బురదమామిడి బూటకపు ఎన్కౌంటర్ – పోలీసులు, సి.ఆర్.పి.ఎఫ్ సిబ్బంది పై చర్య తీసుకోండి

నందకుమార్ సాయి గారికి,
అధ్యక్షుడు,
జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్(ఎన్.ఎస్. టి. సి)
న్యూఢిల్లీ

అయ్యా,

విషయం: ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలోని ఐదవ షెడ్యూల్ ప్రాంతానికి చెందిన పెదకోడాపల్లి గ్రామంలో 15 మార్చి 2019 న చట్ట విరుద్ధంగా పోలీసులు జరిపిన హత్యల గురించి- ఎన్.ఎస్. టి. సి విచారణ కోసం విజ్ఞప్తి.

ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల రక్షణ కోసం, అంతర్జాతీయ గుర్తింపు పొందిన హక్కుల అమలు కోసం పనిచేసే సంస్థ మానవహక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్). పోలీసు విభాగం వంటి రాజ్య పాలనా  విభాగాలు తమ విధుల నిర్వహణలో చట్టానికి బద్ధులై ఉండకపోవడం పట్ల మేము ఆందోళన చెందుతున్నాము. పౌరులెవరైనా నేరానికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తే చట్టం నిర్దేశించిన పద్ధతుల్లో విచారణ జరిగి, అక్కడ వారి నేరం ఋజువైతే వారిని శిక్షించాలి. అంతే కానీ చట్ట బాహ్యంగా వ్యవహరించి ఎవరినీ చంపకూడదు. భారత రాజ్యాంగంలోనిఆర్టికల్ 14, 21లకు ఈ చర్య వ్యతిరేకం.

మావోయిస్టుల ఏరియా కమిటీ సభ్యులని భావిస్తున్న బత్తి భూషణం (52), సిడారి జమధర్ (30)లు విశాఖపట్నం జిల్లా పెదబయలు మండలంలో 15 మార్చి 2019 రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయారన్న వార్త మీడియాలో వచ్చింది. ఈ సంఘటనలో వాస్తవాలు సేకరించడానికి మానవహక్కుల వేదికకు చెందిన ఇద్దరు సభ్యుల బృందం అక్కడకు వెళ్ళింది. హెచ్.ఆర్.ఎఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు వి.ఎస్.కృష్ణ, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కె.సుధ మార్చి 19 న పెదకోడాపల్లి, బురదమామిడి గ్రామాలనూ, సంఘటనా స్థలాన్నీ సందర్శించారు. ఈ రెండు గ్రామాలకు చెందిన ప్రజలతోపాటు జయంతి కోట, మెట్టవీధి ప్రజలను కూడా కలిసి మాట్లాడారు. ఆ రోజు జరిగిన  కాల్పుల నుంచి తప్పించుకున్న ఆదివాసీ వ్యవసాయ దారులు సిడారి రాంబాబు, కోడా బొంజు బాబులు కూడా నిజ నిర్ధారణ బృందం కలిసిన వారిలో ఉన్నారు. వారిద్దరూ ఆ రాత్రి కాల్పులు జరిగిన వైనాన్ని పూస గుచ్చినట్టు వివరించారు.

మార్చి 15-16 నిశిరాత్రి అక్కడ జరిగిన  కాల్పులు పోలీసులు చెబుతున్నట్టుగా ఎదురుకాల్పులు కావని మా నిజ నిర్ధారణలో తేలింది.  గ్రేహౌండ్స్ పోలీసులు, 198 సి.ఆర్.పి.ఎఫ్ బెటాలియన్ వారు జరిపిన ఏకపక్ష కాల్పుల్లో ఆ ఇద్దరు ఆదివాసులు చనిపోయారన్నది వాస్తవం. పోలీసులు చెబుతున్నట్టుగా మరణించిన ఆ ఇద్దరూ నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన వారు కాదు. హతులిద్దరూ ఆదివాసీ రైతులు. బత్తి భూషణానికి భార్య, ముగ్గురు పిల్లలు – భార్య వరాలమ్మ, పిల్లలు రంజిత్, గోవిందరావు, శ్యామల. మెట్టవీధి వాస్తవ్యులు. సిడారి జమధర్ పెదకోడాపల్లి నివాసి. అతడి భార్య కొండమ్మ. వ్యవసాయం చేసుకుని బతికే భూషణానికి ఫించను కూడా వస్తుంది. జమంధర్ కి ఈ మధ్యే పెళ్లి అయ్యింది.

భూషణం, బొంజుబాబులూ, అన్నదమ్ముల బిడ్డలయిన జమధర్, రాంబాబులూ మార్చి 15 రాత్రి భోజనం చేసి వేటకు బయలు దేరారు – ముఖ్యంగా పక్షులను వేటాడటానికి. వేసవి రోజుల్లో ఇలా వేటకు పోవడం ఆదివాసీ సమాజంలో సాధారణంగా జరుగుతూ ఉంటుందన్న సంగతి మీకు తెలియంది కాదు. భూషణం, జమధర్ లు ఇద్దరూ చెరొక దేశవాళీ తుపాకీని చేతబుచ్చుకుని వెళ్లారు. నుదుట టార్చ్ లైట్లు కట్టుకున్నారు. మిగిలిన ఇద్దరూ చేతుల్లో టార్చ్ లైట్లు పట్టుకున్నారు.

నలుగురూ స్థానిక గేదె గెడ్డను దాటి జయంతికోట వరకు వెళ్లారు. అర్థరాత్రి వేళ అక్కడి నుంచి వెనక్కు మళ్లారు. బురదమామిడి గ్రామం వద్ద అర్నంబయలు కొండ దిగి బురదమామిడి గ్రామస్తుల పొలాల్లో ఓ బాట వెంబడి నడుస్తున్నారు. నలుగురూ సాధారణ దుస్తుల్లోనే ఉన్నారు. పోలీసులు అర ఫర్లాంగు దూరం నుంచి వీరి మీదకు ఎడమ పక్క నుంచి కాల్పులు జరిపారు. పోలీసులు ముందస్తు హెచ్చరిక ఏమీ చేయలేదు. ముందు నడుస్తున్న రాంబాబు, వెనక ఉండిన బొంజుబాబు ప్రాణాలు కాపాడుకోవటానికి పరుగులు పెట్టారు. రాంబాబు కొంత దూరం పాక్కుంటూ వెళ్ళాడు. అక్కడనుంచి స్థానిక ఏరు వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్ళి తప్పించుకున్నాడు. భీతిల్లిన రాంబాబు కొండల్లో ఓ మామిడి చెట్టు మీద ఆ రాత్రంతా దాక్కుని తెల్లారిన  తర్వాత ఉదయం 8 గంటల వేళ గ్రామం వద్దకు చేరుకున్నాడు. బొంజుబాబు మెట్టవీధికి పరుగెత్తుకుంటూ వెళ్ళి ఇంట్లోకి చేరుకోగలిగాడు.

భూషణం, జమంధర్ లు ఇద్దరికీ తప్పించుకునే అదృష్టం దక్కలేదు. పోలీసు కాల్పులకు బలైపోయారు. ఎప్పటిలాగానే ఎదురు కాల్పులు అంటూ పోలీసులు కట్టుకథను అల్లారు. విచక్షణ లేకుండా జరిపిన ఏకపక్ష కాల్పులను ఆత్మ రక్షణ కోసం జరిపిన ఎదురుకాల్పులుగా చిత్రీకరించారు. కావాలని చేసిన ఈ కాల్పులు ఎక్కడో కాకులు దూరని కారడవిలో జరగలేదు. కాల్పులు జరిగిన బురదమామిడి డివిజన్ కేంద్రమైన పాడేరుకు కేవలం 15 కి. మీ దూరంలో ఉంది.

ఇలాంటి ఏకపక్ష కాల్పులు జరగడం ఇది మొదటిసారి కాదు. ఇదే విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో కొయ్యూరు మండలం బూదరాళ్ళ పంచాయతీ  కన్నవరం గ్రామం వద్ద డిసెంబర్ 3, 2007న ముగ్గురు ఆదివాసీ యువకులను (మర్రి నాగేశ్వరరావు, మామిడి గోపాలరావు, మూసిడి బంగారయ్య) పోలీసులు చంపేశారు. ఆ రోజు తమ పంటలను పాడుచేస్తున్న అడవి పందులను, ఇతర జంతువులను తరిమి వేసే పనిలో ఉన్న 25-30 మంది స్థానికుల్లో వీళ్ళూ ఉన్నారు. వాళ్ళంతా నల్లబిల్లి, కన్నవరం వాస్తవ్యులు. ఒక ఏరు దగ్గర సేద తీర్చుకుంటున్న సమయంలో గ్రేహౌండ్స్ దళాలు వీరిపై కాల్పులు జరిపి చంపేసారు. ఈ ఘటన సాయంత్రం 4.30 కి జరిగింది.

ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా కోరుకొండ బ్లాక్ కు చెందిన బాలకాటి వాస్తవ్యులు గంగా మడకామి(40), గంగా పొడియామి(33) లను  ఫిబ్రవరి 21, 2016 మద్యాహ్నం గ్రేహౌండ్స్ దళాలు కాల్చి చంపేసాయి. వీరిద్దరూ ఆదివాసీ రైతులు. కొయ్యూరు మండలం పుట్టకోట అటవీ ప్రాంతంలో వేట చేసుకుంటున్న వీళ్ళను కాల్చేశారు. ఆ కాల్పులలో గాయపడ్డ ఇర్మా కావాసి అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతడికి విశాఖపట్నంలో శస్త్రచికిత్స చేయించి మూడు వారాల తర్వాత ఇంటికి పంపారు. పై రెండు సంఘటనలలోనూ చనిపోయిన వారు మావోయిస్ట్ పార్టీ గాలికొండ దళం వారని పోలీసులు అబద్ధాన్ని ప్రచారం చేశారు.

ఆదివాసులకు అడవితో  సహజమైన సజీవ సంబంధం ఉంటుంది. వారి బ్రతుకంతా దానితోనే ముడిపడి ఉంది. బురదమామిడి కాల్పులు జరిగిన తరువాత అడవిలోకి వెళ్లడానికి సంకోచిస్తున్నామని, ముఖ్యంగా రాత్రి పూట వేటకు వెళ్లాలంటే భయంగా ఉందని ఈ ప్రాంతంలోని అనేక గ్రామాల ప్రజలు చెప్పారు. తమ భద్రత గురించి ఆదివాసులు ఆందోళన చెందడం ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

ఏకపక్ష కాల్పులకు దిగి ఆదివాసులను హత్య చేసిన పోలీసులపై ఐపిసి 302, ఇతర సెక్షన్ల కింద పెదబయలు పోలీసు స్టేషన్లో  కేసు నమోదు చేయాలని మానవహక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది. పోలీసులకు సంబంధం లేని ఒక స్వతంత్ర సంస్థతో కేసు విచారణ జరిపించాలని కోరుతోంది. చనిపోయిన వారి కుటుంబాలకు తగిన విధంగా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. జాతీయ ఎస్ టి కమిషన్ నూ, జాతీయ మానవ హక్కుల కమిషను నూ ఈ విషయంలో సంప్రదించబోతున్నామని తెలియ చేస్తోంది.

కె. సుధ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్  
వి.ఎస్.కృష్ణ, ఆంధ్ర- తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యుడు
మానవ హక్కుల వేదిక

20.03.2019
 విశాఖపట్నం

Scroll to Top