ఇటీవల సామాజిక మాధ్యమాలలో, పత్రికలలో విపరీతంగా ప్రచారం అయిన “మూడ నమ్మకాల పేరు మీద వృద్ధురాలిపై దాడి” అనే ఘటన కు సంబంధించి వాస్తవాలు తెలుసుకోవడానికి మానవ హక్కుల వేదిక, భారత నాస్తిక సమాజం సభ్యులు ఉమ్మడిగా ఈరోజు అనగా 25/9/2026 శుక్రవారం నిజనిర్ధారణకు వెల్లడమైనది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం యం. పి. బంజర గ్రామ పంచాయతీకి హామ్లెట్ గ్రామమైన జింకల గూడెం గ్రామానికి చెందిన షేక్ సకీనా బీ అంగన్వాడి ఆయాగా రిటైర్మెంట్ అయి ఊర్లో కూలీ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆమెకు ఆరుగురు అమ్మాయిలు. అందరికి పెళ్ళిళ్ళు అయినవి. ఒక కూతురు సకీనా బీ వద్ద ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ సకీనా బీ కి కొన్ని నెలలుగా అనారోగ్యం పాలైతున్నది. దానితో పాటు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినడంతో గ్రామంలో వింత వింతగా ప్రవర్తించేది అని గ్రామస్తులు చెబుతున్నారు. సకీనా బీ ఆరోగ్యం గురించి వివిధ ఆసుపత్రులకు తిప్పినప్పటికీ వారికి సరైన అవగాహన లేక మానసిక వైద్యులకు చూపించాలనే ఆలోచన లేకపోవడంతో ఆమెకు దయ్యమో, సైతానో పట్టిందని ఆమెను బాగు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో గ్రామంలోని పెద్దమనుషులు అందరూ కూడి వారివారి సాంప్రదాయక ఆచారం ప్రకారం ఆ వీడియోలో చూపించిన పద్ధతిలో ఊరవతలి చెట్టువద్దకు తీసుకెళ్లి, చెట్టుకు మొలలు కొట్టి ఆమెను వాటి మీదకు ఎక్కించి వీపులో కొట్టడం వంటి చర్యలను చేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్థులందరూ ఆ తంతును వీడియో తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ వృద్ధురాలి ఆరోగ్యం ఏదో రకంగా బాగైంది. ఆ తర్వాత విషయాన్ని గ్రామస్తులందరూ సాధారణంగానే వదిలిపెట్టారు.
ఇటీవల తేదీ: 23/08/2026 నాడు గ్రామంలో షేక్ ఇస్మాయిల్ మరియు షేక్ మౌలానా అను రెండు కుటుంబాల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఇస్మాయిల్ మౌలానాను హత్య చేసేదాకా దారి తీసింది. గ్రామంలో మౌలానా కొన్ని సంవత్సరాలుగా వార్డు మెంబర్ గా సేవలందించడమే కాకుండా ఆ వార్డు సభ్యులందరికీ పెద్దమనిషిగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల ఆ జింకల గూడెంలోని మైనారిటీ మతస్థులందరూ ఈద్గా నిర్మించుకున్నారు. దానికి సంబంధించిన నిర్మాణ పర్యవేక్షణ షేక్ మౌలానా చూసుకుంటున్నాడు. ఆ క్రమంలో ఆ ఊరికి చివరగా ఉన్నటువంటి ఈద్గా దగ్గర పనులు పర్యవేక్షించే క్రమంలో ఆ పరిసరాల చుట్టూ కొంతమంది వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం మరియు అశుభ్రతకు గురిచేస్తున్నారనే విషయాన్ని ఈ మౌలానా గుర్తించాడు. అదే సమయంలో అక్కడ పక్కనే పనులు చేసుకుంటున్న మదార్ ను ఆరా తీయడం జరిగింది. ఇదంతా ఆ పక్కనే నివాసం ఉండే ఇస్మాయిల్ తన గురించే చెప్పుకుంటున్నారు కావచ్చని కాసేపటికి అక్కడే పని చేసుకుంటున్న మదార్ భార్యను తిట్టడంతో ఆమె అదే విషయాన్ని వచ్చి మళ్ళీ మౌలానా కు చెప్పిందని గ్రామస్థులు తెలిపారు. అదే సమయంలో మదర్ భార్య మౌలానతో మాట్లాడటం గమనించిన ఇస్మాయిల్ మౌలానా ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నాడు. కాసేపు ఇరుపక్షాలు ఘర్షణ పడిన తర్వాత గ్రామస్తులంతా కలిసి వారిని సముదాయించి వెళ్లగొట్టారు. ఇదంతా మనసులో పెట్టుకుని పగతో ఇంటికి వెళ్ళిన ఇస్మాయిల్ తనకు గల స్కార్పియో వాహనంతో వచ్చి అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై మౌలానాను గుద్దడం జరిగింది. ఆ ప్రమాదంలో గాయపడిన మౌలానా 29/08/2026 నాడు చనిపోయాడు. గ్రామస్థులు తెలిపిన దాని ప్రకారం ఈ హత్యకు పాల్పడిన ఇస్మాయిల్ గత కొన్ని సంవత్సరాలుగా పశువుల ఎగుమతి వ్యాపారం నిర్వహిస్తున్నారని అన్నారు. అప్పటి నుండి తన ఇంటివైపుగా ఎవరు వెళ్ళినా కూడా అకారణంగా దూషించడం అతనికి అలవాటైంది అని, అతనికి ఉన్న పరిచయాలు మరియు ఆర్థిక బలిమి వల్ల అందరితో దురుసుగా ప్రవర్తించేవాడని అన్నారు. ఈ పశువుల వ్యాపారం చేస్తున్న క్రమంలో వివిధ సందర్భాల్లో తన పశువులను పోలీసులు పట్టుకోవడం వంటి సంఘటనలు కూడా జరుగుతుండేవి. ఐతే వీటన్నిటికి కారణం గ్రామంలోని వ్యక్తులే చెబుతున్నారని అనుమానంతో అతను నిత్యం అభద్రతతో ఉన్నట్టుగా మాట్లాడేవారని గ్రామస్తులు తెలిపారు. ఇట్లా అభద్రత, అనుమానం మూలంగానే ఈద్గా పనులు పర్యవేక్షణ కోసం పోయిన మౌలానా, ఆ పక్కనే పని చేసుకుంటున్న మదార్ కుటుంబాలతో మాట్లాడటం చూసి అనుమానంతో కూడిన అభద్రత వల్ల ఘర్షణ పడి ఆవేశంలో ఉద్దేశ్యపూర్వకంగా ఆక్సిడెంట్ కి పాల్పడ్డాడు.
ఐతే ఎప్పుడైతే హత్యకు పాల్పడ్డాడో అప్పుడు ఇస్మాయిల్ కుటుంబం ఊరుకోక చనిపోయిన మౌలానా కుటుంబ సభ్యులను చంపడానికి బెదిరించారని మౌలానా కుమారుడు మరియు వారి కుటుంబ సభ్యులు చెప్పారు. ఐతే బాధిత కుటుంబ సభ్యులు ఎవరూ కంప్లైంట్ చేయకపోయినా మౌలానా స్వతహాగా స్టేషన్లో లొంగిపోవడం వల్ల పోలీసులు వచ్చి విచారణ చేసినట్టుగా చేసి మౌలానా కుటుంబసభ్యులతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని కూడా చెప్పారు. ఐతే బాధిత కుటుంబం ఇస్మాయిల్ కుటుంబం అందరి మీద కేసు పెడితేనే మేం ఒప్పుకుంటామని పోలీసుల మీద వత్తిడి చేసింది. ఇవన్నీ గమనిస్తున్న ఇస్మాయిల్ కుటుంబం ఈ హత్య కేసు నుండి తప్పించుకోవడానికి మౌలానా కుటుంబ సభ్యులను కూడా ఏదో ఒక కేసులో ఇరికిస్తే వారు చెప్పినట్టు ఉంటారని భావించారు. దానికోసం ఎప్పుడో ఐదారు నెలల క్రితం సకీనా బీ పట్లా గ్రామస్తులంతా కలిసి చేసిన సాంప్రదాయక మూడ నమ్మకపు ఆచారం ప్రకారం చేసిన చర్యను సోషల్ మీడియాలో ఉంచారు. ఆ తంతు జరిగే క్రమంలో ఇస్మాయిల్ కుటుంబం, మౌలానా కుటుంబం ఇతర గ్రామస్థులు ఉన్నారని తెలిపారు. ఆ వీడియోను ఇస్మాయిల్ తమ్ముడు నాగుల్ మీరానే తీసాడని మౌలానా కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థులు తెలిపారు. అంతేగాక మౌలానా హత్య తర్వాత పోలీసులు వారి కుటుంబ సభ్యులు లేవనెత్తిన ఏ అంశాలను పట్టించుకోకుండా హత్యకు పాల్పడిన ఇస్మాయిలుకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని కూడా వాపోయారు. ఈ విషయాలన్నీ తెల్సుకున్న మాకు ఉద్దేశ్య పూర్వక వీడియో బయట పెట్టడం వెనకాల ఉద్దేశ్య పూర్వకంగా చేసిన హత్యనుండి తప్పించుకోడానికి మౌలానా కుటుంబాన్ని కేసులో ఇరికించి తర్వాత సంధి చేసుకొని కేసు నుండి బయటపడాలని దురుద్దేశ పూర్వక చర్యగా మాకు అర్థమైంది. అంతేగాక ఇంకా ప్రజల్లో ఉన్న మూఢ నమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నదనే విషయాన్ని కూడా ఈ సంఘటన మన ముందు ఉంచుతున్నదని మేము భావిస్తున్నాము. నిజానికి ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలను రూపు మాపడానికి ప్రభుత్వాలు పెద్దగా చర్యలు చేపడుతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో కనపడట్లేదు. అంతేగాక ప్రభుత్వాలు ప్రజలలో భక్తి పేర విశ్వాసాలు పెంచడానికి పెడుతున్నంత దృష్టి ప్రజలలో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడంలో పెట్టట్లేదు అని మానవ హక్కుల వేదిక మరియు భారత నాస్తిక సమాజం భావిస్తున్నవి. అందువల్లనే ఆధునిక శాస్త్ర సాంకేతికత పెరుగుతున్న రోజుల్లో సకీనా బీ వంటి ఘటనలు ఇంకా మనకు కనపడుతున్నాయి. నిజానికి సకీనా బీ ఘటన మనకు మీడియా ద్వారా బయట ప్రపంచంకు తెలిసింది. కానీ నిత్యం వేలాది ఘటనలు ఈ రకంగా కొట్టడం కాకపోయినా దెయ్యాలు, భూతాలు, చేతబడులు, దేవుళ్ళ పేర మూడ విశ్వాసాలతో నిత్యం ప్రజలు చేసే కార్యకలాపాలు మనం అన్ని ప్రాంతాలలో చూస్తుంటాం. దీనికి ప్రభుత్వాల చర్యలు కూడా కారణం. ప్రజల్లో తార్కిక ఆలోచనలు, శాస్త్రీయా ఆలోచనలు జీవన విధానాలు పెంపొందించడానికి కృషి చెయ్యాల్సిన పాలకులే అధికారిక కార్యక్రమాలలో ఆహేతుక విధానాలు అవలంబిస్తూ ప్రజలకున్న మూఢ విశ్వాసాలు సరైనవేనని అనుకునే తీరుగా ప్రవర్తించడం అందరం ఖండించాల్సిన విషయంగా మేము భావిస్తున్నాం.
మా డిమాండ్స్:
- ఉద్దేశ్య పూర్వకంగా హత్యకు పాల్పడిన ఇస్మాయిల్ పై చట్టరీత్యా చర్యలు తీసుకుని శిక్షపడేలా చూడాలి.
- మౌలానా కుటుంబ సభ్యులకు 25 లక్షల పరిహారం ఇవ్వాలి.
- మూఢనమ్మకమే అయినప్పటికీ ఉద్దేశ్య పూర్వకంగా ఎప్పుడో జరిగిజ సంఘటనను సోషల్ మీడియాలో పెట్టీ తప్పుగా ప్రచారం చేసి సమాజాన్ని కవరపడేలా చేసిన ఇస్మాయిల్ తమ్ముడు నాగుల్ మీరాపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఇటువంటి తప్పుడు వార్తలు స్ప్రెడ్ కాకుండా కూడా చర్యలు తీసుకోవాలి.
- ముఖ్యంగా ప్రభుత్వం మూడ నమ్మకాలా నిరోధక చట్టం తీసుకు వచ్చి అమలు చేయాలని, అందుకు రానున్న కేబినెట్లో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మానవ హక్కుల వేదిక మరియు భారత నాస్తిక సమాజం డిమాండ్ చేస్తుంది
- ఈ మూఢనమ్మకాల చట్టం కేంద్రంలో కూడా తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం.
- ప్రభుత్వం మూడ నమ్మకాల నిర్మూలన కోసం ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో ఏర్పాటు చెయ్యాలి.
- ప్రజలకు శాస్త్రీయ జీవన విధానాన్ని అలవరుచుకునేలా అవగాహన కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.
కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక నాయకులు దిలీప్.వి మరియు భారత నాస్తిక సమాజం జాతీయ కార్యదర్శి జీడి సారయ్య పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
28-09-2026