చిలకలూరిపేట బస్సు దహనం కేసులో 32 సంవత్సరాలకి పైగా కారాగార శిక్ష అనుభవిస్తున్న సాతులూరి చలపతి రావు, గంటెల విజయవర్ధన రావు లను విడుదల చేయమని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మానవ హక్కుల వేదిక (HRF) కోరుతున్నది.
దీనికి సంబంధించి ఎస్ స్వప్న వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (W.P.NO. 44501/2018) కేసులో ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు ఏప్రిల్ 9, 2025 నాడు ఇచ్చిన తీర్పుని మీ దృష్టికి తీసుకువస్తున్నాము. నిందితులకి శిక్ష పడినప్పుడు లేదా నిందితులకి గవర్నర్/రాష్ట్రపతి క్షమాభిక్ష లభించినప్పుడు అమలులో ఉన్న రెమిషన్ (ముందస్తు విడుదల) విధానాన్ని అనుసరించి ఖైదీల రెమిషన్ దరఖాస్తులని పరిశీలించాలి అని హై కోర్టు ఈ తీర్పులో స్పష్టం చేసింది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అక్టోబర్ 2021 నాటికి ఆంధ్ర ప్రదేశ్ కారాగారాలలో 20 సంవత్సరాలకి పైగా శిక్ష పూర్తి చేసుకున్న ఖైదీల సంఖ్య 8. వారిని వివిధ కారణాల వల్ల నేటి వరకు విడుదల చేయలేదు. ఈ 8 మందిలో ఉరి శిక్ష పడి జీవిత ఖైదుగా క్షమాభిక్ష పొందినవారు 3. వారు సాతులూరి చలపతి రావు, గంటెల విజయవర్ధన రావు, మానేరుపుట్టు తంగప్పన్ కృష్ణ కుట్టి. ఖైదీల ముందస్తు విడుదల గురించి ఇంతకమునుపు వచ్చిన తీర్పులను ఎత్తిపడుతూ, హై కోర్టు ఈ విధంగా పేర్కొంది- ఖైదీల ఉరి శిక్ష జీవిత ఖైదుగా మారినప్పుడు అమలులో ఉన్న [రెమిషన్] విధానాన్ని పరిగణలోకి తీసుకుని వారి ముందస్తు విడుదల దరఖాస్తులను పరిశీలించాలి.
చలపతి రావు, విజయవర్ధన రావు లకి ఉరి శిక్ష 1995లో విధించగా, 1998లో నాటి రాష్ట్రపతి కె ఆర్ నారాయణన్ వారి ఉరి శిక్షని జీవిత ఖైదుగా మార్పు చేశారు. ఆ సమయంలో అమలులో ఉన్న రెమిషన్ విధానం జి. ఓ. 193 (తేదీ: 11.08.1997). ఈ జి. ఓ. లో ఉరి శిక్ష పడి జీవిత ఖైదుగా శిక్ష మార్పు లభించిన వారు ముందస్తు విడుదలకు అనర్హులు అనే నిబంధన లేనే లేదు. దీని తరువాత వచ్చిన విధానాలలో ఈ నిబంధనను చేర్చారు. అప్పటినుండి నేటి వరకు కూడా ఈ నిబంధన కొనసాగుతున్నది. చలపతి రావు, విజయవర్ధన రావు ఇప్పటికే 32 సంవత్సరాలు శిక్ష అనుభవించారు, కారాగారంలో ఉంటూనే వివిధ విద్యాభ్యాస పట్టాలు పొందారు, తమని తాము సంస్కరించుకున్నారు. ఈ 32 సంవత్సరాలలో వారికి పెరోల్ లభించడం కూడా గగనమైపోయింది అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి.
ఉరి శిక్ష పడి జీవిత ఖైదుగా మార్పు పొందిన వారు ముందస్తు విడుదలకి అనర్హులు అని ప్రస్తుతం ఉన్న రెమిషన్ విధానం చెబుతుంది కాబట్టి వారు అనర్హులు అని ప్రభుత్వం వాదిస్తా వచ్చింది. అయితే, ఇప్పుడు ఏ విధానం అమలు చేయాలి అనే విషయంలో హై కోర్టు ఇప్పుడు పూర్తి స్పష్టత ఇచ్చింది.
అలాగే, సి ఆర్ పి సి/ బి ఎన్ ఎస్ ఎస్ లలో, 2003 లో జాతీయ మానవ హక్కుల కమీషన్ ఖైదీల ముందస్తు విడుదల గురించి జారీ చేసిన మార్గదర్శకాలలో ఉన్న మానవీయ స్పృహని ఆకళింపు చేసుకుంటూ ప్రస్తుతం అమలులో ఉన్న రెమిషన్ విధానాన్ని కూడా సరళీకరించమని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
హై కోర్టు వారి ఏప్రిల్ 9 తీర్పు నేపధ్యంలో ముందస్తు విడుదల కోసం చలపతి రావు, విజయవర్ధన రావు ల దరఖాస్తుని పరిశీలించి, వారిని విడుదల చేయమని, తమ జీవితాలని పునర్నిర్మించుకునే అవకాశం వారికి కలిపించమని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది.
వై. రాజేష్ (HRF ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
జి. రోహిత్ (HRF ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి)
11.04.2025,
విజయవాడ.