Date: 15-04-2026
గౌరవనీయ అధ్యక్షులు,
శ్రీ భట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి & ఆర్థిక, ప్రణాళిక మరియు ఇంధన శాఖ మంత్రి.
చైర్మన్, మూసీ ప్రాజెక్ట్ పై అభిప్రాయాల సేకరణ మంత్రి వర్గ ఉపసంఘం.
గౌరవ సభ్యులు,
శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఐటీ, పరిశ్రమలు & వాణిజ్య మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి.
గౌరవ సభ్యులు,
శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, రవాణా మరియు బి.సి. సంక్షేమ శాఖ మంత్రి. తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్.
విషయం: ప్రభుత్వం తలపెట్టిన మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టుపై ప్రజల తరపున మా సంస్థ అభిప్రాయాలు – అభ్యంతరాలు:
మూడు దశాబ్దాలుగా మానవ హక్కుల వేదిక (Human Rights Forum), రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల హక్కుల ఉల్లంఘన, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల చట్టబద్ధ పాలన, ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షల అమలు విషయంపై కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థకు ఏ రాజకీయ పార్టీతో గాని, సంస్థలతో గాని సంబంధం లేదు. స్వంత నిధులతో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న స్వతంత్ర హక్కుల సంస్థ.
తెలంగాణ రాష్ట్రంలో పాలనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైదరాబాద్ నగరం గుండా ప్రవహిస్తున్న మూసీ నదిని సుందరీకరిస్తామని, కాలుష్యాన్ని శుభ్రపరచి, నదిని పునరుద్ధరణ చేస్తామని రకరకాలుగా ప్రకటనలు చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు పోతుంది. హడావిడిగా సర్వే చేసి నగరం మధ్యలో చాదర్ ఘాట్ దగ్గర మూసీ ఒడ్డుపై నివసిస్తున్న 340 పేద కుటుంబాలను తొలగించి, పునరావాసం పేరుతో కొంత ఊరట కలిగించింది. పునరావాసం సంపూర్ణంగా, సంతృప్తికరంగా ప్రభుత్వం జరిపిందా అన్న అంశాలను ఇక్కడ మేము చర్చించడం లేదు.
ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం నియమించిన ముగ్గురు మంత్రుల కమిటీ ముందు మా సంస్థ ఈ కింది అభ్యంతరాలను, అభిప్రాయాలను ఉంచుతుంది:
- ప్రభుత్వం నదిలోని కాలుష్యాన్ని సమూలంగా శుద్ధి చేసి, నదిని పునరుద్ధరించి, నది నీటిని కింది ప్రాంతంలోని గ్రామస్థులకు వ్యవసాయం, గృహ అవసరాలకు వాడే రీతిలో అందించే విషయంలో చేపట్టే కార్యక్రమానికి మా సంస్థ ప్రభుత్వ సంకల్పాన్ని సంపూర్ణంగా సమర్థిస్తుంది, పూర్తి మద్దతు ఇస్తుంది.
- ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో చేపట్టే అన్ని చర్యలు, ప్రాజెక్టు రూపకల్పనను నదితో సంబంధం ఉన్న ప్రజలతో సంప్రదించి తయారు చేయాలి. కానీ ఇంతవరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళిక, కార్యాచరణ, ప్రజలతో ఇంతవరకు చర్చించడం జరగలేదు.
- ప్రస్తుతం ప్రభుత్వం తలపెట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ నమూనా కేవలం వాణిజ్య పరమైనది. నదిని సుందరీకరించి అంతర్జాతీయ స్థాయి పర్యాటక, ఆర్థిక కేంద్రంగా తయారు చేయాలని ప్రభుత్వం తలుస్తుంది. నది ఒడ్డున వాకింగ్ ట్రాక్‌లు, రెండు పక్కల రోడ్లు మరియు ఆధునిక వంతెనలు నిర్మించబడుతాయని ప్రభుత్వం చెబుతుంది. ఇటువంటి ప్రాజెక్టు నిర్మాణం పట్ల మా సంస్థ పూర్తి వ్యతిరేకతతో ఉంది.
- ప్రస్తుతం తలపెట్టిన ఫేజ్-1A, ఫేజ్-1B ల నిర్మాణం కోసమే దాదాపు 1200 పక్కా గృహాల్లో ఉండే కుటుంబాలు నిర్వాసితులవుతారని, దాదాపు 1500 కుటుంబాలు ఇతర నష్టదాయక ప్రభావానికి గురవుతాయని ప్రభుత్వ నివేదికల్లోనే వివరించారు. ఇట్లా గుర్తించిన గృహ సముదాయాలన్నీ చట్టప్రకారంగా అన్ని ప్రభుత్వ శాఖల అనుమతులతోనే నిర్మించబడినవని తెలుస్తుంది. ఇటువంటి విధ్వంసకర ప్రభుత్వ చర్యను మా సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
- ఈ రెండు ఫేస్‌లలో కట్టడాలను తీసివేయకుండా ఉండటానికి ప్రత్యామ్నాయంగా మేము ఒక సూచన చేస్తున్నాం. ఇప్పుడు బాపూఘాట్, మహాత్మా గాంధీ స్మారక కేంద్రం దాదాపు 60 ఎకరాల్లో విస్తరించి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాంతాన్నే అన్ని హంగులతో, నిర్మాణాలతో సుందరీకరించే కార్యక్రమం చేపట్టవచ్చు. దీనివల్ల ఏ ఒక్క కుటుంబాన్ని కూడా నిర్వాసితులను చేసే అవసరం ఉండదు.
- మా సంస్థకు ఉన్న పరిమిత జ్ఞానం ప్రకారం ప్రపంచంలో జరిగిన నదుల పునరుద్ధరణ కార్యక్రమాలు, నదిలోని నీటిని శుభ్రపరచడం, నదిలోకి వచ్చే కాలుష్యాన్ని నివారించడం, నది ఇరుపక్కన ఉండే ప్రజలను ఇందులో భాగస్వాములు చేసే ప్రక్రియల ద్వారా జరిగింది. ఇక్కడ అటువంటి ప్రక్రియలు జరపడానికి ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం ఇంతవరకు చేయలేదు.
- నిజానికి నది ప్రక్షాళన నది ఒడ్డుపైన, లేక దగ్గరలో నివాసం ఉండే ప్రజాసమూహాలకు సంబంధం లేదు. నదిని కాలుష్యం చేస్తున్నవారు ఆ ప్రజలు కాదు. మూసీ నదిని కాలుష్యం చేస్తున్నది పఠాన్ చెరువు, జీడిమెట్ల, పాశమైలారం, నాచారం, సనత్ నగర్ ప్రాంతాల్లోని పరిశ్రమలలో నుండి వెలువడే వ్యర్థాలు. ముఖ్యంగా ఔషధ పరిశ్రమల నుండి వెలువడే రకరకాల విషపదార్థాలతో కూడిన శుద్ధి చేయబడని కాలుష్య జలాలు మూసీలో కలవడం వల్ల నది కాలుష్యం అవుతుందన్న సత్యం అందరికీ తెలిసిందే. ఈ కాలుష్యాన్ని అరికట్టే ప్రణాళిక, కార్యాచరణ ఇంతవరకు ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. అసలు ఈ విషయంలో నిపుణులతో, శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరపలేదని ‘ప్రజల కోసం శాస్త్రవేత్తలు’ అనే సంస్థ ప్రకటించింది.
- జంట నగరాల్లో ఒక అంచనా ప్రకారం రోజుకు 1400 మిలియన్ లీటర్ల మురుగునీరు డ్రైనేజీ కాలువల ద్వారా మూసీ నదిలో కలుస్తుంది. మురుగు శుద్ధి కేంద్రాలలో శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నామని అధికారులు అంటున్నారు. ఇప్పుడున్న మురుగు శుద్ధి కేంద్రాలు సరిగా పని చేయడం లేదని పత్రికలు రాస్తున్నాయి.
- ముందుగా ప్రభుత్వం మురుగు నీరు శుద్ధి కోసం ప్రణాళిక తయారు చేసి వివరాలు ప్రజల ముందుంచాలి కదా! ఆ పని ప్రభుత్వం ముందు చేయాలి.
- పర్యావరణ ప్రభావ అంచనా (Environmental Impact Assessment – EIA) ఇంతవరకు చేపట్టలేదు. దానికి సంబంధించిన నిపుణుల కమిటీ నివేదిక, పర్యావరణ అనుమతుల నిమిత్తం సమర్పించాలి. దాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
- అసలు ఈ ప్రాజెక్టు గురించి నదికి ఇరువైపున ఉండే, ప్రభావితమయ్యే ప్రజలతో సంప్రదించలేదు. ప్రభుత్వం ప్రకటించిన బాపు ఘాట్ నుండి కింది భాగాన ఉన్న గౌరెల్లి (55 కి.మీ.) వరకు మా సంస్థ సభ్యులు పర్యటించి గ్రామస్తులతో కలిసి మాట్లాడారు. ఇంతవరకు ఏ అధికారులు గాని, రాజకీయ పార్టీల ప్రతినిధులు గాని గ్రామాలకు వచ్చి సమావేశాలు నిర్వహించి ఈ ప్రాజెక్టు గురించి చర్చించలేదని అన్నారు. నదిని శుభ్రపరచడం చాలా సంతోషకరమైన విషయం. కానీ అక్కడ నెలకొని ఉన్న నిజాం కాలం నాటి నిర్మించిన కత్వా సాగునీటి వ్యవస్థను బాగు చేయవలసిన అంశాలు చాలానే ఉన్నాయని, అందువల్ల మంత్రుల కమిటీ తమ గ్రామాలను సందర్శించాలని వారు కోరుతున్నారు.
మా సంస్థ డిమాండ్లు:
- G.O. MS. No. 921, 816 లను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలి.
- ప్రజల అభ్యంతరాలు తీసుకునే సమయాన్ని కనీసం 6 నెలలకు పొడిగించాలి.
- HMDA మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం అధికార గెజిట్‌లో ప్రచురించిన ప్రకటనను రద్దు చేయాలి.
- గాంధీ సరోవర్ ప్రాజెక్టును రద్దు చేసి, ప్రస్తుతం 68 ఎకరాల స్థలంలో ఉన్న బాపూఘాట్ (గాంధీ స్మారక స్థలం) ను అందంగా అభివృద్ధి చేయాలి.
- ప్రభుత్వం తలపెట్టిన గాంధీ సరోవర్ కోసం మధుపార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్లు, హైదర్ షాకోట్ ప్రాంతంలో ఉన్న 22 కాలనీలు, ఆరు పెద్ద విల్లాల సముదాయాలలో గృహాలు తొలగించవలసి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 12,000 వరకు గృహాలు ఉంటాయి. ఇవన్నీ చట్ట ప్రకారం అన్ని అనుమతులు తీసుకొని నిర్మించుకున్న గృహాలే. వీటిని తొలగించడం తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన. అందువలననే ఈ చర్యను ప్రభుత్వం మానుకోవాలని మా సంస్థ దృఢంగా అభిప్రాయపడుతుంది.
- గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం 2017లో విడుదల చేసిన భూసేకరణ చట్టాన్ని రద్దు చేసి, 2013లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన “భూసేకరణ, న్యాయమైన పునరావాస చట్టం” ప్రకారం పునరావాస ప్రక్రియలను అమలు చేయాలి.
- తెలంగాణ ప్రభుత్వం తాను ప్రకటించిన పద్ధతిలో మూసీ ప్రాజెక్టుపై ముందుకు వెళితే, Article 21 (జీవించే హక్కు), Article 300A (పౌరుల నివాస భద్రతకు సంబంధించిన హక్కులు)లను ఉల్లంఘించినట్టే.
- ప్రజల హక్కులను ఉల్లంఘించి, వారి జీవితాలను అతలాకుతలం చేసే ఈ తరహా విధ్వంసకర మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టును రద్దు చేసి, మూసీ నదిలో కాలుష్యాన్ని అరికట్టి, నదిని శుభ్రం చేసే కార్యక్రమంపై మాత్రమే ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్లాలని మా సంస్థ దృఢంగా అభిప్రాయపడుతుంది. మా సంస్థ ఈ ప్రాజెక్ట్ గురించి వ్యక్తపరచిన అభిప్రాయాల నేపథ్యంలో మూసీ ప్రాజెక్టును పునఃసమీక్షించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతుంది.
గౌరవాలతో,
వి. వసంత లక్ష్మి, ఎస్. జీవన్ కుమార్,
ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు.
Dr. S. తిరుపతయ్య,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
వి. బాలరాజు,
రాష్ట్ర ఉపాధ్యక్షులు,
ఎం. సురేశ్ బాబు,
నగర కమిటీ అధ్యక్షుడు.