దళితుల సంఘ బహిష్కరణకి పరిష్కారం శాంతి కమిటీనా?

పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో దళితులను సంఘ బహిష్కరణకు గురిచేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. దళితుల సంఘ బహిష్కరణకి పరిష్కారం శాంతి కమిటీలు ఏర్పాటు చేయడం కాదని వారు పేర్కొన్నారు. మల్లాం దళితుల సంఘ బహిష్కరణ ఘటన గురించి మానవ హక్కుల వేదిక ప్రతినిధులు మంగళవారం బాధితులను కలిసి నిజనిర్ధారణ చేపట్టారు.

మల్లా పెద్దవీధికి చెందిన ఎలిశెట్టి జిల్లబాబు ఇంటిలో అదే గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన విద్యుత్ కార్మికుడు పల్లపు సురేష్ బాబు ఈ నెల 16 బుధవారం విద్యుద్ఘాతంతో మరణించిన సంఘటన విదితమే. ఇందుకు సంబంధించి బాధిత కుటుంబానికి ఎలిశెట్టి జెల్లబాబు నష్టపరిహారం చెల్లించాలని గురువారం నాడు ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18,19 తేదీల్లో దళితులను సంఘ బహిష్కరణకు గురిచేశారు. దళితులకు నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు విక్రయించకుండా వ్యాపారులను కట్టడి చేశారు. ఆఖరికి రవాణా సదుపాయం లేకుండా ఇబ్బందుల పాలుచేశారు.

ఈ పరిస్థితుల్లో సంబంధిత అధికారులు ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తకుండా శాంతి కమిటీని ఏర్పాటుచేశారు. ఈ | సంఘటనలో శాంతి కమిటీని ఏర్పాటు చేయడం అవసరమే కావచ్చు కానీ అంతకంటే ముందుగా దళితుల.సంఘ బహిష్కరణకు పురికొల్పిన వారిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం మేరకు కేసు నమోదు చేయడం తప్పనిసరి అని మానవ హక్కుల వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనల్లో చట్టపరమైన పద్ధతిలో వ్యవహరించకపోవడం నిందితులను రక్షించడమేనని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా ఇటువంటి చర్యలు తీసుకోకపోతే ఇటువంటి సంఘటనలు పునరావృతం అయ్యే అవకాశం ఉందన్నారు. తక్షణమే అందుకు తగిన చర్యలు చేపట్టడంతో పాటు బాధితులకు నష్ట పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో కులవివక్ష కొనసాగుతోందని వారు తెలిపారు. ఈనాటికి స్థానిక సెలూన్లలో దళితులకు క్షవరం చేయకపోవడం ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. ఇటువంటి వివక్ష, అణిచివేతల పట్ల సంబంధిత అధికారులు వెంటనే దృష్టి పెట్టాలని కూడా వారు డిమాండ్ చేశారు.

ఈ నిజనిర్ధారణ బృందంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. రాజేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్, ప్రధాన కార్యదర్శి నామాడి శ్రీధర్, సామాజిక కార్యకర్త తోట రాంబాబు పాల్గొన్నారు.

22 ఏప్రిల్ 2025,
పిఠాపురం.

Related Posts

Scroll to Top