ఎన్ఐఏ సోదాలతో హక్కుల కార్యకర్తలను భయపెట్టలేరు

ఆంధ్రప్రదేశ్ లో ఏడుగురు మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) బాధ్యుల ఇళ్ళపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ.) అక్టోబర్ 2, 2023 వేకువజామున చేసిన సోదాలు హక్కుల కార్యకర్తలను భయపెట్టి వారి పనికి అడ్డుపడాలనే కుత్సిత ఆలోచనతో చేపట్టిన చర్యలని మేము భావిస్తున్నాం. ఎన్.ఐ.ఏ. తలపెట్టిన హేయకరమైన ఈ చర్యలను మేము ఖండిస్తున్నాం. 

ఆదోనిలో హెచ్.ఆర్.ఎఫ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు యు.జి. శ్రీనివాసులు,  అమలాపురంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. రాజేష్, శ్రీకాకుళంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వి. జగన్నాధరావు, అనంతపురంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్. అబ్దుల్ రసూల్, ఎమ్మిగనూర్ లో రాష్ట్ర కార్యదర్శి యు.ఎం. దేవేంద్ర బాబు, విశాఖపట్నంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కె. సుధ, అనంతపురంలో హెచ్.ఆర్.ఎఫ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యులు ఎ. చంద్రశేఖర్ ఇళ్ళపై ఎన్.ఐ.ఏ. సిబ్బంది సోదాలు చేసి కొన్ని విలువైన వస్తువులు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.   

విశాఖపట్నం జిల్లాలోని (ప్రస్తుత ఏ. ఎస్. ఆర్. జిల్లా) ముంచింగ్ పుట్ పోలీసులు 23-11-2020 న నమోదు చేసిన ఒక ఎఫ్.ఐ.ఆర్.ని అడ్డుపెట్టుకుని ‘ఈ కేసులో దర్యాప్తుకు, నేర నిరూపణకు దోహదపడే పత్రాలు, వస్తువులు’ దొరుకుతాయనే తలంపుతో ఎన్. ఐ. ఏ. ఈ సోదాలు నిర్వహించింది. మా ఏడుగురు కార్యకర్తల ఇళ్లపై జరిగిన సోదాల్లో నేర నిరూపణకు ఉపయోగపడే ఎటువంటి వస్తువులు, పత్రాలు దొరకలేదు. సుమారు ఆరు గంటల పాటు చేసిన ఈ సోదాల ద్వారా ఎన్.ఐ.ఏ. సిబ్బంది సాధించింది ఏమిటంటే మా దగ్గర నుండి అయిదు మొబైల్ ఫోన్లు, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, సాహిత్యం స్వాధీనం చేసుకోవడం.  

మొబైలు ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలలోని సమాచారాన్ని కాపీ చేసుకోనివ్వకుండా వారి వద్ద నుండి స్వాధీన పర్చుకోవడం వల్ల వారి పనికి విఘాతం కలుగుతుంది. ఫోన్ నెంబర్లు కోల్పోయి మనుషులతో సంబంధాలు తెగిపోయి అనేక ఇబ్బందులకు గురవుతారు. కొత్తవి సమకూర్చునే వరకు వారు చాలా ఆగచాట్లకు గురికావాల్సి వస్తుంది. స్వాధీనం చేసుకున్న పరికరాలు, సాహిత్యం ఎప్పుడు తిరిగిస్తారని ఎన్.ఐ.ఏ. అధికార్లను అడిగితే ఆ పరికరాలలో నేరాన్ని రుజువు చేసే ఎటువంటి అంశాలు లేకపోతే వాటిని ఎన్.ఐ.ఏ. హైదరాబాదు కార్యాలయం నుండి పొందవచ్చని చెప్పారు. అది తేలడానికి జీవిత కాలం పడుతుంది. ఉన్నట్టుండి ఆ పరికరాలను కోల్పోవడం ఎవరికైనా పూడ్చలేని లోటు. ఆ క్రమంలో ఆ వ్యక్తులు కోల్పోయేది కేవలం తమ విలువైన వస్తువులనే కాదు, ఎంతో విలువైన జీవనాధార హక్కు, గోప్యత హక్కు, గౌరవప్రదంగా జీవించే హక్కును కూడా కోల్పోతారు. అంతిమంగా ఈ చర్యల వల్ల జరిగేది వారి రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనే. ఎలక్ట్రానిక్ డాటాని తారుమారు చేసి సాక్ష్యం చొప్పించే అవకాశం కూడా ఉండటం మరో ఆందోళనకర పరిణామం. అందుకే తక్షణం ఈ విషయంలో రాజ్యాంగ విలువలకు అనుగుణంగా సమగ్రమైన నిబంధనలను రూపొందించడం చాలా అవసరం. 

ఎన్.ఐ.ఏ. విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రజా సంఘాలకు చెందిన 53 మంది కార్యకర్తలు, తెలంగాణలో 9 మంది కార్యకర్తల ఇళ్లపై సోదాలు జరిపి, ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది. ఎన్.ఐ.ఏ. తన ప్రకటనలో హెచ్.ఆర్.ఎఫ్.ని ‘మావోయిస్టుల అనుబంధ సంస్థ’ గా అభివర్ణించింది. ఇంతకంటే పచ్చి అబద్ధం మరొకటి ఉండదు. మానవహక్కుల పట్ల హెచ్.ఆర్.ఎఫ్. సైద్ధాంతిక దృక్పధం, దాని కార్యాచరణ పట్ల కనీస  అవగాహన ఉన్న వారికి ఎవరికైనా ఇది ఎంత ఘోరమైన అసత్యమో అర్ధమవుతుంది. మానవహక్కుల కార్యాచరణనే నేరంగా పరిగణించదల్చుకుంటే అది అసలే ఆమోదనీయం కాదు. ఒక విశాల ప్రాతిపదిక గల స్వతంత్రమైన మానవహక్కుల ఉద్యమం అవసరమనీ, సాధ్యమనీ ప్రగాఢంగా నమ్ముతూ 1998 అక్టోబర్ 11 న మేము హెచ్.ఆర్.ఎఫ్. సంస్థని స్థాపించాం. హెచ్.ఆర్.ఎఫ్.కి ఈ నెల 25 ఏళ్లు నిండుతాయి. సమాజంలో మానవహక్కుల సంస్కృతిని పెంపొందించడానికి చేసే ప్రయత్నాలలో ఎవరెన్ని అవాంతరాలు కలిగించినా మేము మా పనిని మరింత దృఢ సంకల్పంతో కొనసాగిస్తాం.   

నిరసన గొంతులను నులమడానికి కేంద్ర పాలకులు ఎన్.ఐ.ఏ.ని పావుగా వాడుకుంటున్నారనే వదంతి సమాజంలో ప్రబలంగా ఉంది. అందులో నిజం లేకపోలేదు.  నిరాధార ఆరోపణలు, దర్యాప్తుల పేరిట వారు ప్రధానంగా చేయదలచింది హక్కుల కార్యకర్తలను భయపెట్టి, ఏకాకులను చేసి, వారిని అగౌరవపరచి, వారి నోళ్ళు మూయించడమే. ఇవన్నీ ప్రజల దృష్టిలో మానవహక్కుల పట్ల గౌరవ భావం తగ్గడానికి, దాని సాధికారతను దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు. రాజకీయ పాలనా యంత్రాంగం అవలంబించే అప్రజాస్వామిక విధానాలు, కార్యాచరణలను విమర్శించే వారిని వేధించడానికే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.

హక్కుల కార్యకర్తలంటే మన సమాజం మంచిచెడుల గురించి పట్టించుకుని,  స్పందించే గుణమున్న పౌరులనే విషయం పాలకులు కప్పిపుచ్చాలని ప్రయత్నించినా, మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. కోర్టులో చెల్లని అబద్ధపు ఆరోపణలపై ‘దర్యాప్తు’ జరిపే మిషతో కొన్ని వందల మంది ఎన్.ఐ.ఏ. సిబ్బందిని పెంచి పోషించి ప్రజా ధనాన్ని దుబారా చేయడాన్ని వారు ఏ విధంగా సమర్ధించుకుంటారు?   

ఎన్.ఐ.ఏ. చట్టాన్ని ఈ విధంగా దిగజార్చడాన్ని ఆపాలని, హక్కుల కార్యకర్తలపై వేధింపు చర్యలను తక్షణం నిలిపి వేయాలని హెచ్.ఆర్.ఎఫ్. డిమాండ్ చేస్తోంది.

ప్రజాస్వామ్యంలో ఉండకూడని రాజద్రోహం, ఊపా చట్టాలను వెంటనే రద్దు చేయాలి.

మానవ హక్కుల వేదిక
ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ
3 అక్టోబర్ 2023

Related Posts

Scroll to Top