విశాఖ ఉక్కు యాజమాన్యం ప్రభుత్వ విధానాలకు లోబడి తొలగించిన 3000 మంది కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి.

విశాఖ ఉక్కు కర్మాగారంలో గత పది రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిరవధిక సమ్మె చేస్తూ యాజమాన్యం బెదిరింపులకు లొంగకుండా సమ్మె కొనసాగిస్తున్న విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన పోరాటానికి మానవ హక్కుల వేదిక (HRF) సంఘీభావం తెలియజేస్తుంది.

విశాఖ ఉక్కు యాజమాన్యం కర్మాగారాన్ని ప్రైవేటైజ్ చేయాలన్న ప్రభుత్వ విధానాలకు లోబడి తొలగించిన 3000 మంది కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. తొలగింపుకు సిద్ధం చేసిన మరో 1800 మంది కార్మికులను విధుల్లో కొనసాగించాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది.

కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మె చేస్తుంటే, ఉత్పత్తి కుంటుపడుతుంటే, వారి సమస్యలు పరిష్కరించాల్సిన విశాఖ ఉక్కు యాజమాన్యం పోలీసులతో కార్మికులను భయభ్రాంతులను చేయటాన్ని మేము ఖండిస్తున్నాము.

కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని, అందులో భాగంగానే 11440 కోట్ల రూపాయలను ప్యాకేజీ పేరుతో ఇచ్చి, జిఎస్టి వంటి ఇతర అప్పులు లేకుండా చేసి, ప్రైవేటు వ్యక్తులకు ఈ కర్మాగారాన్ని అప్పజెప్పాలని కుట్ర చేస్తున్నట్టుగా మానవ హక్కుల వేదిక భావిస్తుంది. 32 మంది ప్రాణత్యాగాలతో, 69 గ్రామాల ప్రజల భూత్యాగాలతో నిర్మితమైన ఉక్కు కర్మాగారాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను ఖండిస్తున్నాము.

40 సంవత్సరాల విశాఖ ఉక్కు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీసుల పహారాతో బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. తమ న్యాయమైన సమస్యలపై పోరాడుతున్న కార్మికులను సస్పెన్షన్లతోనూ, షోకాజ్ నోటీసులతోనూ నిలువరించడం పారిశ్రామిక వివాదాల చట్టం 1948 ఉల్లంఘనగా మానవ హక్కుల వేదిక భావిస్తోంది. ఈ చర్యలు పాలకులు ప్రవేశపెట్ట చూస్తున్న దుర్మార్గమైన లేబర్ కోడ్ అమలు మినహా వేరేమీ కాదు.

ఇటువంటి అప్రజాస్వానికి చర్యలు వెంటనే నిలుపుదల చేసి ఉక్కు కార్మికుల, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి, కర్మాగారంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము.

కె వి జగన్నాధరావు – HRF AP రాష్ట్ర అధ్యక్షులు
వి ఎస్ కృష్ణ – HRF AP&TG సమన్వయ కమిటీ సభ్యులు

29-5-2025,
విశాఖపట్నం.

Related Posts

Scroll to Top