ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నందుకు జరిమానా విధించడమే కాకుండా, సామాజిక బహిష్కరణ చేయడం హేయమైన చర్య అని, నాగరిక సమాజం సిగ్గుపడే ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు చేపట్టాలని రాజోలు నియోజకవర్గ పరిరక్షణ చైతన్య సమితి, మానవ హక్కుల వేదిక, బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నాయి.
మలికిపురం మండలం పడమటిపాలెంలో సామాజిక వెలివేతకు గురైన ప్రేమ జంట నుండి శుక్రవారం విషయ సేకరణ జరిపాం. వివరాల్లోకి వెళ్తే “గూడపల్లి-పల్లిపాలెంకు చెందిన మోకా దుర్గాప్రసాద్, నేను ఒకే సామాజిక వర్గం కాకపోయినప్పటికీ గత ఐదు సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నాం. మా వివాహానికి మా ఇద్దరి తల్లిదండ్రుల ఆమోదం ఉన్నప్పటికీ నా భర్త గ్రామంలోని సంఘం పెద్దల అంగీకారం లేకపోవడంతో మేమిద్దరం మార్చి 18, 2023 న అప్పనపల్లి వెంకటేశ్వరస్వామి గుడిలో వివాహం చేసుకున్నాం. సంఘ పెద్దల మాటలు కాదని వివాహం చేసుకోవడం వారికి కోపం తెప్పించింది. మా అత్త మామలకు 15 వేల రూపాయలు జరిమానా విధించి కట్టించుకున్నారు.
అంతే కాదు, మా ఇద్దరిని ఇంటికి రానివ్వకూడదని, మమ్మల్ని ఇంట్లోకి తీసుకొస్తే వారిని కూడా బహిష్కరిస్తామని మా మామ సత్యనారాయణను హెచ్చరించారు. మాతో వారికి ఎటువంటి సంబంధాలు ఉండకూడదని, మేము ఈ గ్రామంలో ఉండటానికి వీల్లేదని చెప్పారు. సంఘ పెద్దల హెచ్చరికల వల్ల నా భర్త, నేను పడమటిపాలెంలో ఉంటున్నాము” అని మోకా సుజాత చెప్పింది. “మాల దాన్ని ఉంచుకోవాలి గాని, పెళ్లి చేసుకోవడం ఏంటని ఒక సంఘ పెద్ద మాట్లాడడం నా మనస్సుకు చాలా కష్టం కలిగించింది” అని సుజాత కన్నీటి పర్యంతమైంది.
మా ఇద్దరి సాంఘిక బహిష్కరణపై 8.5.2023 న మలికిపురం పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశామని, అలాగే 10.05.2023 న జిల్లా ఎస్.పి గారికి కూడా ఫిర్యాదు చేశామని, ఇప్పటివరకు ఎటువంటి న్యాయం జరగలేదని ఆమె తెలిపింది.
కులాంతర వివాహం చేసుకున్న మోకా సుజాత, మోకా దుర్గాప్రసాద్ లను సాంఘిక బహిష్కరణ చేసిన సంఘ పెద్దలపై ఎస్.సి, ఎస్.టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. క్రింది స్థాయి అధికారుల వద్ద న్యాయం జరగదని భావించినప్పుడు పై అధికారుల వద్దకు వెళ్లే హక్కు బాధితులకు ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్లినా మరలా నా దగ్గరికి రావాలనే మాటలు మాట్లాడడం అధికారులకు తగదు.
ఈ నిజ నిర్ధారణలో గ్రామ పెద్దలు దొండపాటి అర్జునరావు, తాడి శివాజీ, రాజోలు నియోజకవర్గ పరిరక్షణ చైతన్య సమితి తరపున గెడ్డం బాలరాజ్, మందా సత్యనారాయణ, నల్లి ప్రసాద్, మానవ హక్కుల వేదిక తరపున ముత్యాల శ్రీనివాసరావు, చెవ్వకుల వెంకటేశ్వరరావు, బహుజన సమాజ్ పార్టీ తరఫున చింత సత్య పాల్గొన్నారు.
మానవ హక్కుల వేదిక, ఆంధ్రప్రదేశ్
రాజోలు నియోజకవర్గ పరిరక్షణ చైతన్య సమితి
బహుజన సమాజ్ పార్టీ
12 మే 2023