తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామంలో గొలకోటి నాగలక్ష్మికి చెందిన పెంకుటింటిని అక్రమంగా కూల్చేసిన విషయమై ఈ రోజు ముగ్గురు సభ్యుల మానవ హక్కుల వేదిక బృందం నిజనిర్ధారణ చేపట్టింది. దంగేటి రాంబాబు వారి ఇంటికి ఎదురుగా ఒక కొత్త మూడంతస్తుల భవంతి నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుండి తమ ఇంటిని కూల్చివేయాలని ఒత్తిడి మొదలైందని గొలకోటి నాగలక్ష్మి దంపతులు వాపోయారు. ప్రస్తుతం కాకినాడలో తమ పిల్లల వద్ద ఉంటున్నామని స్వగ్రామానికి వచ్చినప్పుడల్లా ఈ ఇంట్లోనే ఉంటామని వారు చెప్పారు. తమ పెంకుటిల్లు పాతదై చూడటానికి బాగాలేదని, అందుకే దాన్ని కూల్చేయనైనా కూల్చేయాలని లేదా ఆ స్థలాన్ని అమ్మేయాలని ఆయన తన అనుచరులతో పలుమార్లు ఫోను చేయించి బెదిరించే వాడని చెప్పారు. చివరికి 29-03-2023 వ తారీఖున దంగేటి రాంబాబు గుమస్తా అయిన మాదవరపు వెంకటేష్ ఫోన్ చేసి తమ పెంకుంటిని తక్షణమే కూల్చేయాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడని తెలిపారు. ఆ తర్వాత రోజున ప్రొక్లైనర్ తీసుకువచ్చి తమ ఇంటిని నిజంగానే కూల్చివేసారని బాధితులు వాపోయారు. ఈ విషయమై ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామని చెప్పారు.
బాధిత కుటుంబీకుల ఇంటిని అక్రమంగా కూల్చివేయించిన దంగేటి రాంబాబు అతని అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది. గతంలో కూడా పంచాయతీ సెక్రటరీ రొడ్డ భవాని ఆత్మహత్య కేసులో రాంబాబు నిందితుడు. అయినా తనకున్న రాజకీయ పలుకుబడితో ఆ కేసు నుండి తప్పించుకున్నాడు. డబ్బు, రాజకీయ అధికారం ఉందని అతను చట్టానికి అతీతుడన్నట్లుగా ప్రవర్తిస్తుంటే పోలీసులు నిష్క్రియాపరంగా చూస్తూ ఊరుకోవడాన్ని మానవ హక్కుల వేదిక ఖండిస్తోంది.
మానవ హక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్
30 మార్చి 2023