అధికారుల అలసత్వం వల్లే యువకుడుపై ఆక్వా రైతుల దాడి

ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో అక్రమ ఆక్వా సాగుపై హైకోర్టు ఉత్తర్వులని అమలు చేయటంలో అలసత్వం వహించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, బాధితుడు చిక్కం వీరదుర్గాప్రసాద్ పై దాడికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, అక్రమ ఆక్వా సాగుపై హై కోర్టు ఉత్తర్వులని అమలు పరచాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది.

ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామానికి చెందిన చిక్కం వీరదుర్గాప్రసాద్(30) గ్రామంలో అక్రమ ఆక్వా చెరువుల కాలుష్యానికి వ్యతిరేకంగా గత పది ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు. పలుమార్లు అధికారులకి ఫిర్యాదులు ఇవ్వడంతో పాటు, హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. 2023 మార్చిలో అక్రమ ఆక్వా చెరువులని వెంటనే నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దాని ఆధారంగా మళ్ళీ అధికారులని, కలెక్టర్లను వీరదుర్గాప్రసాద్ ఆశ్రయించాడు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవి ఆక్వా జోన్ లో లేనందున ఆ చెరువులను వెంటనే ఆపి వేయాలని ఆదేశించగా ఆక్వా రైతులు నిలిపివేసారు.

అయితే ఇటీవల మళ్ళీ కొందరు ఆక్వా రైతులు సాగు మొదలుపెట్టడంతో వీరదుర్గాప్రసాద్ రెవిన్యూ, ఫిషరీస్ అధికారులకి ఫిర్యాదు చేశాడు. క్షేత్ర స్థాయిలో ఆధారాలు పరిశీలన చేయాల్సిన అధికారులు ఆ పని చేయకుండా వీరదుర్గా ప్రసాద్ నే ఆధారాలు సేకరించమని అన్నారు. దానితో ఈ నెల పదవ తేదీ సాయంత్రం 3 గంటల సమయంలో అక్రమ ఆక్వా సాగు కొనసాగుతున్న ప్రాంతానికి వీరదుర్గాప్రసాద్ వెళ్లి ఆధారాలు సేకరిస్తుండగా అక్కడి ఆక్వా రైతులు గనిశెట్టి సత్యనారాయణ, గనిశెట్టి వెంకటరాజు, గనిసెట్టి శ్రీనివాసరావు, చిక్కం గాంధీ అనేవారు వీరదుర్గాప్రసాద్ ని గుంజకి కట్టేసి రెండు గంటల పాటు కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు.

ఈ నేపథ్యంలో మానవ హక్కుల వేదిక సభ్యులు అమలాపురం ఏరియా ఆసుపత్రిలో బుధవారం బాధితుడిని కలిసి, నిజనిర్ధారణ చేసారు. ఈ నిజనిర్ధారణలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ ఇక్బాల్, నామాడి శ్రీధర్, కార్యవర్గ సభ్యులు పి.పవన్ పాల్గొన్నారు.

నామాడి శ్రీధర్,
ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా,
మానవ హక్కుల వేదిక.

అమలాపురం,
11 డిసెంబర్ 2024.

Related Posts

Scroll to Top