జి. రాగం పేట ఫాక్టరీ ఘటనకు బాధ్యులైన ప్రభుత్వ అధికారులను కూడా ముద్దాయిలుగా చేర్చాలి

పెద్దాపురం మండలం జి. రాగంపేట గ్రామంలోని అంబటి సుబ్బన్న అండ్ కో ఆయిల్ ఫాక్టరీ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు చనిపోయిన ఘటనకు సంబంధించిన విచారణ నివేదికను బహిర్గతం చేయాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై ఐదుగురు సభ్యులతో కూడిన నిజనిర్ధారణ బృందం ఈ రోజు పులిమేరు గ్రామానికి చెందిన బాధిత కుటుంబీకులతో మాట్లాడింది. కనీసం ప్రమాదం జరిగిందన్న విషయం కూడా ఫాక్టరీ యాజమాన్యం తమకు తెలియజేయలేదని, సహ కార్మికుల ద్వారానే తమకు విషయం తెలిసిందని వాపోయారు. ఆ రోజు ఫాక్టరీలో ఏమి జరిగిందన్న విషయమై తమకు ఇంతవరకూ స్పష్టత లేదన్నారు. ప్యాకింగ్ విభాగానికి చెందిన ఇద్దరు కార్మికులను టాంక్ లు శుభ్రం చేయడానికి ఎందుకు దింపారు? ఆయిల్ ఉన్న టాంకులలోకి దాంతో సంబంధం లేని కార్మికులను ఎందుకు దింపారు? మొదట దిగిన వాళ్ళు రానప్పుడు, మిగిలిన వాళ్ళను ఎందుకు దింపారు? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు.

జిల్లాలో గతంలో జరిగిన అనేక పారిశ్రామిక దుర్ఘటనలు గమనిస్తే, దేనిలోనూ నిందితులకు శిక్షలు పడలేదు. పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం అయిపోయినట్లుగా పోలీసు, రెవెన్యూ, న్యాయ వ్యవస్థలు వ్యవహరిస్తున్నాయని, అందువల్లనే ఇటువంటి ప్రమాదాలు పదే పదే జరుగుతున్నాయని బృందం అభిప్రాయపడింది. సరైన అనుమతులు లేకుండా ఫాక్టరీ నిర్వహించడానికి యాజమాన్యానికి సహకరించిన ఫాక్టరీ ఇన్స్ పెక్టర్, రెవెన్యూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, విద్యుత్ అధికారులను; తనిఖీలు సక్రమంగా నిర్వహించని అధికారులను కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చాలని, విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని, నివేదికలను పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉంచాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో వేదిక జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ ఇక్బాల్, కార్యవర్గ సభ్యులు కె పుష్పవల్లి, మట్టా నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మానవ హక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్
12 ఫిబ్రవరి 2023

Related Posts

Scroll to Top