పెద్ద కడుబూరు పోలీసులు చిన్న తుంబళం గ్రామంలో జరిగిన ఘర్షణ పూర్వపరాలను విచారించకుండా, మంత్రాలయం శాసనసభ్యులు బాల నాగిరెడ్డి ప్రమేయంతో బాధితులపైనే క్రిమినల్ కేసును నమోదు చేశారన్న ఆరోపణలు రావడాన్ని మానవ హక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తోంది.
బి. లేపాక్షి నాయుడు ఆదివారం (29 సెప్టెంబర్, 2024) సాయంత్రం ఆటో నడుపు కొంటూ గ్రామంలోకి వెళుతుండగా, ఆరుగురు తాగి చాకలి కులస్థులతో రోడ్డుపైనే గొడవ పడుతున్నారు. వారిని పక్కకు జరగమని హారన్ కొట్టడాన్ని జీర్ణించుకోలేని కమ్మరి బ్రహ్మయ్య, కమ్మరి వీరేష్, కె. సిద్ద రామప్ప, కె. రమేశప్ప, కె. అమరేష్, గంగాధర్ లు లేపాక్షి నాయుడి పైనే కట్టెలతో దాడికి దిగారు. అది తెలుసుకొన్న బాధితుని తండ్రి బి. తాయన్న, అక్క బి. కవితలు దాడిని అడ్డుకొనేందుకు ప్రయత్నం చేశారు. నిందితులతో పాటు, మరో ఏడుగురు మహిళలు కలసి ముగ్గురిని కట్టెలతో, కాళ్ళతో, చేతులతో విచక్షణారహితంగ కొట్టారని భాధిత కుటుంబం ప్రధాన ఆరోపణ.
బాధిత కుటుంబం అదేరోజు రాత్రి పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయగా, పోలీసు సలహా మేరకు తీవ్ర గాయాలపాలైన కవితను. ఆదోని ఏరియా ఆసుపత్రిలో అడ్మిట్ చేయడం జరిగింది. అప్పటికే దాడి చేసిన నిందితుల నుండి ఫిర్యాదును అందుకున్న పోలీసులు, ఇరు పక్షాలను విచారించకుండానే ఏకపక్షంగా బాధితుల పైనే క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు తెలుసుకొన్న బాధితులు నిర్ఘాంత పోయారు. దాంతో వారు తెలుగుదేశం పార్టీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మను ఆశ్రయించారు. ఆమె పెద్ద కడుబూర్ పోలీసులను ప్రశ్నించిన తరువాత కూడా బాధితురాలిని పూర్తిగా విచారించకుండానే, మూడు రోజుల తరువాత పోలీసులు కేవలం ఐదుగురి పేర్లు మాత్రం చెప్పమని, ఆమెతో కాగితంపై ఆమె పూర్తి సమ్మతి లేకుండానే సంతకం చేయించుకొని వెళ్లారు. ముందు జాగ్రత్తగా చర్యగా నిందితులలో ఒకరైన రమేష్ తలకు తీవ్రమైన గాయాలు కాకున్నా, గాయాలు అయినాయనే సాకుతో ఆసుపత్రిలో చేర్పించారు.
ఆసుపత్రి డ్యూటీ డాక్టర్ గతంలో ఆసుపత్రి పరిధిలోని ఆదోని 1 టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చేవారు. బాధితుల ఫిర్యాదును వారు నమోదు చేసి, సంబంధిత పోలీస్ స్టేషన్ కు రెఫెర్ చేసేవారు. ఇప్పుడు ఆ విధంగా కాకుండా, ఆసుపత్రి డ్యూటీ డాక్టర్ బాధితులు ఏ పోలీసు స్టేషన్ పరిధి కింద వస్తారో ఆ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడం జరుగుతోంది. దీనివల్ల బాధితులకు న్యాయం జరుగకపోగా, పోలీసులు నిందితులకు అనుకూలంగా కేసును నమోదు అయ్యే విధంగా చేస్తున్నారని అర్ధం అవుతోంది. జిల్లా పోలీసు అధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టి, బాధితుల ఫిర్యాదును సరైన విధంగా నమోదు అయ్యేట్టు చూడాలి.
దీనిని బట్టి బాధిత కుటుంబం పట్ల పోలీసులు చట్టవిరుద్దంగా నడుచుకొంటున్నారని అర్ధం అవుతోంది. మంత్రాలయం శాసనసభ్యులు బాల నాగిరెడ్డి తన మనుషులను కాపాడుకోవడం కోసమే, చట్ట ప్రకారం నడుచుకోవలసిన పోలీసులను అడ్డుకోవడం చేస్తున్నారని వారు ఆరోపణలు చేస్తున్నారు. బాధితుల నుండి స్పష్టంగా పోలీసులపై ఆరోపణలు రావడం శోచనీయమైన విషయం. బాధిత కుటుంబం న్యాయం కోసం గట్టిగా నిలబడినందుకే విషయం బయటకు తెలిసింది. లేకపోతే తెలిసేదే కాదు.
కావున రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పోలీసు యంత్రాగం ఇప్పటికైన స్పందించి, దాడి చేసిన నిందితులే బాధితులపై చేయని నేరాన్ని ఆపాదించి, వారిపై క్రిమినల్ కేసు పెట్టడం, దానికి పోలీసులు వంత పాడడం దుర్మార్గమైన విషయంగా మేం భావిస్తున్నాం. పోలీసులు నిందితులపై ఎటువంటి చర్య తీసుకోకపోగా, కాపాడేందుకు ప్రయత్నం చేస్తే, సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? ఇప్పటికైనా పూర్తి స్థాయి విచారణ జరిపి, నిందితులు అందరిపై చట్ట ప్రకారం చర్య తీసుకొని, బాధిత కుటుంబంపై నిందితులు పెట్టిన ఫిర్యాదు వాస్తవమా? కాదా? తేల్చి, వారు దాడి జరుపలేదని తేలితే, ఆ ఉద్దేశ్యపూర్వకంగా పెట్టిన కేసును ఎత్తి వేయాలని, బాధితులకు మళ్ళీ ఇటువంటి పరిస్థితి రాకుండా చేసి, పోలీసులు చట్టబద్ధంగా నడుచుకొనే విధంగా చూడాలని మేం డిమాండ్ చేస్తున్నాం.
యు. జి. శ్రీనివాసులు,
మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు.
ఖాదర్ బాషా,
కర్నూలు జిల్లా కార్యవర్గ సభ్యులు.
తస్లీమ్,
కర్నూల్ జిల్లా సభ్యులు.
ఆదోని,
05.10.2024.