అరుంధతి రాయ్ పై ఉపా కేసు, ఫాసిస్ట్ పాలనా విధానానికి పరాకాష్ట!

అరుంధతి రాయ్ మరియు షేక్ షౌకత్ హుస్సేన్ ( కాశ్మీర్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ న్యాయ శాస్త్ర ప్రొఫెసర్) ల మీద 14 ఏళ్ళ క్రితం నాటి ఆరోపణలను సాకుగా చూపిస్తూ నిన్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె సక్సేనా UAPA ( ఉపా) అనే అనాగరిక చట్ట ప్రయోగానికి అనుమతివ్వటం ప్రజాస్వామిక సమాజం తీవ్రంగా ఆక్షేపించదగ్గ విషయం. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గల, పరిపాలనలో, సమాజంలో ప్రజాస్వామ్య సంస్కృతి కోసం ఆరాటపడే గొప్ప మానవీయ రచయిత్రి అయిన అరుంధతి రాయ్ పైన ఉపా కేసు ప్రయోగంతో కేంద్రంలోని ప్రభుత్వం తన అంతిమ ఫాసిస్టు రూపానికి చేరుకుంటున్నది.

2010 లో డిల్లీ లో జరిగిన ఒక సదస్సులో వక్తలు చేసిన ఉపన్యాసాలు ప్రజలను రెచ్చగొట్టే విధంగానూ, వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించేవిగానూ ఉన్నాయిని ఒక కాశ్మీరీ పండిట్ చే ఆనాడు ఫిర్యాదు నమోదైంది. ఆ నాటి కేసును తిరగదోడి గత సంవత్సరం ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, ఇవాళ వాటినే ఊపా కేసు పరిధిలోకి తెచ్చారు. ఉపా ఎంత అనాగరిక చట్టమైనా దాని ఉద్దేశం కొంతమంది వ్యక్తులు లేదా సంస్థల వల్ల భవిష్యత్తులో హింస లేదా నేరాలు జరగకుండా నివారించటమే. నిజంగా ఈ ప్రముఖుల ఉపన్యాసాల వల్ల కాశ్మీరీ ప్రజలు రెచ్చి పోయి ఉంటే, వేర్పాటువాదం మరింత పెరిగిపోయి ఉంటే ఆ పర్యవసానాలు వారి ఉపన్యాసాలనంతరం కనిపించేవి. ఫలితంగా జరిగిన పరిణామాలకు వీరి ఉపన్యాసాలను లింక్ చేసి ఉంటే అదొక చట్టబద్ధ వ్యవహారమై ఉండును. నిజానికి, అటువంటి ఉపన్యాసాలు వారేవి ఇవ్వకపోయినా, ఇచ్చిన ఉపన్యాసాలతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోయినా వీరిపై ఆరోపణలు చేసిన వ్యక్తి దురుద్దేశంతో ఫిర్యాదు చేసినాడని ఆ కేసును అంతటితో మూసి వేయవచ్చు.

అరుంధతి రాయ్ లాంటి వ్యక్తులు కాశ్మీర్ ప్రజల సామాజిక, రాజకీయ, రాజ్యాంగ హక్కుల విశ్లేషణ తప్ప మతోన్మాదుల లాగా మాబ్ ని రెచ్చగొట్టే చవకబారు ఉద్రేకపూరిత ఉపన్యాసాలు ఇచ్చే బాపతు కాదు. ఆ విషయాలు తెలిసి కూడా నిత్యం ప్రజల మనోభావాలతో ఆడుకుంటూ, వారిలో భావోద్రేకాలను రెచ్చగొట్టి , చట్ట బాహ్య హింసకు కారణమైన చరిత్ర గల రాజకీయ పార్టీ ఇవాళ అధికార పీఠంపై కూర్చుని శాంతి కోసం తపిస్తున్నట్టు నిజమైన శాంతికాముకులైన ప్రజాస్వామ్యవాదులపై ఇటువంటి కేసులకు దిగుతున్నది.

ఫాసిస్ట్ స్వభావం గల అధికార రాజకీయ పార్టీ, వారి సోదర మరియు మాతృ సంస్థల బండారాన్ని బట్టబయలు చేస్తూ అరుంధతి రాయ్ మరియు అనేకమంది జాతీయస్థాయి ప్రజాస్వామిక వాదులు ప్రజలను చైతన్యం చేయటాన్ని సహించలేని ప్రభుత్వం రాజకీయంగా, సైద్దాంతికంగా వారిని ఎదుర్కోలేక ఇటువంటి అనైతిక, నిరంకుశ అణచివేతకు దిగుతున్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పదుల కొద్దీ జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు గల సమాజం మేలు కోరే ప్రజాస్వామిక వాదులనూ, రచయితలనూ, పేద ప్రజల న్యాయవాదులనూ, అంబేద్కర్ పోరాట వారసులనూ ఈ ఉపా అనే ‘తీవ్ర వాద కార్యకలాపాల నిరోధక’ చట్టం కింద కేసులు మోపి, జైళ్ళ పాలు చేశారు. అయినా ప్రజలు క్రమంగా పాలకుల ప్రజావ్యతిరేక, ఫాసిస్టు స్వభావాన్ని అర్థం చేసుకుంటున్నారు. తన ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలు మరింత చైతన్యం కాకుండా నిరోధించటానికే ఇవ్వాళ అరుంధతీ రాయ్ గారి పైన ఈ ఉపా కేసు.

ఫాసిజం యొక్క స్వభావసిద్ధమైన లక్షణం సమాజంలోని చైతన్యాన్నీ , వివేకాన్నీ చంపివేయటం. అందుకే వాళ్లు ప్రజలను చైతన్యం చేసే రచయితలనూ, మేధావులనూ, కమ్యూనిస్టులనూ, చైతన్యానికి వేదికలుగా ఉండగల విశ్వవిద్యాలయాలనూ లక్ష్యంగా చేసుకొని మొట్టమొదలు దాడి చేస్తారు. గత పదేళ్ళుగా దేశంలో అదే జరుగుతున్నది. అదే క్రమంగా ఉదృతమౌతున్నది.

ఆధునిక నాగరికతకూ, ప్రజాస్వామ్యానికీ, మానవాళి గౌరవప్రద జీవనానికీ గొడ్డలి పెట్టులాగా ఫాసిజం ఒక పరిపాలనా ధోరణిగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మరీ ముఖ్యంగా భారతదేశంలో జడలు విప్పుతున్నది. అందరం ఒక్కటై ప్రజాస్వామ్యాన్నీ, భావ ప్రకటనా స్వేచ్ఛనూ కాపాడుకుందాం.

అరుంధతి రాయ్, షేక్ షౌకత్ హుస్సేన్ లపై ఉపా ప్రయోగాన్ని తీవ్రంగా వ్యతిరేకిద్దాం. ఇప్పటికే ఉపా కేసులతో వేధించబడుతున్న రచయితలు, ప్రజాస్వామిక వాదులపై ఉపా కేసులను ఎత్తివేయాలి. ఉపా అనే ప్రత్యేక అనాగరిక చట్టాన్ని రద్దు చేయాలి.

మానవ హక్కుల వేదిక
తెలంగాణ
15 జూన్ 2024

Related Posts

Scroll to Top