జైళ్లలో ఉన్న మావోయిస్టు సానుభూతిపరుల, కార్యకర్తల కేసులను సమీక్షించి, వారిని విడుదల చేయాలి

Dt. 24-08.2026

గౌరవనీయులు శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు
ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రం

గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి,
(శ్రీ. వి. శేషాద్రి, IAS, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి గారి ద్వారా)

విషయం: తెలంగాణ జైళ్లలో దీర్ఘకాలంగా నిర్బంధంలో ఉన్న మావోయిస్టు సానుభూతిపరులు, కార్యకర్తల కేసులను మానవతా దృక్పథంతో పునఃసమీక్షించి, వారిని విడుదల చేయవలసిందిగా విజ్ఞప్తి — గురించి.

తెలంగాణ రాష్ట్రంలోని జైళ్లలో మావోయిస్టు ఉద్యమంతో సంబంధం ఉoదని లేదా ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చారనే ఆరోపణలతో దీర్ఘకాలంగా నిర్బంధంలో ఉన్న కొంతమంది వ్యక్తులకు సంబంధించిన ఒక మానవతా సమస్యను మానవ హక్కుల వేదిక మీ ప్రభుత్వం దృష్టికి తెస్తుంది . ఈ వ్యక్తుల పై మోపిన కేసులను మానవతా దృక్పథంతో పరిశీలించి, సానుకూలమైన, సహానుభూతితో కూడిన వైఖరిని అవలంబించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము.

గౌరవనీయ సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా 314 మంది జీవిత ఖైదీలను రెండు విడుతల్లో,విడుదల చేసినందుకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. అదేవిధంగా జైలు అదాలత్‌ల ద్వారా 460 మంది విచారణ ఖైదీలను కూడా విడుదల చేసినట్లు తెలిసింది. ఖైదీల పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని, న్యాయం మరియు మానవతా విలువలను కాపాడేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు హర్షనీయం.

ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ప్రత్యేక పరిస్థితి ప్రభుత్వ దృష్టికి తెస్తున్నాం

గత ఏడాది కాలంలో చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమంతో సంబంధం ఉన్న సుమారు 2,500 మంది, అందులో దళ సభ్యులు మరియు నాయకులు అజ్ఞాత జీవితం నుంచి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలోకి తిరిగి వచ్చారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి లొంగుబాట్లను స్వీకరించి, వారిని తిరిగి సామాజిక జీవితంలోకి తీసుకురావడానికి, పునరావాసం కల్పించడానికి చర్యలు చేపడుతున్నాయి. వారిపై ఉన్న క్రిమినల్ కేసులను కూడా ఆయా ప్రభుత్వాలు సమీక్షస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే తెలంగాణలో మావోయిస్టు పార్టీకి మద్దతుదారులు లేదా సానుభూతిపరులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమారు 200 మంది ఇప్పటికీ జైళ్లలో దీర్ఘకాలంగా నిర్బంధంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో చాలామంది వాస్తవానికి మావోయిస్టు పార్టీ సభ్యులు కాకపోవచ్చు. కొందరు మావోయిస్టు ఉద్యమంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఆహారం, నీరు, ఆశ్రయం వంటి ప్రాథమిక సహాయం అందించారనే ఆరోపణల తో జైళ్లలో ఉన్నారు.

వీరిలో గణనీయమైన సంఖ్యలో గిరిజనులు, ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారు ఉన్నట్లు మాకు సమాచారం ఉంది. న్యాయవాదులను నియమించుకోవడానికి, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి లేదా ష్యూరిటీలను సమకూర్చుకోవడానికి అవసరమైన ఆర్థిక, సామాజిక సహకారం వీరికి అందుబాటులో లేదు. వారి పరిస్థితులను ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించాల్సిన అవసరం ఉంది.

అటువంటి ఖైదీలలో కొందరి ఆచూకీ కూడా వారి కుటుంబ సభ్యులకు తెలియని పరిస్థితులు ఉన్నట్లు మాకు తెలిసింది. ఇది వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన, అనిశ్చితిని కలిగిస్తోంది. ఇటువంటి వ్యక్తులు నిరంతరం జైలులో ఉండటం వల్ల, ఇప్పటికే సామాజికంగా, ఆర్థికంగా అట్టడుగున ఉన్న వారి కుటుంబాలపై మరింత తీవ్రమైన భారం పడుతోంది.

అజ్ఞాత జీవితాన్ని విడిచిపెట్టి లొంగిపోయిన మావోయిస్టు సభ్యుల పునరావాసం, సామాజిక పునరేకీకరణ కోసం ప్రభుత్వం సానుకూలమైన, కొంత ఉదారమైన వైఖరిని ప్రదర్శిస్తోంది. అదే విధమైన మానవతా దృక్పథాన్ని, వ్యక్తిగత కేసులను చట్టపరంగా పరిశీలించిన అనంతరం, ప్రస్తుతం జైళ్లలో ఉన్న మావోయిస్టు సానుభూతిపరులు లేదా మద్దతుదారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపట్ల కూడా ప్రభుత్వం అవలంబించి, వారిని విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

ఈ నేపథ్యంలో తెలంగాణ జైళ్లలో దీర్ఘకాలంగా నిర్బంధంలో ఉన్న ఇటువంటి వ్యక్తుల కేసులన్నింటినీ సమగ్రంగా పునఃసమీక్షించేందుకు సంబంధిత అధికారులను ఆదేశించాలనిమానవ హక్కుల వేదిక ముఖ్యమంత్రి గారిని కోరుతోంది.

చట్టపరంగా సాధ్యమైన చోట్ల బెయిల్‌పై విడుదల, కేసుల ఉపసంహరణ లేదా తగిన పునఃపరిశీలన, శిక్షా ఉపశమనం (రెమిషన్) లేదా చట్టం మరియు అమలులో ఉన్న ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఇతర తగిన ఉపశమన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. తద్వారా వారు తమ కుటుంబాల వద్దకు తిరిగి వెళ్లి, ప్రశాంతమైన జీవితం గడపడానికి అవకాశం కలుగుతుంది.

ఇటువంటి చర్యలు బాధిత ఖైదీలు, వారి కుటుంబాల బాధలను తగ్గించడమే కాకుండా, మానవ హక్కులు, సామాజిక న్యాయం, పునరావాసం, సామాజిక సమన్వయం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను కూడా చాటుతాయని మేము విశ్వసిస్తున్నాము.

అందువల్ల, ఈ అంశాన్ని సానుభూతితో పరిశీలించి, తగిన చర్యలు తీసుకొని, ఈ వ్యక్తులకు మరియు వారి కుటుంబాలకు మానవతా హస్తాన్ని అందించాలని హ్యూమన్ రైట్స్ ఫోరం గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తోంది.

Dr. ఎస్. తిరుపతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
వి. వసంత లక్ష్మి, ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు
ఎస్. జీవన్ కుమార్, ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు
సంజీవ్, ప్రధాన కార్య దర్శి, నగర కమిటీ

Related Posts

Scroll to Top