కస్టడీ మరణాలకు సంబంధించి సెక్షన్‌ 176 1(4)ని అమలు చెయ్యాలి

డాక్టర్‌ సమీర్‌ శర్మ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
అంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం
విషయం: పోలీసు కస్టడీలో మరణాలు మెజెస్టీరియల్‌ విచారణ – నేర శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 176 1(A) ని అమలు చెయ్యడం గురించి.
సర్‌,

మానవహక్షుల వేదిక (హెచ్‌.ఆర్‌.ఎఫ్‌) ప్రజల రాజ్యాంగ హక్కులని, అలాగే అంతర్జాతీయంగా గుర్తింపబడిన హక్కులని సంరక్షించడానికి, వ్యాప్తి చేయటానికి ఏర్పడిన హక్కుల సంఘం.

మీడియా నివేదికల ద్వారా, అధికారిక సమాచారం ద్వారా మేము తెలుసుకున్నది ఏమిటంటే ఎక్కడైనా పోలీసు కస్టడీలో మరణం సంభవిస్తే ఆయా స్థానిక రెవెన్యూ డివిజినల్‌ అధికారులు మెజెస్టీరియల్‌ విచారణ చేపడుతున్నారు అని. అయితే ఈ విచారణ చట్టం నిర్దేశించిన పద్ధతిలో జరగటం లేదు. ఈ మధ్య కాలంలో జరిగిన మరణాలే తీసుకుందాం. 4 మే 2022 న దెందులూరు మండలం పోతునూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి మడిపల్లి అప్పారావు (36) ఏలూరు జిల్లా భీమడోలు పోలీసు స్టేషన్లో కస్టడీలో ఉండగా మరణించారు. అలాగే విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీసు స్టేషన్‌ కస్టడీలో బేతా రాంబాబు (42) అనే ఎలక్ట్రీషియన్‌ ఈ సంవత్సరం ఫిబ్రవరి 4వ  తేదిన మరణించారు. ఈ రెండు ఉదంతాలలోను ఆయా స్థానిక రెవెన్యూ డివిజనల్‌ అధికారులు తమకి చట్టప్రకారం అధికారం లేకపోయినా కూడా మెజెస్టీరియల్‌ విచారణ చేపట్టారు.

నేర శిక్షాస్మృతికి 2005లో సవరణ చేసి సెక్షన్‌ 176 1(A) ప్రభుత్వం చేర్చింది. ఈ సెక్షన్‌ ప్రకారం పోలీసు కస్టడీలో జరిగే మరణాలు అన్నిటినీ కూడా జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ గానీ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ గానీ విచారించాలి గానీ ఎగ్జిక్యూటివ్‌ మేజిఫ్టేట్‌ కాదు. ఈ సెక్షన్‌ని నేర శాసనాల సవరణ చట్టం (25/2005) ద్వారా చేర్చటం జరిగింది. ఇది 23-06-2006 నుండి అమలులోకి వచ్చింది. వ్యవస్థాగత పక్షపాతం నుండి న్యాయ ప్రక్రియను కాపాడటానికి, ఆలాగే న్యాయం జరగటం మాత్రమే కాదు జరుగుతునట్టు కనిపించడం కోసం కూడా ఈ సెక్షన్‌ని చేర్చడం జరిగింది. పోలీసు కస్టడీలో మరణం జరిగినప్పుడు విచారణ మొత్తం న్యాయవ్యవస్థ కనుసన్నులలో జరగాలి. అలా జరిగితేనే ఆ మరణం గురించిన విచారణ చట్టపరిధిలో జరుగుతుంది. అలాగే పక్షపాత విచారణ అనుమానాలని తొలగిస్తుంది.

ఇక్కడ స్పష్టమైన విషయం ఏమిటంటే రెవెన్యూ డివిజినల్‌ అధికారికి అటువంటి విచారణ చేసే అధికారం లేదు, అది చట్ట సమ్మతం కూడా కాదు. అటువంటి విచారణ న్యాయ ప్రక్రియ ఉల్లంఘనే. మానవ హక్కుల వేదిక ఇదే విషయాన్ని ఏలూరు, విజయనగరం జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకువచ్చింది. అయితే వారి నుండి ఎటువంటి స్పందన లేదు. మాకు తెలిసినంతవరకు జూన్‌ 2006 సవరణ అమలులోకి వచ్చిన తరువాత జరిగిన ఏ విచారణ కూడా నేర శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 176 1(A)కి అనుగుణంగా జరగలేదు. అన్ని ఉదంతాలలో కాకపోయినా దాదాపుగా అన్నిటిలో చట్టపరంగా ఎటువంటి అధికారం లేని రెవెన్యూ డివిజినల్‌ అధికారే విచారణ చేస్తున్నారు.

మీరు ఈ విషయంలో కలగచేసుకుని కస్టోడియల్‌ మరణాలలో సెక్షన్‌ 176 1(A)  అమలు అయ్యేలా, కేవలం జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ లేదా మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ మాత్రమే విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము.

మానవహక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్‌
11 మే 2022

Scroll to Top