M/s SAFOne India SPKompact Private Limited కంపెనీ విమాన ఇంధనం, హరిత డీజిల్ తయారీ కై ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు గురించి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఈ రోజు కాకినాడలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది.అర్థ సత్యాలు, అవక తవక లతో కూడిన అసమగ్రమైన పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక ఆధారంగా ప్రజాభిప్రాయ సేకరణ జరపడం చట్ట వ్యతిరేకమని దీనిని రద్దు చేసి సమగ్రమైన నివేదికతో మరల ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది.
ఈ నివేదికలో తెలిపిన గాలి నాణ్యత సంఖ్యలు కొలతల ద్వారా వచ్చినవి కావు.ఈ నివేదికలో ఎనిమిది చోట్ల మూడు నెలలపాటు గాలి కొలిచామని చెప్పారు. ఆ సంఖ్యలను మేము పరిశీలించాం. ప్రాజెక్టు స్థలం పక్కనే ఉన్న కేంద్రంలో, నైట్రోజన్ డయాక్సైడ్ నుంచి సల్ఫర్ డయాక్సైడ్ తీసివేస్తే 26 రోజుల్లో 24 రోజులు సరిగ్గా 7.50 వస్తుంది. ఎనిమిది కేంద్రాల్లో ఏడింటిలో ఇదే తీరు.ఇవి రెండు వేర్వేరు కారణాల వల్ల పుట్టే కాలుష్య కారకాలు. వాటి మధ్య తేడా మూడు నెలలపాటు ఒకే సంఖ్యగా ఉండటం ప్రకృతిలో జరగదు. అంటే ఒక వరుస సంఖ్యలను మరో వరుస నుంచి లెక్కగట్టి రాశారన్నమాట.నివేదికలో మూడో అధ్యాయంలో VOC అనే కాలుష్య కారకం 9 నుంచి 27 మధ్య కొలిచినట్టు ఉంది. అదే నివేదికలో నాలుగో అధ్యాయంలో అదే VOC 352.8 గా వాడారు. పదమూడు రెట్లు ఎక్కువ. ఒకే నివేదికలో రెండు వేర్వేరు సంఖ్యలు. ఏది నిజమో ఎక్కడా చెప్పలేదు.VOC అంటే పెట్రోలియం ఆవిరి. ఈ ప్లాంటుకు అత్యంత సంబంధం ఉన్న కాలుష్యం అదే.
ఏదైనా ప్రమాదం జరిగితే దాని ప్రభావం ఎంత దూరం వరకు వెళ్తుందో లెక్కగట్టి, మ్యాప్ మీద గీతలు గీసి చూపాలి. అదే ప్రమాద అధ్యయనం (QRA) (Quantitative Risk Assessment) పని. ఈ నివేదికలో ఆ మ్యాప్ లేదు.
అంతేకాదు – ప్లాంటులో నిల్వ ఉండే రసాయనాలలో వారు అధ్యయనం చేసినవి రెండే: విమాన ఇంధనం, హరిత డీజిల్. ఇవి కిరోసిన్, డీజిల్ లాంటివి. వీటిలో ప్రమాదం తక్కువ. అధ్యయనం చేయనివి: హైడ్రోజన్ వాయువు, బయో-నాఫ్తా, సహజ వాయువు, ఫ్లేర్లు, రెండు కిలోమీటర్ల పైప్‌లైన్, ఓడల నుంచి ఇంధనం దింపే జెట్టీ, లారీలు నింపే గ్యాంట్రీ. హైడ్రోజన్ చాలా తేలికగా మంటలు అంటుకుంటుంది. బయో-నాఫ్తా కాకినాడ వేడికే ఆవిరై మంట అంటుకునే స్థితికి వస్తుంది.
అంటే ప్లాంటులో ఉన్న వాటిలో అత్యంత సురక్షితమైన రెండింటిని మాత్రమే అధ్యయనం చేసి ఆపేశారు.అందువల్ల వాకలపూడి, తిమ్మాపురం, జగన్నాయకపురం, చొల్లంగి ప్రజలు — ప్రమాదం జరిగితే అది తమ ఊరి దాకా వస్తుందా లేదా అన్నది ఈ నివేదిక చూసి తెలుసుకోలేరు. ఆ సమాచారం ఈ నివేదికలో లేదు.
కాకినాడ తీరంలో మడ అడవులపై ఆధారపడి జీవించే మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. వారి జీవనోపాధిపై ప్రభావం ఎంత అన్నది నివేదిక చెప్పలేదు.మడ అడవుల ప్రాంతం గుండా పైప్‌లైన్ 223 మీటర్ల మేర CRZ-IA వెళ్తుంది. అది అత్యంత రక్షిత ప్రాంతం. దీని వల్ల ఎంత మడ అడవి పోతుంది, ఎలా నిర్మిస్తారు, తిరిగి ఎలా పెంచుతారు — ఈ ప్రశ్నలకు నివేదికలో సమాధానం లేదు. పర్యావరణ ప్రభావాల పట్టికలో ఈ అంశం అసలు లేదు. ఇంతవరకు crz అనుమతులు తీసుకోలేదు. ప్రాజెక్టు ప్రాంతం చిత్తడి నేల వర్గీకరణ లోనికి వస్తుందా రాదా అన్న విషయం ఇంకా నిర్ధారించుకోలేదు.
ఈ ప్రాజెక్టుకు గాలి నాణ్యత కొలతలు జరిగింది 2026 మార్చి నుంచి మే వరకు. కేంద్ర ప్రభుత్వం ఏమేం అధ్యయనం చేయాలో చెబుతూ నిబంధనలు (TOR) ఇచ్చింది జూలై 29న. భూమి కేటాయింపు జరిగింది జూన్ 27న.అంటే ప్రభుత్వం చెప్పకముందే, భూమి రాకముందే కొలతలు జరిగాయి. ఏ ప్రభుత్వ సంస్థా చూడలేదు. తర్వాత ఆ పని జరిగిందో లేదో ఎవరూ నిర్ధారించలేరు. స్ధానిక పంచాయితీ లలో నివేదిక ప్రతిని అందుబాటులో ఉంచలేదు, స్థానికులకు సరైన సమాచారం ఇవ్వలేదు.
ఈ నివేదికతో జటపరిచిన అనుబంధం – vi, పర్యావరణ ప్రమాద అంచనాలో, సెక్షన్ 7.3 లో కొనార్డ్ అనే యు కే కి చెందిన వ్యర్థాల నిర్వహణ సంస్థకి సంబందించిన వివరాలు వచ్చాయి. ఇది ఖచ్చితంగా ఇంటర్నెట్ నుండి సమాచారాన్ని కాపీ చేయడం వల్లనే జరిగింది.
ఇన్ని అవకతవకలతో కూడిన పర్యావరణ ప్రభావ నివేదిక ఆధారంగా ప్రజాభిప్రాయ సేకరణ అన్యాయం, ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికున్న నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. మానవ హక్కుల వేదిక నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై రాజేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ రవి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి ఎం గౌరవ్ ఈ ప్రజాభిప్రాయ సేకరణ లో పాల్గొన్నారు.
వై రాజేష్, 9966631796,
కాకినాడ,
17-09-2026.