గృహనిర్బంధాలు ఆపండి, ప్రజల నివాస హక్కులను గౌరవించండి

ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నగరంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదిక ప్రజంటేషన్ విడుదల చేస్తున్న నేపథ్యంలో మా సంస్థ నగర కమిటి ఉపాధ్యక్షుడు, మూసీ మరియు బస్తీ ప్రజల హక్కుల కోసం పనిచేస్తున్న సయ్యద్ బిలాల్ పై గృహనిర్భందం విధించటాన్ని మా సంస్థ తీవ్రంగా ఖండిస్తున్నది.

ఈ రోజు విడుదుల చేయబోయే నివేదికను పౌరలందరికీ అందుబాటులో ఉంచాలని, అసలు ఈ మూసీ ప్రొజెక్టు ఆవశ్యకతపై నగర ప్రజల అభిప్రాయం తీసుకోవాలని మాతో పాటు, ఇతర అనేక సామాజిక సంస్థలు, కార్యకర్తలు, మేధావులు, ప్రభుత్వాన్ని ఈ ప్రాజెక్టు ప్రతిపాదన దశ నుండే అడుగుతున్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ నిర్మాణం పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిరాశ్రయులను చేయవద్దని, ఆ ప్రాజెక్ట్ ను విరమించుకోమని ప్రముఖ సామజిక కార్యకర్త మేధా పాట్కర్ గారు ముఖ్య మంత్రికి లేఖ కూడా రాసింది.

మానవ హక్కుల వేదికకు గానీ, ఇతర సంస్థలకు గానీ ప్రభుత్వం మూసీనదిని శుభ్రం చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. తప్పకుండా చేయాలని కూడా కోరుతున్నాం. నిబంధనల మేరకు నిర్మించుకున్న ఇళ్ళ నుండి ప్రజలను ఖాళీ చేయించటం, మూసీ ఒడ్డుపై ఎంతో కాలంగా నివసిస్తున్న ప్రజల ఆవాసాలను పునరావాసం కల్పించకుండా తొలగించడాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాము.

ప్రజాస్వామ్యబద్ధంగా భిన్నాభిప్రాయం తెలపడాన్ని కూడా ప్రభుత్వం సహించకపోతే అది నిరంకుశత్వం అనక తప్పదు.

మా కార్యకర్త సయ్యద్ బిలాల్ మరియు ఇతర సామాజిక కార్యకర్తలపై గృహ నిర్బంధం లాంటి విధానాలకు పాల్పడకుండా, ప్రజల, సామాజిక కార్యకర్తల, మేధావుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ, సామాన్య ప్రజల నివాస హక్కులను గౌరవిస్తూ మూసీ నదిని శుభ్రం చేసే ప్రాజెక్ట్ ను చేపట్టాలని, గాంధీ సరోవర్ ను ఇదివరకే ఉన్న బాపు ఘాట్ ప్రాంగణంకు పరిమితమై మాత్రమే నిర్మించాలని మా సంస్థ డిమాండ్ చేస్తున్నది.

Dr. తిరుపతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
S. జీవన్ కుమార్, ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు
M. సురేష్ బాబు, హైదరాబాద్ యూనిట్ – అధ్యక్షులు
సంజీవ్, హైదరాబాద్ యూనిట్ ప్రధాన కార్యదర్శి

హైదరాబాద్,
13-3-2026.

Related Posts

Scroll to Top