
  • ఐదు హెక్టార్లకి పైబడి ఉన్న చెరువులలో ఏర్పాటు చేయవలసిన మురుగు శుద్ధి యంత్రాలని ఏర్పాటు చేయకుండా చెరువు మురుగుని అలాగే పంట కాలువలలోకి, ఏరుల్లోకి వదిలివేస్తున్నారు.
  • ఆక్వా చెరువు పేరు మీద వందల ఎకరాల పంట పొలాలని జత చేసి ఆక్వా వ్యవసాయం చేస్తున్నారు.
  • చెరువు మొత్తం విస్తీర్ణంలో కేవలం 60 శాతంలో మాత్రమే సాగు చేయాలి. మిగతా భాగాన్ని మురుగు శుద్ధికి, చెట్లకి ఇతరత్రా అవసరాలకి కేటాయించాలి. అయితే మొత్తం విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.
  • రాష్ట్ర మత్స్యశాఖ అధికారుల పర్యవేక్షణ నామమాత్రం. కనీసం వారి దగ్గర ఎంత విస్తీర్ణంలో సాగు జరుగుతున్నది అనే సమాచారం కూడా లేదు.
  • చట్టం ప్రకారం ఇసుక భూములలో రొయ్యల సాగు చేయకూడదు. అయితే నిరాటంకంగా సాగుతున్నది.
  • గ్రామం నుండి కనీసం 300-500 మీటర్ల దూరంలో మాత్రమే సాగు చేయాలి. అలాగే ప్రజల సామూహిక అవసరాల కోసం వాడుకునే స్థలాలలో చేయకూడదు. వీటి ఉల్లంఘన కూడా ఉంది.

పైన పేర్కొన్నవి కొన్ని అంశాలు మాత్రమే. ఎక్కడ ఉప్పు నీటి రొయ్యల సాగు చేయాలి, ఎలా చేయాలి అనే నియమాలు, మార్గదర్శకాలు 2005 నాటి కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ చట్టంలో పొందుపరిచారు. అందులో పోటు అల (హై టైడ్ లైన్) నుండి 200 మీటర్ల మధ్య అసలు ఆక్వా చెరువులు తవ్వకూడదు. అలాగే 200 నుండి 2000 మీటర్ల మధ్యలో తవ్వాలంటే ఈ అథారిటీ అనుమతులు అవసరం. కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీల ద్వారా ఈ అనుమతులు జారీ చేస్తారు. జారీ చేసేముందు చట్టప్రకారం ఉన్నాయా లేవా అనేది నిర్ధారించుకుని అనుమతులు జారీ చేయాలి. ఇసుక భూములలో, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ భూములలో, పంట పొలాల మధ్య, ఊరికి ఆనుకుని ఉన్న పొలాలలో, సామూహిక స్థలాలలో సాగు చేయడానికి అనుమతి లేదు. అయితే మా అనుభవంలో, నిజ నిర్ధారణలలో ఇవేమీ పాటిస్తునట్టు కనిపించలేదు. అంతేకాక పంట పొలాల మధ్య చేపల చెరువుల పేరు మీద అనుమతులు తెచ్చుకుని ఉప్పు నీటి రొయ్యల సాగు చేయడం అనేది సర్వసాధారణంగా మారింది. సఖినేటిపల్లి మండలం మూలగొంది లాంటి గ్రామాలలో శ్మశానం ఆక్రమించి మరీ రొయ్యల సాగు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ విషయాలని ఎన్టీటీ నివేదిక కూడా రూఢీ చేసింది.

ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఇంకోటి ఉంది. ప్రభుత్వం ఉప్పు నీటి రొయ్యల సాగు గురించి చెప్పే లెక్కలకి, క్షేత్ర స్థాయి లెక్కలకి సంబంధం లేదు. అంతే కాక, ప్రభుత్వం చెప్పే లెక్కల మధ్యే పొంతన లేదు. ఒక ఉదాహరణ తీసుకుందాం. ప్రభుత్వ ఆక్వా జోనింగ్ లెక్కల ప్రకారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆక్వా సాగు సుమారుగా 39000 ఎకరాలలో ఉంది. అయితే ఎన్జీటీ కమిటీకి జిల్లా మత్స్యశాఖ అందించిన వివరాల ప్రకారం కేవలం చేపల చెరువుల విస్తీర్ణమే 44000 ఎకరాలు. ఉప్పు నీటి రొయ్యల సాగు విస్తీర్ణం 20000 ఎకరాలు. అయితే ఇది కూడా వాస్తవమైన సంఖ్య కాదు అనేది మా అభిప్రాయం.

ఉప్పు నీటి రొయ్యల సాగు పరిస్థితి ఇలా ఉంటే, చేపల చెరువుల గురించి 2020 లో తీసుకువచ్చిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టంలో ఉన్న నియమాల ఆధారంగా ఎక్కడ చేపల చెరువులు తవ్వవచ్చో ఉంది. లోతట్టు

ప్రాంతాలు, చవుడు భూములు, ఆక్వా చెరువుల మధ్య ఉన్న పొలాలు, వ్యవసాయానికి పనికిరాని భూములు వగైరా లాంటి చోట్ల మాత్రమే చేపల చెరువులు తవ్వాలి. అయితే ఇక్కడ కూడా చట్ట అమలు కన్నా చట్ట పరిహాసమే ఎక్కువ అనేది మా అనుభవం. ఎప్పటికప్పుడు అనధికార చెరువులని రెగ్యులరైజ్ చేసుకుంటూ రావడం చట్టానికి ప్రభుత్వమే తూట్లు పొడవటం లాంటిది. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా ఈ చట్టంలో ఉంది. ఈ లెక్కన మొదటి చర్య ప్రభుత్వం మీదనే తీసుకోవాలి!

తీర ప్రాంతంలో ఉప్పు నీటి రొయ్యల చెరువుల గురించి ఎన్జీటీ 2022 లో తీర్పు ఇస్తే నేటి వరకు అమలు చేయలేదు. దానిని ప్రశ్నిస్తూ 2023 లో వాజ్యదారులు మళ్ళీ ఎన్జీటీ ని ఆశ్రయించగా, తమ తీర్పుని తక్షణం అమలు చేయమని స్పష్టంగా పేర్కొంది. అలా చెప్పి సంవత్సరం పైన అవుతుంది. అయినా కదలిక లేదు. దానితో ఈ నెల 30 లోపల అమలు చేయకపోతే అధికారుల చర్యలు తీసుకోవాల్సివస్తుంది అని హెచ్చరించింది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ తీర్పు అమలుకి అడ్డుపడడం బాధాకరం. అది న్యాయస్థానం ధిక్కరణ కిందకే వస్తుంది. అధికారులు ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా తీర్పుని అమలు చేయాలి.

మా డిమాండ్లు:

  • ఎన్జీటీ తీర్పుని తక్షణమే అమలు చేయాలి. అదే సమయంలో అక్కడ సాగు చేస్తున్న చిన్న, సన్న కారు రైతులకి పూర్తి పరిహారం అందించాలి. ఈ తీర్పుని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి.
  • తీర ప్రాంతంలో వాస్తవ ఉప్పు నీటి రొయ్యల సాగు వివరాలని సేకరించి, ప్రజలకి అందుబాటులో ఉంచాలి. అనధికార ఉప్పు నీటి రొయ్యల చెరువులని తొలగించాలి.
  • ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ లో చేపల చెరువుల వివరాలు సేకరించి ప్రజలకి అందుబాటులో ఉంచాలి.
  • ఆక్వా జోన్ లో 2020 చట్ట నియమాలకి వ్యతిరేకంగా ఉన్న చెరువులని తొలగించాలి. నాన్ ఆక్వా జోన్ లో ఎట్టి పరిస్థితులలోనూ అనుమతులు ఇవ్వకూడదు.
  • ఆక్వా జోనింగ్ పటాలని, పత్రాలని గ్రామ సచివాలయాలలో అందుబాటులో ఉంచాలి.

వై. రాజేష్ (మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
ముత్యాల శ్రీనివాసరావు (ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి)

అమలాపురం,
18.09.2024.

Related Posts

Scroll to Top