ఒక కానిస్టేబుల్ మీద దాడి చేశారనే ఆరోపణ మీద గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు ముగ్గురు యువకులని రోడ్డు మీద, అందరి ముందు విచాక్షణారహితంగా కొట్టడాన్ని మానవ హక్కుల వేదిక (HRF) తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ ఘటన గురించి పోలీసు శాఖ విచారణ చేసి, దీనికి బాధ్యులైన పోలీసు సిబ్బందిని గుర్తించి, వారి మీద బిఎన్ఎస్ఎస్, ఎస్ సి/ ఎస్ టి అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని, పోలీసులు చట్టపరంగా నడుచుకోవాలి కానీ తమకి నచ్చిన విధంగా కాదని పోలీసు సిబ్బందికి నేర్పాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తున్నది.
ఇద్దరు పోలీసు సిబ్బంది ముగ్గురు యువకులని రోడ్డు మీద అందరి ముందూ కొడుతున్నట్టున్న వీడియో ఒకటి మీ 26, 2026 నాడు బయటకి వచ్చింది. ఈ వీడియో ఏప్రిల్ 25, 2025 నాటిదని చెబుతున్నారు. ఏప్రిల్ 24 నాడు నవీన్, జాన్ విక్టర్, కరీముల్లా, రాకేశ్ అనే వ్యక్తులు పాత కక్షని దృష్టిలో పెట్టుకుని తన మీద దాడి చేశారని తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కన్నా చిరంజీవి ఏప్రిల్ 25 నాడు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా అదే రోజు తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఇఆర్ నమోదు చేశారు (క్రైమ్ సంఖ్య. 42/2025, తారీఖు. 25.04.2025). అయితే, ఎఫ్ఇఆర్ ఆధారంగా చట్టబద్ధంగా ముందుకు వెళ్ళవలసిన పోలీసులు చట్టాన్ని గాలికి వదిలేసి వాళ్ళకి గుణపాఠం నేర్పాలి అని చెబుతూ వారిని అమానవవీయ రీతిలో కొట్టారు. ఈ నలుగురులో, నవీన్ నేటికీ పరారీలో ఉండగా మిగతా ముగ్గురి మీద తమ ప్రతాపం చూపించారు.
పైన పేర్కొన్న నిందితులు నలుగురు పబ్లిక్ గా గంజాయి సేవిస్తున్నప్పుడు/అమ్ముతున్నప్పుడు కన్నా చిరంజీవి అడ్డుచెప్పడంతో దాడి చేసినట్టు తెలిసింది. వారి మీద అప్పటికే వివిధ తీవ్ర నేరాల కింద పలు కేసులు ఉన్నాయి. అయితే, వారి మీద ఉన్న కేసులు, ఆరోపణలు ఎంతటి తీవ్రమైనవి అయినా సరే వారిని అలా కొట్టడం న్యాయసమ్మతం ఏ మాత్రం కాదు. వారి మీద చర్యలు తీసుకోవడానికి న్యాయ, రాజ్యాంగ పద్ధతులు ఉన్నాయి. మమ్మలని కొట్టవద్దు అని వారు బ్రతిమలాడుతున్నా కూడా అందరి ముందు కొట్టడం అటువంటి పద్దతులలో ఒకటైతే ఏ మాత్రం కాదు. అలా చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం, అమానవీయం.
పోలీసుల మీద దాడి చేసినవారికి ఒక గుణపాఠం నేర్పడానికి వీరిని కొట్టినట్టు పోలీసులు తెలిపారని వార్తా కథనాలు ఉన్నాయి. ఇదే లోజిక్ ప్రకారం పోలీసు స్టేషన్ లో అవమానాలకి, హింసకి గురయ్యే ప్రజలు కూడా ఇలాగే జవాబివ్వాలా? ఇలా అడగటం అసమంజసంగా అనిపించవచ్చు కానీ ఇది ఆడగవలసిన ప్రశ్న. శాంతి భద్రతలను కాపాడటానికి ఉన్న పోలీసులు చట్టానికి అతీతులు ఏమి కాదు. ఇంకా చెప్పాలంటే, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన బాధ్యత వారి మీదే ఎక్కువ ఉంటుంది.
ఈ ఘటనకి బాధ్యులైన పోలీసు సిబ్బందిని గుర్తించి, వారి మీద బిఎన్ఎస్ఎస్, ఎస్ సి/ ఎస్ టి అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది.
జి. శివ నాగేశ్వర రావు (HRF ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు)
వై. రాజేష్ (HRF ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
జి. రోహిత్ (HRF ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి)
విజయవాడ,
27.05.2025.